బాడీహ్యాకర్లు: సాహసోపేతం, స్ఫూర్తిదాయకం.. భీతావహం

  • డేవ్ లీ
  • నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్
రస్ ఫాక్స్ తల మీద రెండు చిన్న కొమ్ములు
ఫొటో క్యాప్షన్,

రస్ ఫాక్స్ తల మీద రెండు కొమ్ములు ఉండటమే కాదు.. వాటిని కదిలించగలడు కూడా

జెస్సికా ఫాక్స్ కళ్లు వంగవన్నెలో ఉన్నాయి. ఆమె చెవులు కొన్ని కథల్లో చెప్పే పిశాచి చెవుల్లా కొనదేలి ఉన్నాయి. ఇక ఆమె భర్త రస్ ఫాక్స్ తల మీద చర్మం కింద రెండు చిన్న కొమ్ములున్నాయి.

స్టెలార్క్ అనే 72 ఏళ్ల ఆస్ట్రేలియా వ్యక్తి చేయి మీద ఒక చెవి ఉంది. ఆ చెవికి ఒక చిన్న మైక్రోఫోన్ అమర్చాలని, తద్వారా అది వినేదంతా ఇంటర్నెట్ నుంచి అందరికీ వినిపించాలని ఆయన అభిలషిస్తున్నారు.

మ్యావ్ లుడో డిస్కో గామా మ్యావ్ మ్యావ్.. అవును అది అతడి అసలు పేరే - తన సిడ్నీ ట్రావెల్ కార్డులోని చిప్‌ను తన చేతిలో అమర్చుకున్నాడు.

వీళ్లందరినీ అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో గల ఆస్టిన్‌లో ఇటీవల జరిగిన బాడీహ్యాకింగ్ కాన్‌లో కలిశాను.

బయోహ్యాకింగ్ రంగానికి సంబంధించిన టెక్నాలజిస్టులు, ట్రాన్స్-హ్యూమనిస్టులు, కళాకారుల విస్తృత శ్రేణికి గత మూడేళ్లలో ఈ కార్యక్రమం ఒక తీర్థస్థలంగా మారింది. ఈ సంవత్సరం అమెరికా సైనిక ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఇది నిర్లక్ష్యపూరిత అవకాశవాదులకు తలుపులు తెరిచినట్లు ఈ కార్యక్రమం ముగిసే సరికి నేను గుర్తించాను.

ఫొటో క్యాప్షన్,

తన కళ్లు, చెవులకు చేసిన మార్పులు శాశ్వతమని జెస్సికా ఫాక్స్ చెప్తారు

ఏమిటీ బాడీ హ్యాకింగ్?

ఇందులో మామూలు మందుల వాడకం నుంచి కాస్మెటిక్ సర్జరీ వరకూ, చర్మం కింద రేడియో ట్రాన్స్‌మిటింగ్ ట్యాగులు అమర్చటం నుంచి మెదడును మార్చే ఔషధాలు స్వీకరించటం వరకూ ఎన్నో ప్రక్రయలు ఉండొచ్చు.

బరువులు ఎత్తటం, శారీరక వ్యాయామం, చివరికి శరీర దారుఢ్యాన్ని పర్యవేక్షించే ట్రాకర్‌ను ధరించటం కూడా ఇందులో భాగంగా పరిగణిస్తారు.

అయితే.. అసాధారణ ప్రయత్నాలకు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఫొటో క్యాప్షన్,

మరింత ఉత్తమమైన, మెరుగైన మనిషి అంటే ఏమిటి అనేదాని మీద ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒక దృష్టి ఉంది

’ధరిస్తే.. శరీరంలో కలిసిపోతుంది’

చట్టం పరిధిలో లేని ప్రాంతంలో ఈ బాడీహ్యాకింగ్ సమాజం కొనసాగుతోంది.

ఈ ఔత్సాహికులు ఇప్పుడున్న చట్టంలోని లోపాలను ఆసరా చేసుకుని తమ పని కొనసాగిస్తున్నారు. నియంత్రణ సంస్థలు ఈ కార్యకలాపాల మీద దృష్టి పెట్టటం లేదు. విస్తరిస్తున్న ఈ ఉప సంస్కృతిని ఎలా ఎదుర్కోవాలనేది చట్ట సంస్థలు ఇంకా తేల్చుకోవాల్సి ఉంది.

