ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?

  • 8 ఫిబ్రవరి 2018
భారతీయ సైనికులు Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారతీయ సైనికులు

నవంబర్ 3, 1988న మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ భారత్‌కు రావాల్సింది. ఆయనను తీసుకువచ్చేందుకు వెళ్లిన భారతీయ విమానం గాలిలో ఉండగానే, భారత ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం దిల్లీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

రాజీవ్ గాంధీ గయూమ్‌తో మాట్లాడి, ఆయన తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. అయితే గయూమ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్లాన్ చేసిన మాల్దీవుల వ్యాపారి అబ్దుల్లా లుతుఫి, ఆయన సహాపరాధి సిక్కా అహ్మద్ ఇస్మాయిల్ మానిక్‌లు మాత్రం ఈ తిరుగుబాటును వాయిదా వేసుకోగూడదనే నిర్ణయించుకున్నారు.

గయూమ్ మాలేలో లేని సమయంలో తిరుగుబాటు లేవదీయాలనేది వాళ్ల ఆలోచన. అప్పటికే వాళ్లు దీని కోసం శ్రీలంక తీవ్రవాద సంస్థ 'ప్లోట్' (పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలమ్)కు చెందిన ఫైటర్లను స్పీడ్ బోట్ల ద్వారా టూరిస్టుల రూపంలో దేశంలోకి రమ్మని చెప్పి ఉన్నారు.

ఆ సమయంలో ఏకే బెనర్జీ మాల్దీవుల భారత హై కమిషనర్‌. గయూమ్ పర్యటన నేపథ్యంలో ఆయన అప్పటికే దిల్లీలో ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మౌమూన్ అబ్దుల్ గయూమ్

బలగాలు పంపాలని భారత్‌కు విజ్ఞప్తి

నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఏకే బెనర్జీ, ''ఆ సమయంలో నేను దిల్లీలోని మా ఇంటిలో దీర్ఘనిద్రలో ఉన్నా. హఠాత్తుగా ఉదయం 6.30 సమయంలో నా ఫోన్ మోగింది.''

''మాలేలో తిరుగుబాటు జరిగిందని నా కార్యదర్శి చెప్పాడు. వీధుల్లో కాల్పులు జరుగుతున్నాయని అన్నాడు. తన భవనంలో సురక్షితంగా ఉన్న అధ్యక్షుడు గయూమ్ భారత్ వెంటనే తన బలగాలను పంపి తనను రక్షించాలని విజ్ఞప్తి చేశాడు.''

అటు, విదేశాంగ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ కుల్దీప్ సహదేవ్‌కు కూడా మాలేలోని భారత హై కమిషన్ కార్యాలయం నుంచి మరో కాల్ వచ్చింది. ఆయన వెంటనే ప్రధాని కార్యాలయ జాయింట్ సెక్రటరీ రోనెన్ సేన్‌కు ఈ విషయాన్ని తెలిపారు.

దీంతో సేన్‌ వెంటనే సౌత్ బ్లాక్‌లోని ఆర్మీ ఆపరేషన్ రూమ్‌లో ఒక హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కలకత్తా నుంచి తిరిగి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ అందులో పాల్గొన్నారు.

చిత్రం శీర్షిక బీబీసీ స్టూడియోలో రెహాన్ ఫజల్‌తో సుశాంత్ సింగ్

'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కో ఎడిటర్ సుశాంత్ సింగ్ తన పుస్తకం 'మిషన్ ఓవర్సీస్: డేరింగ్ ఆపరేషన్స్ బై ద ఇండియన్ మిలటరీ'లో- ''రోనెన్ సేన్, కుల్దీప్ సహదేవ్‌లతో కలిసి రాజీవ్ గాంధీ మిలటరీ ఆపరేషన్ రూమ్‌లో సమావేశమయ్యారు. నాటి డిప్యూటీ హోమ్ మంత్రి పి. చిదంబరం మాలేకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పంపాలని భావించినా, సైన్యం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది'' అని రాసుకొచ్చారు.

