ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమాన మార్గం ఏది?

  • సైమన్ అట్కిన్సన్ & డానియేలి పాలంబో
  • బీబీసీ న్యూస్
ఎయిర్ ఇండియా విమానం వద్ద అభివాదం చేస్తున్న ఎయిర్ హోస్టెస్

ఆసియా విమానయాన సంస్థలు కొత్త విమానాలకు ఆర్డర్లు ఇస్తూ దూసుకెళ్తున్నాయి. ఇక్కడ కొన్ని ఎయిర్‌పోర్టులు ప్రపంచంలోనే శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి.

అంతేకాదు, ఈ ప్రాంతం విమాన ప్రయాణానికి ఓ ప్రముఖ కేంద్రంగా నిలుస్తోంది.

సింగపూర్‌లో ఆసియా అతి పెద్ద ఎయిర్ షో నిర్వహిస్తున్న వేళ ఈ పరిధిలోని విమానయాన పరిశ్రమ తీరుతెన్నులను పరిశీలిస్తే..

విమాన ప్రయాణంలో ఆసియా ఆధిపత్యం చలాయిస్తోంది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్యను పరిశీలిస్తే 35 శాతం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి ఆసియా అగ్ర భాగాన నిలిచింది.

అంతేకాదు, మార్కెట్‌లో ఆసియా ఎయిర్ లైన్స్ వాటా మరింతగా పెరుగుతోంది. ప్రతి యేటా చైనా నుంచి కోట్ల మంది ప్రయాణికులు తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్నారు.

ఎయిర్‌లైన్ సంస్థ ఐఏటీఏ అంచనా ప్రకారం చైనా 20 ఏళ్లలో అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా నిలుస్తుంది.

2016లో చైనాలో 5.37 కోట్ల మంది విమాన ప్రయాణికులున్నారు. 2036 నాటికి వీరి సంఖ్య 146 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఊహించిన దానికంటే వేగంగా భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని కింద చార్ట్‌ను చూస్తే మనకు అవగమతమవుతుంది.

''మధ్య తరగతి సంపాదన పెరుగుతుండటం, పని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతోనే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది'' అని ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ వరల్డ్ డైరెక్టర్ జనరల్ అంజెలా గిట్టెన్స్ వివరించారు.

టాప్ ఎయిర్‌పోర్టులు ఇక్కడే

ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న 10 ఎయిర్ పోర్టులలో 8 ఆసియా ప్రాంతంలోనే ఉన్నాయిని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఈ 8 ఎయిర్‌పోర్టులలో ఆరు చైనాలోని టియాన్ జిన్, జెంగ్‌జు, హర్బిన్, చోంగ్‌జింగ్ సిటీలలోనే ఉన్నాయి.

ఉదాహరణకు టియాన్‌జిన్ ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలిస్తే 2006‌లో ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య 27 లక్షలు. 2016లో వీరి సంఖ్య 1.68 కోట్లకు పెరిగింది.

అయితే, అత్యంత రద్దీగా ఉన్నంత మాత్రాన అవే ఉత్తమ ఎయిర్‌పోర్టులుగా భావించలేం. ఎందుకంటే సమయపాలన పాటించని చెత్త రికార్డు కూడా చైనా విమానయాన సంస్థలకే ఉంది. సురబయా, బాలీలోని డెన్‌పసర్ ఎయిర్‌పోర్టులతో సహా ఇండోనేషియాలో కొన్ని విమానాశ్రయాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

ప్రయాణికుల సంఖ్యను తీసుకుంటే, బీజింగ్‌లోని షాంఘై, టొక్యోలోని హనెడా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 ఎయిర్‌పోర్టులలో ముందువరసులో నిలిచాయి. ఇందులో అగ్రస్థానంలో ఉంది మాత్రం అట్లాంటా ఎయిర్‌పోర్ట్.

భారతదేశంలో పెరుగుతున్న విమానాలు

ఏ ఎయిర్‌లైన్స్ వేగంగా విస్తరిస్తోందో ఈ చార్ట్‌లో తెలుసుకోవచ్చు.

