ఐసీసీ తొలి మహిళా డైరెక్టర్‌గా పెప్సికో సీఈవో ఇంద్రా నూయి!

ఇంద్రానూయి

ఫొటో సోర్స్, Getty Images

పెప్సికో చైర్మన్‌ ఇంద్రానూయి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - ఐసీసీ బోర్డు తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఐసీసీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది.

62 ఏళ్ల ఇంద్రానూయి ఈ ఏడాది జూన్‌లో ఐసీసీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు.

స్వతంత్ర మహిళా డెరెక్టర్‌ను నియామించాలని 2017 జూన్‌లో ఐసీసీ నిర్ణయించింది. ఇందుకోసం ఐసీసీ రాజ్యాంగంలో మార్పులు చేశారు.

ఐసీసీ స్వతంత్ర డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు. ఆ తర్వాత మళ్లీ పొడిగించొచ్చు. గరిష్ఠంగా ఆరేళ్ల వరకు పదవిలో ఉండొచ్చు.

ఫొటో సోర్స్, AFP

"నాకు క్రికెట్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో నేను క్రికెట్ ఆడాను. టీమ్ వర్క్, సమగ్రత, ఆరోగ్యకరమైన పోటీ వంటి అంశాలను నేను ఈ క్రికెట్ నుంచి నేర్చుకున్నాను. ఐసీసీలో చేరడం చాలా ఆనందంగా ఉంది" అని ఇంద్రానూయి అన్నారు.

ఇంద్రా నూయిని ఐసీసీలోకి స్వాగతిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు.

ఇంద్రా నూయి రాకతో ఐసీసీ పాలన మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే వ్యాపార అనుభవం ఉన్న మహిళా కోసం మేం ప్రపంచవ్యాప్తంగా గాలించాం. మాకు ఇంద్రానూయి కనిపించారు" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇంద్రానూయి గ్లోబల్ బిజినెస్ లీడర్. 'వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ విమెన్‌'గా ఫార్చూన్ మ్యాగజీన్ ఆమెను అభివర్ణించింది.

ఇంద్రా నూయి పెప్సీకో చైర్మన్‌గా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఏడాదికి 1బిలియన్ డాలర్ల చొప్పున టర్నోవర్ ఉన్న 22 బ్రాండ్లను ఆమె పర్యవేక్షిస్తున్నారు.

ఆమె సారథ్యంలో 2006 నుంచి పర్యావరణానికి అనుకూల పానీయాలను తయారు చేయడంపై పెప్సీ కో దృష్టి సారించింది.

2025లోగా పెప్సీ ఉత్పత్తుల్లో షుగర్, ఉప్పు, కొవ్వు పదార్థాలను తగ్గించాలని ఇంద్రా నూయి లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'అమెరికాలో పుట్టకపోవడమే తనకు కలిసి వచ్చింది' అని ఒక సందర్భంలో ఆమె బీబీసీతో చెప్పారు.

'ప్రపంచం ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. అమెరికా బయట ఉన్న ప్రజల కళ్లతో నేను ఆ ప్రపంచాన్ని చూడగలను' అని ఆమె అన్నారు.

ప్రతీ విషయాన్ని సానుకూల దృక్పథంతో చూడాలని ఆమె చెబుతుంటారు.

1955 అక్టోబర్‌ 28న చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంద్రానూయి జన్మించారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా చెన్నైలోనే జన్మించారు.

ఇంద్రా నూయి మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌లో భౌతిక, రసాయన, గణిత శాస్త్రల్లో డిగ్రీ చేశారు. 21 ఏళ్ల వయసులోనే 1976లో కలకత్తా ఐఐఎంలో ఎంబీఏ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఇంద్రానూయి కెరీర్ భారతదేశంలోనే మొదలైంది.

రెండేళ్ల పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌‌, మెట్టుర్‌ బియర్డ్‌సెల్‌ కంపెనీల్లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాలోని యేలే యూనివర్శిటీకి వెళ్లాలనుకున్నారు.

కానీ ఆమె తల్లి దానికి ఒప్పుకోలేదు. 'పెళ్లి చేస్తాం చక్కగా కాపురం చేసుకో' అని చెప్పారని ఇంద్రానూయి ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

కానీ నాన్న ప్రోత్సాహంతో యేలే యూనివర్శిటీకి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత ఇంద్రా నూయి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1994లో ఆమె పెప్సీకోలో చేరారు. 2006లో పెప్సీకో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

పెప్సీకో సారధిగా 2014లో ఆమె జీతం 120 కోట్లు. ఇంద్రా నూయి రాజ్‌కాంతీ లాల్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ఇంద్రా నూయిని 2007లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.

పోర్బ్స్ మ్యాగజీన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో వరుసగా 2008, 2009లలో ఇంద్రానూయికి స్థానం లభించింది.

ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో 2006 నుంచి ఇంద్రా నూయికి ఎంపికవుతూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)