''మాలేలోని హల్‌హ్యూల్ విమానాశ్రయాన్ని వందలాది మంది తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నట్లు 'రా' చీఫ్ ఆనంద్ స్వరూప్ వర్మ తెలిపారు. అయితే దీనిపై నోరు విప్పొద్దని రోనెన్ సేన్ ఆయనకు సూచించారు. నిజానికి మాలేలో ఏం జరుగుతుందో రోనెన్ సేన్‌కు బాగా తెలుసు'' అని సుశాంత్ సింగ్ తెలిపారు.

Image copyright Getty Images

టెలిఫోన్ రిసీవర్‌ను క్రాడిల్ మీద ఎందుకు పెట్టలేదు?

''మాల్దీవుల విదేశాంగ కార్యదర్శి జకీ సరాసరి 7, రేస్ కోర్స్ రోడ్‌కు ఫోన్ చేశారు. దానిని సేన్ స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. జకీ ఆయనకు తిరుగుబాటుదారులు సరిగ్గా తన ఎదురుగా ఉన్న టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

సేన్ ఆయనకు రిసీవర్‌ను క్రాడిల్ మీద పెట్టవద్దని సూచించారు. అలా చేస్తే టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌లోని బోర్డు మీద ఉన్న లైటు ఆరిపోయి, తిరుగుబాటుదారులకు ఆయన ఎవరితోనే మాట్లాడుతున్నట్లు తెలిసిపోతుందని వివరించారు. అందువల్ల 18 గంటల పాటు, ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఆ రిసీవర్‌ను క్రాడిల్ మీద పెట్టలేదు'' అని సుశాంత్ సింగ్ తన పుస్తకంలో వివరించారు.

అంతకు ముందే ఈ సమావేశంలో ఆగ్రాకు చెందిన 50 పారా బ్రిగేడ్ సైనికులు పారాషూట్ల ద్వారా మాలేలో దిగడంపై చర్చ జరిగింది. అయితే ఈ ప్లాన్‌లో ఒక సమస్య వచ్చిపడింది. పారాషూట్లతో సముద్రంలో కాకుండా, నేలపై సురక్షితంగా దిగే ఒక 'డ్రాప్ జోన్' వాళ్లకు కావాల్సి వచ్చింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రస్తుతం మాల్దీవుల పరిస్థితిలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్

మాల్దీవుల పేరు కూడా వినని బ్రిగేడియర్

'డ్రాప్ జోన్' కోసం 12 ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల పరిమాణంలోని స్థలం అవసరం. మాలేలో అంత స్థలం లభించడం అసాధ్యం. అందువల్ల భారత సైనికుల పారాషూట్లు సముద్రంలో దిగే అవకాశం ఎక్కువ. ఇదే జరిగితే, వాళ్లు తీరాన్ని చేరుకోవడం అసాధ్యమవుతుంది.

అందువల్ల ఆ ప్లాన్‌ వద్దనుకున్నారు.

ఆ రోజు సమావేశంలో పాల్గొన్నవారికి హల్‌హ్యూల్ విమానాశ్రయం పొడవెంతో కూడా తెలీదు. దాంతో రాజీవ్ గాంధీ మాలేకు వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ పైలట్లను సంప్రదించాలని సూచించారు.

ఆ సమావేశం తర్వాత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రోడ్రిగ్జ్ పారాట్రూపర్లను సిద్ధంగా ఉంచాలని బ్రిగేడియర్ బల్సారాను ఆదేశించారు. అప్పటికి బల్సారా మాల్దీవుల పేరు కూడా విని ఉండలేదు.

అప్పటికప్పుడు ఆయన అట్లాస్‌ను తెప్పించుకుని, భారత దక్షిణ తీరానికి నైరుతి వైపు ఉన్న 1200 ద్వీపాలలో మాల్దీవులు ఉన్నాయని, అవి భారత తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని తెలుసుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హల్‌హ్యూల్ విమానాశ్రయం

భారత సైన్యం ఏర్పాట్లు సరిపోలేదు

బల్సారా తన అధికారులిద్దరిని ఆగ్రాలోని టూరిస్ట్ సెంటర్లకు పంపి మాల్దీవుల గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో బ్రిగేడియర్ వీపీ మాలిక్ భారత హై కమిషనర్ బెనర్జీని తీసుకుని మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఆగ్రా చేరుకున్నారు.

