మాల్దీవుల్లో ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

  • 5 ఫిబ్రవరి 2018
అరెస్టయిన ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ ప్రదర్శన చేపట్టిన ప్రజలు Image copyright Reuters
చిత్రం శీర్షిక అరెస్టయిన ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ ప్రదర్శన చేపట్టిన ప్రజలు

మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం 15రోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఎమర్జెన్సీ సమయంలో అనుమానితుల్ని ఎవరినైనా అరెస్టు చేసే అధికారం భద్రతా దళాలకు ఉంటుంది.

ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటును సస్పెండ్ చేసింది. దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి సుప్రీం కోర్టు ఎలాంటి చర్యలు చేపట్టినా వాటిని అడ్డుకోవాలని ప్రభుత్వం ఆర్మీని ఆదేశించింది.

మరోపక్క మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమెద్ నషీద్‌‌ను విచారించడం రాజ్యాంగ విరుద్ధమనీ, అరెస్టు చేసిన తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలనీ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏకంగా పార్లమెంటునే రద్దు చేసింది.

‘దేశ భద్రతను సంక్షోభంలోకి నెట్టేసే పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని మాకు సమాచారం అందింది. అధ్యక్షుడిని అరెస్టు చేయడానికి చేపట్టే ఎలాంటి చర్య అయినా, అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది.

అందుకే రాజ్యాంగ విరుద్ధంగా ఉండే ఎలాంటి ఆదేశాల్నీ అమలు చేయొద్దని పోలీసుల్నీ, ఆర్మీనీ కోరాం’ అని మాల్దీవుల అటార్నీ జనరల్ మొహమద్ అనిల్ తెలిపారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మాల్దీవులు అధ్య‌క్షుడు అబ్దుల్లా య‌మీన్‌

అసలేం జరిగింది?

అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం 9మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలను అరెస్టు చేసింది. కానీ కోర్టు ఆ అరెస్టులు చెల్లవని పేర్కొంటూ వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీశాయి. మొత్తంగా 12మంది ఎంపీల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది.

ఆ పరిణామంతో పార్లమెంటులో ప్రతిపక్షానికి మెజారిటీ లభించే అవకాశం ఉంది. దాంతో అధికార పార్టీ కోర్టు నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ పార్లమెంటును సస్పెండ్ చేసి దేశంలో ఎమర్జెన్సీ విధించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం