ఈ కళ్లజోళ్లు దొంగలను పట్టిస్తాయ్

చైనాలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన కళ్లజోళ్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

చైనాలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన కళ్లజోళ్లు

అనుమానితులు, నిందితులను గుర్తించేందుకు వీలుగా ముఖాలను గుర్తించే టెక్నాలజీ ఉన్న కళ్లజోళ్లను చైనా పోలీసులు అందుబాటులోకి తెచ్చారు.

ఈ కళ్లజోళ్లు నిందితులు, దోషులు, అనుమానితుల డేటాబేస్‌తో కనెక్ట్ అయి ఉంటాయి.

ఈ డేటాబేస్‌లో ఉన్న నిందితులు కనిపించినపుడు ఈ కళ్లజోళ్లు అలెర్ట్ చేస్తాయి.

అనుమానితులు జనం మధ్యలో ఉన్నా ఇవి గుర్తిస్తాయని చైనా పోలీసులు అంటున్నారు.

అయితే విమర్శకులు ఈ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి మరింత ‘పవర్’ను ఇస్తుందని తెలిపారు.

ఈ కళ్లజోళ్లతో ఇప్పటికే చైనా పోలీసులు ఏడుగురు అనుమానితులను గుర్తించారని స్థానిక మీడియా పేర్కొంది.

చెంగ్జులోని ఓ రద్దీ రైల్వే స్టేషన్లో పోలీసులు ఈ కళ్లజోళ్లను వినియోగించి.. ఏడుగురిని పట్టుకున్నారు.

ఈ ఏడుగురు మనుషుల అక్రమ రవాణా, దాడి చేసి పారిపోవడం వంటి కేసుల్లో నిందితులని తేలింది.

వీరితో పాటు నకిలీ గుర్తింపు కార్డులు వినియోగించిన మరో 26మంది నిందితులను కూడా పోలీసులు గుర్తించారని చైనా అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ డైలీ న్యూస్ పేపర్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP

ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది

ముందుగా కళ్లజోళ్లు రద్దీని ఫొటోలు తీస్తాయి. తర్వాత వీటిని డేటాబేస్‌లో ఉన్న అనుమానితులు, దోషులు, నిందితుల చిత్రాలతో పోల్చి చూసి వారి ముఖాలు రద్దీ చిత్రాల్లో ఉంటే గుర్తించి.. పోలీసులకు వారి వివరాలను పంపుతాయి.

మరోవైపు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ‘‘కెమెరాలతో కూడిన నిఘా వ్యవస్థను’’ ఏర్పాటు చేస్తోంది.

ఇందులో భాగంగా 17 కోట్ల సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేసింది. మరో మూడేళ్లలో 40 కోట్ల సీసీటీవీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ కెమెరాల్లో ముఖాల గుర్తింపు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.