''నేను ఆపరేషన్ రూమ్ చేరుకునేసరికి హల్‌హ్యూల్ విమానాశ్రయానికి బదులుగా అక్కడికి 300 కిలోమీటర్ల దూంరలో ఉన్న గాన్ ఎయిర్ పోర్ట్ మ్యాప్ టేబుల్ పై పరచి ఉంది'' అని ఏకే బెనర్జీ తెలిపారు.

ఈ మ్యాప్ తప్పని, అలాంటి ముఖ్యమైన ఆపరేషన్‌కు భారతీయ సైనికుల ప్రిపరేషన్ కూడా సరిపోదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

తిరుగుబాటుదారులు అప్పటికే హల్‌హ్యూల్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోకుంటే, విమానాన్ని అక్కడ ల్యాండ్ చేయాలని బల్సారా నిర్ణయించుకున్నారు. అది తిరుగుబాటుదారుల స్వాధీనంలో ఉంటే, కొందరు సైనికులు అక్కడ పారాషూట్లతో దిగి విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు.

అదే సమయంలో బ్రిగేడియర్ మాలిక్, మాలే గురించి వివరాలు తెలిసి ఉన్న హై కమిషనర్ బెనర్జీని అక్కడికి తీసుకువెళ్లడం బాగుంటుందని సూచించారు.

Image copyright Getty Images

సేఫ్టీ రేజర్ షరతు

అయితే బెనర్జీ మొదట దీనికి ఒప్పుకోలేదు.

''తిరిగి వెళ్లడానికి నేను రెండు షరతులు విధించాను. మొదటిది - దీనికి విదేశాంగ వ్యవహారాల శాఖ అనుమతి తీసుకోవాలి. రెండోది - నాకు అక్కడ సేఫ్టీ రేజర్ సదుపాయం కల్పించాలి. ఎందుకంటే షేవింగ్ చేసుకోనిదే నేను ఏ పనీ ప్రారంభించను. మొదటి దాన్ని వెంటనే చేసేశారు. అయితే రెండో దాని కోసం అర్ధరాత్రి ఆర్మీ క్యాంటీన్‌ను తెరిపించి, షేవింగ్ కిట్, టూత్ బ్రష్, టవల్స్‌ను తెప్పించారు'' అని బెనర్జీ వివరించారు.

భారత విదేశాంగ వ్యవహారాల శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు సైనికులతో కలిసి ఒక ముఖ్యమైన మిలటరీ ఆపరేషన్‌లో పాల్గొనడం అదే మొట్టమొదటి సారి.

ఆగ్రా బేస్ నుంచి భారత సైనికులతో కూడిన విమానం గాలిలోకి ఎగరగానే, బ్రిగేడియర్ బల్సారా నిద్రపోయారు. ఏదైనా ముఖ్యమైన ఆపరేషన్‌కు ముందు బాగా నిద్ర పోవాలనేది ట్రైనింగ్‌లో ఆయనకు నేర్పిన పాఠం.

Image copyright Getty Images

బీబీసీ బులెటిన్‌లో ప్రసారం

ఆ రోజు అదే విమానంలో ఉన్న వినోద్ భాటియా, ''భారత సరిహద్దులు దాటగానే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం మమ్మల్ని గుర్తించింది. దాంతో వాళ్లకు మేం ఎక్కడికి వెళుతున్నామో చెప్పాల్సి వచ్చింది. బహుశా అందువల్లే బీబీసీ తన ఏడు గంటల బులెటిన్‌లో భారత దేశం మాల్దీవుల అధ్యక్షుణ్ని రక్షించేందుకు రంగంలోకి దిగిందని వార్త ప్రసారం చేసింది.'' అని తెలిపారు.