మరింత ఉత్తమమైన, మెరుగైన మనిషి అంటే ఏమిటి అనేదాని మీద ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒక దృష్టి ఉంది. ఏ ఇద్దరి దృక్కోణాలూ ఒకేలా ఉండవు.

‘‘నా జీవితమంతా నేను ఒంటి చేత్తోనే గడిపాను’’ అంటారు ఏంజెల్ గ్విఫ్రియా. ఆమె ఒక నటి. ఇప్పుడామె తనకు ప్రత్యేకంగా రూపొందించిన బయోనిక్ చేయిని అమర్చుకున్నారు. అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

‘‘పాత ప్రోస్తటిక్స్ అన్నీ ధరించటానికి, శరీరంలో కలిసిపోయినట్లు కనిపించటానికి తయారు చేశారు. దానిని దాచిపెట్టాలని నేను నిజంగా ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ మరో మార్గం లేదు’’ అని ఆమె అంటారు.

ఫొటో క్యాప్షన్,

తన బయోనిక్ చేయి తన వ్యక్తిత్వానికి సరిపోయేలా ఉందని ఏంజెల్ గ్విఫ్రియా అంటారు

ఇప్పుడిది కనిపించి తీరుతుంది.

‘‘ఇది నేను. నా వ్యక్తిత్వానికి సరిపోయేలా నా చేతికి లైట్లు, రంగులు వేయటం, నా దుస్తులకు మ్యాచ్ అయ్యేలా చేసుకోగలగటం నాకు బాగా నచ్చింది’’ అని ఏంజెల్ పేర్కొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేసిన రిచ్ లీ.. మగాళ్ల పురుషాంగం దగ్గర ఒక చిన్న పరికరాన్ని.. శరీరం లోపల అమర్చాలన్న తన ప్రణాళిక గురించి వివరించారు.

దాని ఉపయోగం ఏమిటంటే.. పురుషాంగాన్ని కంపించేలా చేయటానికి.

ఫొటో క్యాప్షన్,

పురుషుల పురుషాంగం కంపించేలా చేయటానికి చిన్న పరికరాన్ని అమర్చటం మీద పరిశోధన చేస్తున్నట్లు రిచ్ లీ చెప్పారు

అసాధ్యపు అంచులు

విప్లవాత్మకమైన వినూత్న ఆవిష్కరణలను సృష్టించటంలో అమెరికా సైన్యానికి చెందిన డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా)కి మంచి రికార్డ్ ఉంది.

సెల్ప్-డ్రైవింగ్ కార్లు, జీపీఎస్.. అన్నిటికన్నా మించి ఇంటర్నెట్ కూడా డార్పా ప్రాజెక్టులుగానే ఆరంభమయ్యాయి.

ఇప్పుడు అదే డార్పా బాడీహ్యాకింగ్ మీద దృష్టి పెట్టింది. అందులోని బయోలాజికల్ టెక్నాలజీస్ ఆఫీస్ డైరెక్టర్ డాక్టర్ జస్టిన్ సాంచెజ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘అసాధ్యపు అంచుల్లో ఏదైనా ఉన్నట్లయితే.. మేం ఆ రంగాన్ని పరిశోధించటం ప్రారంభిస్తాం’’ అని పేర్కొన్నారు.

డార్పా బాడీహ్యాకింగ్ కార్యక్రమం పూర్తి విస్తృతి ఏమిటనేది మనకు తెలియదు.

ఫొటో క్యాప్షన్,

మెదడు తరంగాలతో పరికరాలను నియంత్రించగలగటం మీద దృష్టి పెట్టినట్లు డార్పాలోని బయోలాజికల్ టెక్నాలజీస్ ఆఫీస్ డైరెక్టర్ డాక్టర్ జస్టిన్ సాంచెజ్ చెప్పారు

అయితే, డాక్టర్ సాంచెజ్ బహిరంగంగా మాత్రం.. పునరుద్ధరణ టెక్నిక్‌ల మీద - జ్ఞాపకశక్తని మెరుగుపరచేలా తోడ్పటం, పక్షవాతంతో బాధపడే వారు తమ మెదడు తరంగాలతో పరికరాలను నియంత్రించే సామర్థ్యాన్ని ఇవ్వటం మీద - దృష్టి కేంద్రీకరించారు.

