వైన్‌స్టీన్ దాడి మీద గళం విప్పిన ఉమా తుర్మాన్

  • 4 ఫిబ్రవరి 2018
ఉమా తుర్మాన్ Image copyright Getty Images

ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఉమా తుర్మాన్ తనపై సినీ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

కిల్ బిల్, పల్ప్ ఫిక్షన్, మై సూపర్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో సాహసోపేతమైన కథానాయిక పాత్రల్లో నటించిన ఉమా తుర్మాన్ తాను వైన్‌స్టీన్ గురించి గొంతు విప్పుతానని కొద్ది నెలల కిందటే సోషల్ మీడియాలో ప్రకటించారు.

అతడితో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా 'న్యూయార్క్ టైమ్స్' పత్రికలో వ్యాసంగా రాశారు.

వైన్‌స్టీన్ 1990ల్లో లండన్‌లో అతడు బసచేసిన ఒక హోటల్ రూమ్‌లో తనను కింద పడేసి అసభ్యంగా ప్రవర్తించాడని, తన మర్మావయావాలను ప్రదర్శించే ప్రయత్నం చేశాడని, తాను పెనుగులాడి పాకుతూ తప్పించుకోగలిగానని ఆమె అందులో చెప్పారు.

అయితే ఉమా తుర్మాన్‌పై దాడి చేసినట్లు చెప్తున్న మాటలు ‘అవాస్తవం’ అని హార్వే వైన్‌స్టీన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

టీనేజీ వయసులో తనకన్నా 20 ఏళ్ల పెద్దవాడైన ఒక నటుడు తనను బలవంతం చేసి సెక్స్ చేశాడని కూడా ఉమా తుర్మాన్ తెలిపారు.

ఉమా వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. ‘‘ఇది నెమ్మదిగా సాగుతుండటం నాకు సంతోషంగా ఉంది - నువ్వు బుల్లెట్‌కి అర్హుడివి కాదు’’ అంటూ ఆమె గత నవంబర్‌లో వైన్‌స్టీన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడు వైన్‌స్టీన్ మీద ఉమా తుర్మాన్ నిర్దిష్ట ఆరోపణలు ఏవీ చేయలేదు. ఆమె శనివారం న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ‘దిస్ ఈజ్ వై ఉమా తుర్మాన్ ఈజ్ యాంగ్రీ’ (ఉమా తుర్మాన్ ఆగ్రహం ఇందుకే) శీర్షికతో రాసిన 3,000 పదాల వ్యాసంలో తన ఆరోపణలను వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హార్వే వైన్‌స్టీన్ కేంద్రంగా వెల్లువెత్తుతున్న లైంగిక దాడుల ఆరోపణలు హాలీవుడ్‌ను కుదిపేశాయి

ఉమా తుర్మాన్ ఏం చెప్తున్నారు?

కెరీర్ ఆరంభంలో తనకు 16 ఏళ్ల వయసున్నపుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఉమా తుర్మాన్ ఆ వ్యాసంలో వెల్లడించారు.

ఒక మన్‌హటన్ నైట్‌క్లబ్ వద్ద తాను ఒక నటుడిని కలిశానని, రాత్రి పొద్దు పోయాక డ్రింక్ కోసం తాను అతడి ఇంటికి వెళ్లినపుడు అతడు తనను బెదిరింపులతో ‘‘బలవంతం’’ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఆ నటుడి పేరును ఆమె చెప్పలేదు.

‘‘చివరికి నేను లొంగిపోయాను. నో చెప్పాలని ప్రయత్నించాను. ఏడ్చాను. నేను చేయగలిగిందంతా చేశాను. తలుపు తాళం వేసివుందని అతడు చెప్పాడు. కానీ నేను గడియ తీసే ప్రయత్నం చేయలేదు’’ అని ఆమె న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రికకు వివరించారు.