భారత విమానం ల్యాండ్ అయినపుడు, హల్‌హ్యూల్ విమానాశ్రయం చిమ్మచీకటిగా ఉంది. విమానం ఆగగానే 150 మంది భారతీయ సైనికులు, అనేక జీపులు నిమిషాల వ్యవధిలో బయటపడ్డాయి. రెండో విమానం కూడా ల్యాండ్ అయిన కొద్దిసేపటికి ఏటీసీని స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు.

అక్కడి నుంచి బల్సారా, మాలే అధ్యక్షుడి వద్ద రహస్యంగా దాచి ఉంచిన రేడియో సెట్‌లో ఆయనతో సంభాషించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మాల్దీవులలో అత్యవసర పరిస్థితి

'మిస్టర్ ప్రెసిడెంట్, మేం వచ్చేశాం!'

''మేం వీలైనంత త్వరగా అధ్యక్ష భవనం వద్దకు చేరుకోవాలని గయూమ్ విజ్ఞప్తి చేశారు. అప్పటికే మాకు కాల్పులు వినిపిస్తున్నాయి'' అని బల్సారా వివరించారు.

దానికి సమాధానంగా బల్సారా, ''మిస్టర్ ప్రెసిడెంట్, మేం వచ్చేశాం. మిమ్మల్ని సురక్షితంగా బైటికి తీసుకురావానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం'' అని ఆయనకు భరోసా ఇచ్చారు.

భారత సైనికులు గయూమ్ నివాసాన్ని చేరుకునేసరికి అక్కడ సమాచార లోపం కారణంగా భారతీయ సైనికులను ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బల్సారా వారిపై కాల్పులు జరపాలని ఆదేశించాకే వారు భారతీయ సైనికులకు దారి కల్పించారు.

భారత సైనికులు గయూమ్ వద్దకు చేరినప్పుడు సమయం సరిగ్గా రాత్రి 2 గంటల 10 నిమిషాలు. గయూమ్‌ను తమతో పాటు విమానాశ్రయానికి రావాలని వాళ్లు విజ్ఞప్తి చేశారు. కానీ అందుకు ఆయనను నిరాకరించారు.

దానికి బదులుగా తనను నేషనల్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లాలని కోరారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాజీవ్ గాంధీ

తెల్లవారుజాము 4 గంటలకు రాజీవ్ గాంధీతో మాట్లాడిన గయూమ్

తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాలకు బల్సారా, బెనర్జీలు ఎన్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్ చేరుకున్నపుడు, ఆ బిల్డింగ్ దగ్గర ముగ్గురు తిరుగుబాటుదారుల మృతదేహాలు, వందలకొద్దీ బులెట్‌లు పడి ఉన్నాయి.

''గయూమ్ దీన్నంతా చూసి నిశ్చేష్టులయ్యారు. అయితే మేం తనను రక్షించినందుకు మాకు కృతజ్ఞతలు చెప్పి, తాను రాజీవ్ గాంధీతో మాట్లాడాలనుకుంటన్నట్లు తెలిపారు'' అని బెనర్జీ వివరించారు.

దీంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన శాటిలైట్ ఫోన్ ద్వారా రాజీవ్ గాంధీతో మాట్లాడారు.

Image copyright Getty Images

అప్పుడు రాజీవ్ గాంధీ తనకు అలవాటైన విధానంలో ఒక్క చేతితో తన కంప్యూటర్‌పై టైప్ చేస్తున్నారని రోనెన్ సేన్ గుర్తు చేసుకున్నారు. గయూమ్‌తో మాట్లాడిన తర్వాతే రాజీవ్ నిద్రకు ఉపక్రమించారు.

ఆపరేషన్ విజయవంతంగా ముగిసినందుకు రక్షణ మంత్రికి తన తరపున కంగ్రాట్స్ తెలపాలని రాజీవ్ సేన్‌తో అన్నారు. ఆ తర్వాత మళ్లీ రాజీవే, ''వద్దులెండి. ఆయన నిద్రపోతుంటారేమో'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)