ప్రపంచంలోనే పవర్‌ఫుల్ రాకెట్ 'ఫాల్కన్ హెవీ': ఇవీ ప్రత్యేకతలు!

  • జోనాథన్ ఆమోస్
  • బీబీసీ సైన్స్ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

ఎలాన్ మస్క్ కారును అంతరిక్షంలోకి మోసుకుపోయిన ఫాల్కన్ హెవీ

అమెరికా ఎంటర్‌ప్రెన్యూర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన కొత్త రాకెట్ 'ఫాల్కన్ హెవీ'ని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

ఈ భారీ రాకెట్ అట్లాంటిక్ సముద్రం మీదుగా విజయవంతంగా దూసుకుపోయింది.

ఈ కొత్త రాకెట్ మొదటిసారి ప్రయోగంలో విజయవంతమయ్యే అవకాశాలు కేవలం 50 శాతమే అని ప్రయోగానికి ముందు మస్క్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఈ కారును, డమ్మీని అంగారకుని కక్ష్య వైపు పంపాలనేది లక్ష్యం

ఈ ప్రయోగంతో ఫాల్కన్ హెవీ ఇప్పటివరకు ఉన్న లాంఛ్ వెహికల్స్‌లో అత్యంత సామర్థ్యం కలిగిన రాకెట్‌గా మారింది.

ఈ రాకెట్‌కు అత్యధికంగా 64 టన్నులు అంటే సుమారు ఐదు డబుల్ డెక్కర్ బస్సుల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.

ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా భావిస్తున్న డెల్టా IV హెవీ రాకెట్ దీనిలో సగం బరువును మాత్రమే మోసుకెళ్లగలదు.

అయితే ఖర్చు విషయంలో డెల్టా IVతో పోలిస్తే ఫాల్కన్ హెవీ రాకెట్‌కు దానిలో మూడో వంతు మాత్రమే ఖర్చు అయిందని మస్క్ చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఫ్లోరిడా తీరానికి తిరిగి చేరుకున్న రెండు బూస్టర్లు

ఈ ప్రయోగం ద్వారా ఎలాన్ మస్క్ తన టెస్లా స్పోర్ట్స్ కారును అంతరిక్షంలోకి పంపారు. ఆ కారులో స్పేస్ సూట్ ధరించిన ఒక డమ్మీని కూర్చోబెట్టారు.

ఫాల్కన్ హెవీని స్పేస్ ఎక్స్‌కు చెందిన మూడు ఫాల్కన్ 9 రాకెట్లను ఏకం చేయడం ద్వారా రూపొందించారు. రాకెట్ ప్రయోగం తర్వాత మూడు బూస్టర్ స్టేజీలు భూమిపైకి తిరిగి వచ్చాయి.

రెండు బూస్టర్లు కెనడీ స్పేస్ సెంటర్ దక్షిణ తీరాన్ని చేరుకోగా, మూడోది అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో కూలిపోయింది.

ఈ భారీ రాకెట్ ప్రయోగంతో మస్క్, స్పేస్‌ఎక్స్ సంస్థలకు భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశముంది:

  • అమెరికా ఇంటలిజెన్స్, మిలటరీలు మరింత భారీ ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం.
  • ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తరణ కొరకు అంతరిక్షంలోకి కొన్ని వేల ఉపగ్రహాలను పంపాలని మస్క్ యోచిస్తున్నారు.
ఫొటో క్యాప్షన్,

ఫాల్కన్ హెవీ రాకెట్

  • మరింత భారీ, సామర్థ్యం కలిగిన రోబోలను అంగారకుని పైకి పంపే అవకాశం. మరింత దూరంగా ఉండే గురుగ్రహం, శనిగ్రహం లేదా ఇతర చంద్రులను సందర్శించే అవకాశం.
  • మరింత భారీ టెలిస్కోప్‌లు. హబుల్ శ్రేణిలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను వచ్చే ఏడాది ప్రయోగించనున్నారు.
ఫొటో క్యాప్షన్,

ఫాల్కన్ హెవీ నిజానికి మూడు ఫాల్కన్ 9 రాకెట్ల కలయిక

తక్కువ ఖర్చు, బూస్టర్ల రికవరీ, వాటి పునర్వినియోగమే ఈ రాకెట్ ప్రయోగంలో అత్యంత కీలకమైన అంశాలని ఎలాన్ మస్క్ తెలిపారు.

ఈ ప్రయోగంతో మిగతా రాకెట్ ప్రయోగ సంస్థలపై తమకు ఆధిపత్యం లభిస్తుందని స్పేస్‌ఎక్స్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)