సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. '1982 తర్వాత ఇవే అతిపెద్ద దాడులు'

ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం (ప్రతీకాత్మక చిత్రం)

సిరియాలో దాడుల్లో పాల్గొంటున్న తమ ఎఫ్-16 యుద్ధవిమానం కూలిపోయిన తర్వాత సిరియా గగనతల రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. వాటికి భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

1982 లెబనాన్ యుద్ధం తర్వాత సిరియాపై జరిపిన అతిపెద్ద గగనతల దాడులు ఇవేనని వైమానికదళ ఉన్నతాధికారి తొమర్ బార్ తెలిపారు.

సిరియాలోని సిరియా, ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

శనివారం ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హర్దుఫ్ పట్టణ సమీపాన ఎఫ్-16 యుద్ధవిమానం కూలిపోయిన ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు.

యుద్ధవిమానం కూలిపోవడానికి కారణాలేమిటో స్పష్టం కాలేదు.

యుద్ధవిమానంపై దాడి జరగలేదని అందులోంచి బయటపడిన ఇద్దరు పైలట్లు చెప్పారని తొమర్ బార్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images

శనివారం ఇజ్రాయెల్ సైనిక ఉన్నతాధికారులతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చర్చలు జరిపారు.

ఇజ్రాయెల్ శాంతిని కోరుకొంటుందని, అయితే తమ దేశంపై ఇరాన్ జరిపే ఏ దాడినైనా తిప్పికొడతామని, సిరియాలో ఇరాన్ తమపై జరిపే దాడులనూ ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.

సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

మరోవైపు ఉత్తర సిరియాలో కుర్దు ఫైటర్లపై టర్కీ దాడులు కొనసాగుతున్నాయి.

ఈ పోరాటంలో ఒక టర్కీ హెలికాప్టర్‌ను ప్రత్యర్థులు కూల్చివేశారు. అందులోని ఇద్దరు సైనికులు చనిపోయారని టర్కీ సైన్యం తెలిపింది.

సిరియా యుద్ధం, హింస కారణంగా గత వారం 277 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం తెలిపింది. 2011లో సిరియా సంక్షోభం మొదలైన తర్వాత పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయిన సందర్భాల్లో ఇది ఒకటి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)