‘‘నాకు గుర్తుంది.. నేను ఇంటికి వెళ్లిన తర్వాత అద్దం ముందు నిల్చుని నా చేతుల వైపు చూసుకున్నాను. అవి రక్తమోడుతూనో గాయపడో లేనందుకు నాకు చాలా కోపం వచ్చింది’’ అని పేర్కొన్నారు.

Image copyright Getty Images

వైన్‌స్టీన్ మీద ఆమె చేసిన ఆరోపణలు.. 1994లో వైన్‌స్టీన్ నిర్మాతగా క్విన్‌టిన్ టరాన్టినో సినిమా ‘పల్ప్ ఫిక్షన్’ విజయవంతం అయిన తర్వాతి కాలంలో చోటుచేసుకున్నాయి. లండన్‌లోని సవాయ్ హోటల్‌లో అతడు బసచేసిన సూట్‌లో ఆ ఘటన జరిగినట్లు ఉమా పేర్కొన్నారు.

‘‘అతడు నన్ను కిందకు తోసేశాడు. నా మీద బలంగా పడటానికి ప్రయత్నించాడు... అసహ్యకరమైన పనులన్నీ చేశాడు’’ అని ఆమె 'న్యూయార్క్ ‌టైమ్స్‌'తో చెప్పారు.

‘‘కానీ అతడు తన శక్తినంతా ప్రయోగించి నన్ను బలవంతం చేయలేదు. నేను ఒక జంతువులాగా.. ఒక బల్లిలాగా పాకుతూ తప్పించుకున్నాను’’ అని వివరించారు.

ఆ మరుసటి రోజు తనకు ఒక పుష్పగుచ్ఛంతో పాటు ‘‘నీకు గొప్ప సహజ స్వభావం ఉంది’’ అని రాసిన ఒక నోట్ అందిందని ఉమా తుర్మాన్ చెప్పారు. ఆ తర్వాత వైన్‌స్టీన్ సహాయకులు కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తనకు ఫోన్ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తను నటించిన క్విన్‌టిన్ టరాన్టినో సినిమా 'పల్ప్ ఫిక్షన్' విజయవంతం అయిన తర్వాతి కాలంలో వైన్‌స్టీన్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఉమా తుర్మాన్ పేర్కొన్నారు

హార్వే వైన్‌స్టీన్ స్పందన ఏమిటి?

ఉమా తుర్మాన్ కథనం ప్రచురితమైన నేపథ్యంలో హార్వే వైన్‌స్టీన్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

వైన్‌స్టీన్‌కు, తుర్మాన్‌కు మధ్య బలమైన బంధాన్ని వివరించే ఫొటోలను ఆయన బృందం న్యూయార్క్ టైమ్స్‌కు పంపించినట్లు అందులో పేర్కొన్నారు.

హార్వే వైన్‌స్టీన్, ఉమా తుర్మాన్‌లు సినిమా ప్రీమియర్ ఫంక్షన్లు, పార్టీల్లో ’’స్నేహపూర్వకంగా ఉన్న ఫొటోలు’’ తమకు అందాయని ఆ వార్తాపత్రిక తెలిపింది.

‘‘25 ఏళ్ల కిందట పారిస్‌లో సరసపూరిత సంభాషణల అనంతరం ఉమా తుర్మాన్ సంకేతాలను పొరపాటుగా అర్థంచేసుకోవటం వల్ల ఇంగ్లండ్‌లో ఆమె పట్ల వైన్‌స్టీన్ అనుచితంగా ప్రవర్తించినట్లు వైన్‌స్టీన్ అంగీకరించారు. అందుకుగాను ఆయన వెంటనే క్షమాపణ చెప్పారు. బాగా బాధపడ్డారు. అయితే భౌతికంగా దాడి చేసినట్లు ఆమె చెప్తున్న మాటలు అవాస్తవం’’ అని ఆయన బృందం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

‘‘తుర్మాన్ ఈ ఆరోపణలను బహిర్గతం చేయటానికి 25 సంవత్సరాలు ఎందుకు ఆగారనేది వైన్‌స్టీన్‌కి ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని ఆ బృందం వ్యాఖ్యానించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)