చరిత్రలో మహిళలు: ఒక ఆటతో ఓటుహక్కును ఎలా సాధించుకున్నారు?

  • 9 ఫిబ్రవరి 2018
పోస్ట్ కార్డ్ ఉద్యమం Image copyright Prof June Purvis

మాక్కూడా ఓటు హక్కు కావాలని బ్రిటన్‌లో మహిళలు మొట్టమొదటిసారి డిమాండ్ చేసినపుడు, సాధ్యం కాదనే సమాధానం లభించింది.

దీంతో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజల అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం ఒక ఆటను, పోస్టు కార్డులను ఉపయోగించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

19వ శతాబ్దపు చివరి భాగంలో వారు సాగించిన ఆ ప్రచారం సృజనాత్మకతకు మారుపేరుగా నిలిచింది. బ్రిటిష్ పార్లమెంట్ మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయింది.

'సాధ్యం కాదు' అనే సమాధానాన్ని మహిళలు ఒప్పుకోలేదు. అందుకే సృజనాత్మక ప్రచారాన్నే వారు తమ ఆయుధంగా మలచుకున్నారు.

'సఫ్రేజెట్టో' అనే ఒక ఆటను, పోస్టు కార్డుల సాయంతో ఓటు హక్కు కోసం పోరాడిన మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజాభిప్రాయాన్ని శాశ్వతంగా మార్చేశారు.

Image copyright The Women's Library at LSE

'సఫ్రేజెట్టో' ఏమిటి?

చూడడానికి అవి చాలా సాధారణంగా, ఎలాంటి ప్రాముఖ్యతా లేని ఆట వస్తువులుగా కనిపిస్తాయి.

కానీ సరైన చేతుల్లో పడితే, వాటికి సమాజాన్ని మార్చేసే శక్తి ఉందని ఓటు హక్కు కోసం పోరాడిన ఆనాటి మహిళలు నిరూపించారు.

బ్రిటన్‌లో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు తమ భావాలను, అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి ఆటలే మంచి సాధనాలని గ్రహించారు.

ఒక ఆట ద్వారా తమ ఆలోచనలను రాజకీయ వర్గాలూ, తద్వారా చట్టసభల వరకు తీసుకెళ్లవచ్చని వారు భావించారు.

''నిజానికి అది ఒక మంచి మార్కెటింగ్ టూల్'' అని ప్రొఫెసర్ సెనియా పసేటా అన్నారు. బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు ఆమె క్యూరేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక 'సఫ్రేజెట్టో' గేమ్ బోర్డు. ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్లియన్ లైబ్రరీలో మాత్రమే ప్రస్తుతం ఈ బోర్డు ఉంది.

దగ్గర నుంచి చూస్తే, 'సఫ్రేజెట్టో' గేమ్ ఇతర బోర్డులకు భిన్నంగా ఉంటుంది. దీనిలో 16 చిన్న ఆకుపచ్చ పావులు, 5 పెద్ద పావులు ఉంటాయి. ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలను, వాళ్ల నాయకురాళ్లను సూచిస్తాయి. పోలీసులు అడ్డుకునే లోపు 'హౌస్ ఆఫ్ కామన్స్' చేరుకుంటే ఆటలో గెల్చినట్లు.

నిజజీవితంలో మాదిరే, ఈ ఆట మధ్యలో పట్టుబడితే జైలు లేదా ఆసుపత్రి పాలే.

''ఈ ఆటను బ్రిటిష్ మహిళల సామాజిక, రాజకీయ సంస్థ (డబ్యూఎస్‌పీయూ) సభ్యురాళ్లు సృష్టించారు. మహిళలకు ఓటు హక్కు ప్రచారం కోసం నిధులు సేకరించడానికి ఆ ఆటను ఉపయోగించుకున్నారు. ఆ మహిళల వ్యూహం, నాటి సామాజిక పరిస్థితిని వాళ్లెంత బాగా అర్థం చేసుకున్నారు? వాళ్లకు ఎంత సెన్సాఫ్ హ్యూమర్ ఉంది?... ఇలాంటి విషయాలను ఆ ఆట తెలియపరుస్తుంది'' అని ప్రొఫెసర్ పసేటా వివరించారు.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక హౌజ్ ఆఫ్ పార్లమెంటు వెలుపల పడవ మీద మహిళలు నిరసన తెలుపుతున్న చిత్రం

మాస్ కమ్యూనికేషన్‌లో ఇప్పటి ట్వీటర్‌కన్నా ముందున్న మహిళలు

ఓటుహక్కు సాధించాలన్న లక్ష్యం కోసం, మహిళలు అతి తక్కువ నిధులతో తమ పోరాటాన్ని ప్రారంభించారు.

ఆ రోజుల్లో పోస్టల్ సర్వీసుల ద్వారా రోజుకు మూడుసార్లు ఉత్తరాలను డెలివరీ చేసేవారు. అలా దేశంలోని ప్రతి ఇంటికీ, ప్రతి సంస్థకూ తమ సందేశం పంపాలని వారు నిర్ణయించుకున్నారు.

''ఆరోజుల్లో ఓటు హక్కు కోసం పోరాడుతున్న నాయకురాళ్లు, వాళ్ల ర్యాలీల చిత్రాలున్న పోస్టుకార్డులు వేలాది మంది చేతుల్లో కనిపించేవి. అలా వాళ్ల ప్రచారం విస్తృతంగా జరిగింది'' అని ప్రొఫెసర్ పసేటా తెలిపారు.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక ఓటు హక్కు సాధించేందుకు 'సఫ్రేజెట్టో' అనే ఆటతో మహిళలు ఉద్యమం చేశారు. బ్రిటన్‌లో మహిళలకు ఓటుహక్కు లభించి వందేళ్లు పూర్తయ్యాయి.

అప్పుడప్పుడే ఎదుగుతున్న మహిళా నాయకులు పోస్టు కార్టుల ద్వారా ప్రజలకు పరిచయమయ్యారు.

డబ్యూఎస్‌పీయూ వ్యవస్థాపకురాలు ఎమెలీన్ పాంఖర్స్ట్ పాల్గొన్న ర్యాలీలు, ఆమె అరెస్టులకు ఈ కార్డులతో విస్తృత ప్రచారం వచ్చింది.

ఆ రోజుల్లో మీడియాపై నియంత్రణల నేపథ్యంలో - కొన్నిసార్లు ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన వార్తలను చేరవేయడానికి, మద్దతు కూడగట్టడానికి, నిధుల సేకరణకు పోస్టుకార్డుల ఉద్యమం బాగా ఉపయోగపడింది.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక పోస్టుకార్డుపై చిత్రం: 1908 ఫిబ్రవరి 13న విక్టోరియా స్ట్రీట్‌లో డబ్యూఎస్‌పీయూ వ్యవస్థాపకురాలు ఎమెలీన్ పాంఖర్స్ట్ ను అరెస్టు చేశారు.

నెట్‌వర్కింగ్, సాధికారత

ఈ ఉద్యమం ప్రధానంగా మహిళా వాలంటీర్లపై ఆధారపడింది. తద్వారా వారి సాధికారత పెరిగి, మహిళలు తమ శక్తియుక్తులను గ్రహించడం ప్రారంభించారు.

ఈ ఉద్యమం ద్వారా మొదటిసారి మహిళలను - వారి నైపుణ్యాలు, వారు చేపట్టే పనుల ఆధారంగా వర్గీకరించి, వారిని వివిధ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడం ప్రారంభమైంది.

ఈ ఉద్యమంలో పాల్గొన్న నటీమణులు మహిళలు తమ గొంతును ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణను ఇచ్చేవారు. కళాకారులు పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసి ఇచ్చేవాళ్లు. రచయితలు ప్రసంగాలు తయారు చేసి ఇస్తే, టీచర్లు సాయంత్రం క్లాసులు తీసుకునేవాళ్లు.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక 1912 మే 22న ఏర్పాటు చేసిన అవగాహన పోస్టర్

ప్రపంచం తమ మాట వినేట్లు చేశారు

యూకేలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం తీవ్రంగా సాగుతుండగానే వాళ్లు ప్రపంచంలోని ఇతర చోట్ల కూడా మహిళల జీవితాలు, రాజకీయ కార్యకలాపాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి కనబరిచారు.

అప్పటికే న్యూజీల్యాండ్, నార్వేలలో మహిళలకు ఓటు హక్కు లభించింది. కానీ మిగతా చోట్ల మాత్రం వారికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

యూకేలో మహిళల ఓటు హక్కు కోసం జరిగిన పోరాటం, దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మహిళలను ఆ దిశగా కార్యోన్ముఖులను చేసింది.

Image copyright Bodleian Libraries, University of Oxford
చిత్రం శీర్షిక డబ్ల్యూఎస్‌పీయూ ప్రచురించిన వార పత్రిక 'ఓట్ ఫర్ విమెన్' కవర్ పేజీ. అది 30,000 మందికి చేరింది.

ఆనాటి పోరాట యోధురాళ్లకు ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితుల గురించి చాలా అవగాహన ఉందని ప్రొఫెసర్ పసేటా అన్నారు.

దీనికి నాటి వుమెన్స్ సఫ్రేజెట్ జర్నల్, ఓట్స్ ఫర్ వుమెన్ ప్రచురణలే సాక్ష్యం.

బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి ఫిబ్రవరి 6తో వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌లో 'ఫ్రమ్ సాఫో టు సఫ్రేజ్: వుమెన్ హు డేర్డ్' అనే ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

దీనిలో 2 వేల ఏళ్ల నుంచి రాజకీయాలు, సైన్సు, కళల్లో రాణించిన మహిళల చరిత్రను ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)