అభిప్రాయం: మాల్దీవులలో ‘మహా భారతం’, భారత్ ధర్మసంకటం

  • 6 ఫిబ్రవరి 2018
మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ Image copyright Reuters
చిత్రం శీర్షిక మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్

దేశంలోని రాజకీయ ప్రతిష్టంభన దృష్ట్యా మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధించారు.

మాల్దీవుల సుప్రీంకోర్టు రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని ఆదేశించగా, అధ్యక్షుడు కోర్టు ఆదేశాలను పాటించడానికి నిరాకరించారు.

అయితే సుప్రీం ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి మాల్దీవుల అధ్యక్షుడు ఒక రకమైన ఇరకాటంలో పడ్డారు.

చాలా కాలం నుంచి అబ్దుల్లా దేశంలోని ప్రజాస్వామిక సంస్థలను బలహీనపరిచేందుకు, మొత్తం అధికారాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొదట తన ప్రత్యర్థులను జైలులో పెట్టిన ఆయన, క్రమంగా మొత్తం అధికారానికి కేంద్రబిందువుగా మారారు.

ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన తన పంథాను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Image copyright AFP

సైన్యం పాత్ర

అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆయన తన చివరి పాచికను ఉపయోగిస్తున్నట్లు, ఇది తప్ప ఆయనకు వేరే గత్యంతరం లేనట్లు కనిపిస్తోంది.

యామీన్ నిర్ణయాన్ని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ వ్యతిరేకించారు. ఇది కుట్ర అని ఆయన అన్నారు.

అధికారం గనుక మరోసారి నషీద్ చేతుల్లోకి వెళితే, ఆయన యామీన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో సైన్యం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది.

దాంతో పాటు అత్యవసర పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి, తమ వెంట కలిసి వచ్చే మద్దతుదారులతో కలిసి ఎలా ముందుకు సాగుతాయన్న దానిపై భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మోదీ, యామీన్

భారత్ పాత్ర

మాల్దీవులలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో భారతదేశం పాత్ర చాలా కీలకమైంది.

అధికారం కోసం నషీద్, యామీన్‌ల మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్నపుడు భారతదేశం చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నషీద్ ప్రభుత్వాన్ని గద్దె దింపినపుడు, భారత్ దానిని ఖండించడం లేదంటూ, ప్రజాస్వామిక శక్తుల పరిరక్షణ కోసం తన గళాన్ని బలంగా వినిపించడం లేదంటూ విమర్శలు ఎదుర్కొంది.

అయితే మాల్దీవుల విషయంలో భారత్‌కు అనేక స్వప్రయోజనాలు ఉన్నాయని గుర్తించాలి. ఆ దేశం పూర్తిగా చైనా వైపు వెళ్లడం భారతదేశానికి ఇష్టం లేదు.

ప్రస్తుతం భారత్ ఎదుట పలు మార్గాలున్నా, మాల్దీవుల్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

Image copyright Getty Images

చైనా యామీన్‌కు మద్దతు ఇస్తుందా?

దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ బయటి దేశాల ఒత్తిడిని ఏ మాత్రం తట్టుకుంటారో చూడాలి.

పాశ్చాత్య దేశాలు, భారతదేశం కనుక ఒత్తిడి తెస్తే, చైనాకు అనుకూలంగా ఉండటం వల్ల చైనా నుంచి దేశం నుంచి తనకు మద్దతు లభిస్తుందని యామీన్ ఆశిస్తున్నారు.

అయితే చైనా స్వభావాన్ని ఆయన తప్పుగా అంచనా వేసినట్లు కనిపిస్తోంది. చైనా ఎప్పుడూ కూడా ప్రపంచ శక్తులకు వ్యతిరేకంగా ఒక దేశాన్ని వెనకేసుకు వచ్చిన సందర్భాలు లేవు.

అందువల్ల ప్రస్తుతం యామీన్ ఎదుట చాలా తక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)