మాల్దీవుల్లో సంక్షోభం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్టు.. మాజీ అధ్యక్షుడు గయూమ్‌ నిర్బంధం

  • 6 ఫిబ్రవరి 2018
ప్రతిపక్షాల మద్దతుదారులు నిరసనలకు దిగుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు Image copyright Reuters
చిత్రం శీర్షిక ప్రతిపక్షాల మద్దతుదారులు నిరసనలకు దిగుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. పార్లమెంటును సస్పెండ్ చేసి సోమవారం 15 రోజులపాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం, కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ కూడా నిర్బంధంలో ఉన్నారు.

మంగళవారం తెల్లవారుజామున ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తోపాటు మరో న్యాయమూర్తి అలీ హమీద్‌ను విచారణ నిమిత్తం అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.

వీరిద్దరిపై ఉన్న ఆరోపణలు ఏమిటి, జరుగుతున్న విచారణ ఏమిటి అనే వివరాలేవీ పోలీసులు వెల్లడించలేదు.

సోమవారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టును పోలీసులు చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తిని, మరో న్యాయమూర్తిని అరెస్టు చేసిన తర్వాత మిగతా న్యాయమూర్తులను తమ నియంత్రణలో ఉంచుకున్నట్లు సమాచారం అందింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనతో సంక్షోభం

వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు గత వారం ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.

తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది.

మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడు ఆయనే.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తానని ప్రకటించిన మాల్దీవుల పోలీసు కమిషనర్‌ను ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌ను అభిశంసించేందుకు లేదా పదవీచ్యుతుడిని చేసేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా అడ్డుకోవాలని సైన్యాన్ని ఆదేశించింది.

Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక ప్రవాసంలో ఉన్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్

అబ్దుల్లా యామీన్ రాజీనామా చేయాలి: నషీద్

ప్రతిపక్షంతో జట్టు కట్టిన మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌ను అధికారులు ఆయన ఇంట్లో నిర్బంధంలోకి తీసుకొన్నారు.

తాను ఏ తప్పూ చేయలేదని, తనను ప్రభుత్వం అరెస్టు చేయజాలదని మద్దతుదారులను ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో అబ్దుల్ గయూమ్ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలని వారికి ఆయన పిలుపునిచ్చారు.

మాజీ అధ్యక్షుడు నషీద్ బీబీసీతో మాట్లాడుతూ- అబ్దుల్లా యామీన్ ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమన్నారు. అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవులు సుమారు 1200 దీవుల సముదాయం. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే వెన్నెముక.

అబ్దుల్లా యామీన్ 2013లో అధికార పగ్గాలు చేపట్టారు.

అప్పటి నుంచి దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రత కొరవడ్డాయనే విమర్శలు, ప్రత్యర్థుల నిర్బంధంపై విమర్శలు ఉన్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాల మద్దతుదారులు నిరసనలకు దిగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే వెన్నెముక

అమెరికా, బ్రిటన్ నిరసన

అబ్దుల్లా యామీన్ ప్రభుత్వ చర్యలపై అంతర్జాతీయంగా నిరసన వ్యక్తమవుతోంది.

మాల్దీవుల పరిణామాలు విచారం కలిగిస్తున్నాయనింటూ ఆ దేశ ప్రజలకు అమెరికా సంఘీభావం ప్రకటించింది.

రాజకీయ ఖైదీల విడుదలకు సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమల్లో పోలీసులు విఫలమయ్యారని అమెరికా విదేశీ వ్యవహారాలశాఖ ఆక్షేపించింది. ప్రతిపక్షానికి చెందిన ప్రతి కీలక రాజకీయ నాయకుడిని ప్రభుత్వం జైలు పాలు చేసిందని, లేదా దేశం వీడేలా చేసిందని విమర్శించింది.

ఎమర్జెన్సీని ఎత్తివేయాలని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్‌కు బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. మాల్దీవుల్లో ప్రజాస్వామిక సంస్థలను దెబ్బతీస్తున్నారంటూ ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)