తెర మీద ప్రదర్శించిన ఒక ప్రాజెక్టులో.. ఒక వయసుమళ్లిన రోగి 12 పదాల జాబితాను గుర్తుపెట్టుకోవటానికి ఇబ్బంది పడటాన్ని చూపారు.

‘‘మెదడును నేరుగా ప్రేరేపించటం ద్వారా వారు ఆ పదాలను నిరాటంకంగా గుర్తచేసుకోగలిగారు’’ అని ఆయన చెప్పారు.

‘‘మొత్తం 12 పదాలనూ వేగంగా వరుసగా గుర్తించారు. ఇది చాలా పెద్ద విజయం’’ అని పేర్కొన్నారు.

‘‘దీనంతటి మీదా మా విజ్ఞానాన్ని.. ఈ రంగంలో అగ్రభాగంలో సారథ్యం వహిస్తున్న ఈ సమాజంతో పంచుకోవటం కూడా మేం ఈ సదస్సుకు రావటానికి ఒక కారణమేమం’’ అని డాక్టర్ సాంచెజ్ తెలిపారు.

ఫొటో క్యాప్షన్,

డానా లూయీస్ కృత్రిమ పాంక్రియాస్.. ఒక రేడియో ట్రాన్స్‌మిటర్‌ను ఉపయోగించుకుని ఆమె ఇన్సులిన్‌తో సంప్రదింపులు జరుపుతుంది

పాంక్రియాటిక్ ప్రగతి

నేను ప్రత్యేకంగా కలవాలనుకన్న వారిలో డానా లూయీస్ ఒకరు.

నేను కలిసినపుడు, ఆమె తొడుక్కునివున్న నీలి రంగు చొక్కా మీద తెల్లటి అక్షరాలు, అంకెలు, గుర్తులు ఉన్నాయి. అది ఆమె తన పరికరాన్ని సృష్టించటానికి ఉపయోగించిన కోడ్.

లూయీస్ టైప్ వన్ డయాబెటిస్ రోగి. తన శరీరంలో రక్తంలోని చక్కెర స్థాయిలు కోరినప్పుడల్లా ఆమె ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని సులభతరం చేయటం కోసం ఆమె తన సొంత పాంక్రియాస్ (క్రోమ గ్రంథి)ని తయారు చేసుకున్నారు.

‘‘ఇది రేడియోతో కూడిన ఒక చిన్న కంప్యూటర్’’ అంటూ చేతిలో క్రెడిట్ కార్డు పరిమాణంలోని ఒక పరికరాన్ని చూపుతూ చెప్పారు.

‘‘ఇది నా ఇన్సులిన్ పంప్ నుంచి సమాచారాన్ని పరిశీలిస్తుంది. నా గ్లూకోజ్ మానిటర్ నా కోసం లెక్కలు వేస్తుంది. ఆ ప్రకారం ఇన్సులిన్ ఇవ్వటానికి ఇన్సులిన్ పంపుకి ఆదేశాలు పంపుతుంది’’ అని ఆమె వివరించారు.

సంప్రదాయ వైద్య మార్గాలు తనకు పనిచేయనపుడు.. కొత్త పరికరాన్ని సృష్టించిన డానా లూయిస్.. ఈ బాడీహ్యాకింగ్ సమాజంలో మంచి కోణానికి ఉత్తమ ఉదాహరణ అనొచ్చు.

ఫొటో క్యాప్షన్,

ఆరన్ ట్రేవిక్‌‌కు చెందిన అసెండెన్స్ మయోమెడికల్ తరహా కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా నియంత్రణ సంస్థలు హెచ్చరించాయి

నియంత్రణ లేని ’ఔషధాలు’

కానీ, ఆరన్ ట్రేవిక్‌కి చెందిన అసెండెన్స్ బయోమెడికల్ చాలా వివాదాస్పద ఉదాహరణ.

