ఈ రోమియోకి జూలియెట్ కావాలి

ఫొటో సోర్స్, AFP
ఈ జాతికి చెందిన కప్ప దేశంలో ఇదొక్కటి మాత్రమే మిగిలుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బొలీవియాలో ఉంటోన్న రోమియో అనే ఈ మగ కప్ప వయసు పదేళ్లు. దీనికి భాగస్వామిని వెతికేందుకు శాస్త్రవేత్తలు ఏకంగా డేటింగ్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చారు.
గత తొమ్మిదేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ కప్పకు భాగస్వామిని వెతికేందుకు విఫలయత్నం చేస్తున్నారు.
‘సేవన్కస్ వాటర్ ఫ్రాగ్’ జాతికి చెందిన ఈ కప్ప కోచబాంబా నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని ఓ ట్యాంకులో ఉంటోంది.
ఈ జాతికి చెందిన కప్ప దేశంలో ఇదొక్కటి మాత్రమే మిగిలుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే దీని సంతతిని వృద్ధి చేసేందుకు గత తొమ్మదేళ్లుగా ఇదే జాతికి చెందిన కప్ప కోసం అన్వేషిస్తున్నారు.
సాధారణంగా ఈ జాతి కప్పలు పదిహేనేళ్లకు మించి జీవించవు. అందుకే మరో ఐదేళ్లలో దీనికి భాగస్వామి దొరక్కపోతే మొత్తం ఈ జాతే అంతరించే ప్రమాదం ఉంది.
ఫొటో సోర్స్, Match
డేటింగ్ సైట్లోని రోమియో ప్రొఫైల్
అందుకే దీని ఫొటోను పెట్టి ప్రకటన ఇచ్చేందుకు ఓ డేటింగ్ వెబ్సైట్ ముందుకొచ్చింది. సాధారణ మనుషుల్లానే ‘రోమియో.. లుకింగ్ ఫర్ మై జూలియట్’ అంటూ ఈ కప్ప ఫొటోతో ఓ ప్రొఫైల్ను ఆ డేటింగ్ వెబ్సైట్లో ఏర్పాటు చేశారు.
దాని ఇష్టాయిష్టాలు, జీవన శైలీ, భాగస్వామిలో కోరుకునే అంశాల్లాంటివన్నీ ఆ వెబ్సైట్ ప్రొఫైల్లో పొందుపరిచారు.
‘నాకు మా జాతికే చెందిన ఓ ఆడ భాగస్వామి (కప్ప) కావాలి. లేకపోతే మొత్తం మా జాతే అంతరించే ప్రమాదం ఉంది’ అని రోమియో ప్రొఫైల్లో పేర్కొన్నారు.
ఇలాగైనా దీనికో తోడు దొరుకుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)