ఎయిర్‌బస్, బాంబ్రాడియెర్, ఎంబ్రారియర్‌ల డాటా తీసుకుంటే (విమానాల సంఖ్య, ఆర్డర్ ఇచ్చి ఇంకా బయటకురాని విమానాలు పరిగణిస్తే) ఏసియన్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ గణాంకాల ఆధారంగా మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియా 472 ఎయిర్ బస్‌లకు ఆర్డర్ ఇచ్చి అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇండోనేసియా చవక విమానయాన సంస్థ లయన్ ఎయిర్ తన వ్యాపారాన్ని ఎయిర్‌బస్, బోయింగ్ విమానాలతో రెండుగా విభజించింది. మరో 381 విమానాల రాక కోసం అది ఎదురు చూస్తోంది.

ఇక ఇండియా విషయానికి వస్తే, దేశీయ విమాన ప్రయాణం శర వేగంగా విస్తరిస్తోంది. రైల్వేల మీద ఆధారపడకుండా విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇండిగో 400 ఎయిర్ బస్‌లకు ఆర్డర్ ఇచ్చింది. స్పైస్ జెట్ మరో 167 జెట్ విమానాలను ప్రవేశపెట్టబోతోంది. గో ఎయిర్, జెట్ ఎయిర్ వేస్‌లు కొత్త విమానాల గురించి ఎదురు చూస్తున్నాయి.

అయితే, ఈ వరుసలో చైనా ఎందుకు లేదని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త విమానాల కొనుగోలు చైనాలో నిలిచిపోయింది. అత్యధిక విమానాలతో ఇప్పటికే అది ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది.

ఆ విషయంలో అమెరికానే ముందు..

ఎక్కువ విమానయాన సంస్థలు.. ఎయిర్ బస్, బోయింగ్ విమానాలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటివరకు ఆసియానే కొత్త విమానాలను చేజిక్కించుకోవడంలో ముందున్నదనే విషయం గుర్తుంచుకోవాలి.

అయితే, అత్యధిక మంది ప్రయాణికులను చేరవేస్తోంది అమెరికా విమానయాన సంస్థనే. ఈ విషయంలో చైనా మాత్రమే ఆసియాలోని టాప్ 5 లలో ఉంది.

అంతేకాదు15,00 విమానాలతో అత్యధిక విమానాలను కలిగి ఉన్నది కూడా అమెరికా విమాయాన సంస్థే.

మరోవైపు ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్ట్‌గా ఆశ్చర్యకరంగా దక్షిణ కొరియా ముందు వరుసలో నిలిచింది. రాజధాని సోల్ నుంచి జెజు (దక్షిణంలో ఉన్న ద్వీపం)కు వెళ్లే దేశీయ విమాన మార్గమే అత్యంత రద్దీగా ఉంటుందని తేలింది.

చైనా ప్రయాణీకుల సంఖ్య ఎందుకు తగ్గింది?

2016లో ఈ మార్గంలో 1.17 కోట్ల మంది ప్రయాణించారు. ప్రతిరోజు 200 విమానాలు ఈ రెండు చోట్లకు చక్కర్లు కొట్టాయి. దక్షిణ కొరియా పర్యాటక శాఖ లెక్కల ప్రకారం 2016 తో పోల్చితే 2017లో ఇక్కడి వచ్చే చైనా పర్యాటకుల సంఖ్య సగానికి తగ్గింది.

అమెరికా అణు పరీక్షలకు దక్షిణ కొరియా ప్రభుత్వం మద్దతు తెలిపిన నేపథ్యంలో గతేడాది చైనా ప్రభుత్వం దక్షిణ కొరియా పర్యాటక ప్యాకేజీలపై నిషేధం విధించింది. దీంతో 2017లో ఇక్కడికి వచ్చే చైనా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. అయితే, సంఖ్యాపరంగా ప్రయాణికులు తగ్గినా ఇప్పటివరకు రద్దీ మార్గంగా ఇదే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)