హెచ్‌ఐవీ, ఎయిడ్స్, హెర్పెస్‌లను తమ మందులు నయం చేస్తాయని ఆయన చెప్తారు. దానికి స్వతంత్ర నిర్ధారణ ఏదీ లేదు. తనకు హెర్పెస్ ఉందని కూడా ఆయన అంటారు.

ట్రేవిక్ నిజానికి తన కాలులోకి తన సొంత ఉత్పత్తిని ఇంజెక్ట్ చేసి - లేదంటే కనీసం చేసినట్లు ప్రయత్నించి - ఈ కార్యక్రమంలో ఒక తమాషా ప్రదర్శించారు. వాస్తవంగా ఏం జరిగిందనే దాని మీద కొంత గందరగోళం నెలకొంది.

సొంతంగా వైద్యం చేసుకోవటం ద్వారా, ఇతరులను కూడా అలాగే చేయమనటం ద్వారా ట్రేవిక్ చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.

ఆయన తన ఉత్పత్తి ‘‘పరిశోధన మిశ్రమం’’ అని అధికారికంగా చెప్తారు. కానీ మాట్లాడేటపుడు పొరపాటున నోరు జారి దానిని ‘‘చికిత్స’’ అని ఉటంకిస్తుంటారు. ఈ మాటతో.. అత్యంత కఠినంగా నియంత్రణలు అమలు చేస్తుందనే చెడ్డ పేరున్న అమెరికా ఫెడరల్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆయన కష్టాలు ఎదుర్కొనే అవకాశముంది.

ట్రేవిక్‌ తరహా కంపెనీలు ‘‘ప్రమాదకరం’’ అని ఎఫ్‌డీఏ అంటోంది. అయితే బీబీసీ ప్రశ్నించినపడు.. ట్రేవిక్ కార్యకలాపాలను తాను పరిశీలిస్తోందో లేదో చెప్పలేదు.

ఫొటో క్యాప్షన్,

ఈ ఔత్సాహికులు ఇప్పుడున్న చట్టాల్లోని లోపాలను ఆసరా చేసుకుని తమ పని కొనసాగిస్తున్నారు

నవంబర్‌లో అసెండెన్స్ బయోమెడికల్‌కు చెందిన హెచ్‌ఐవీ ‘‘పరిశోధన మిశ్రమాన్ని’’ ఓ 28 ఏళ్ల వ్యక్తి తనకు తాను ఇంజెక్ట్ చేసుకున్నపుడు ఆ సంస్థ పతాక శీర్షికలకు ఎక్కింది.

తన కృషిని వెనుజువెలాకు విస్తరించాలన్నది తన ప్రణాళికగా ట్రేవిక్ నాతో చెప్పారు.

‘‘మేం చేయగలిగింది ఏమిటంటే.. ‘మీకు ఈ మందు అందుబాటులో లేదని మాకు తెలుసు’ అని చెప్పగలగటం మాత్రమే’’ అని ఆయన అంటారు.

‘‘వారికి మరో ప్రత్యమ్నాయం లేదు’’ అని.. ఒకే ఒక వ్యక్తి మీద పరీక్షించిన, నియంత్రణ పరిధిలో లేని ఔషధాన్ని ఉపయోగించటానికి అదే ఆమోదించదగ్గ హేతుబద్ధమైన కారణం అన్నట్లు చెప్తారు.

’’ఒక శాస్త్రవేత్త.. బయోహ్యాకర్ అయినా కాకున్నా.. ఎటువంటి పరీక్షలు, ఎటువంటి సమాచారం లేకుండా ఒక వ్యాధికి మందును కనుగొనడమనేది.. జెట్ ఇంధనం ఉక్కు దూలాలను కరిగించేస్తుందనే మాటను విశ్వసించటం కన్నా హాస్యాస్పదం’’ అంటూ జోసియా జేనర్ అనే ఒక ప్రముఖ బాడీహ్యాకర్ రాశారు. ఆయన కూడా ‘సొంతంగా వైద్యం చేసుకునే’ మందుల మీదే పనిచేస్తుంటారు.

వారాంతంలో సదస్సు ముగిసే సరికి మొత్తం మీద డాప్రా కృషి నాకు స్ఫూర్తిదాయకంగా కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)