BBC Exclusive: ఒకప్పుడు తాలిబాన్.. ఇప్పుడు కార్పెంటర్!

వీడియో క్యాప్షన్,

BBC SPECIAL: ఒకప్పుడు తాలిబాన్.. ఇప్పుడు కార్పెంటర్!

ఆయనో మాజీ తాలిబాన్. ఇప్పుడు కార్పెంటర్‌ పని చేసుకుంటూ పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నానని ఆయన అంటున్నారు.

బాంబులు పేల్చి అమాయక ప్రజల ప్రాణాలు తీయడం జిహాద్ కాదని, అది ఉగ్రవాదమని ఆయన అన్నారు.

తాను పదో తరగతికే చదువు ఆపేయాల్సి వచ్చిందని, తీవ్రవాద సంస్థలోకి వెళ్లకపోయుంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించేవాడినని తెలిపారు.

మరి ఎవరి బలవంతంతో తాలిబాన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది? సైన్యం ఆయన జీవితాన్ని ఎలా మార్చివేసింది అనే విషయాలను బీబీసీ ప్రతినిధి ఫర్హాద్ జావేద్‌తో ముఖాముఖిలో ఆయన వివరించారు.

ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

అయిష్టంగానే వాళ్లతో (తాలిబాన్) కలిసి వెళ్లాల్సి వచ్చింది. కానీ, అవకాశం దొరికినప్పుడల్లా మా ఇంట్లో దాక్కునేవాడిని.

కొన్నిసార్లు వాళ్లు (తాలిబాన్లు) నన్ను కమాండర్ దగ్గరకు తీసుకెళ్లేవారు. ‘రాను’ అంటే చంపేస్తామనేవారు. ఇంటి నుంచి ఇంకెవరినైనా పట్టుకెళ్తామని బెదిరించేవారు. దాంతో అట్టోక్ పట్టణానికి పారిపోయాను.

సైన్యం చుట్టుముట్టిన తర్వాత ఇక తాలిబాన్ ఓడిపోయిందని అనుకున్నాం. దాంతో వెనక్కు వచ్చేయాలని నిర్ణయించాం. సైన్యం ఎదుట లొంగిపోయాం.

తాలిబాన్‌లో చేరి తప్పు చేశామని ఒప్పుకున్నాం. ఆర్మీ వాళ్లు చాలా పాఠాలు నేర్పించారు. దాంతో ఉగ్రవాదం, జిహాద్‌కి మధ్య తేడా ఏంటో గ్రహించాను.

'అది జిహాద్ కాదు, ఉగ్రవాదం'

వీధుల్లో బాంబులు పేల్చి అమాయక ప్రజలను చంపడం జిహాద్ కాదు. కొందరు అక్కడికి షాపింగ్‌ చేసేందుకు వస్తారు. ఇంకొందరు వైద్యం కోసం, సొంత పనుల కోసం వస్తుంటారు. తమకు ఏం జరగబోతోందో వారికి తెలియదు.

బాంబులు పేల్చి అలాంటి అమాయకులను చంపేస్తే, దానికి ఎవరిది బాధ్యత? అది జిహాద్ కాదు, ఉగ్రవాదం.

ఇక్కడ వడ్రంగి పనులు నేర్చుకున్నా. సొంతంగా ఓ దుకాణం నడుపుకుంటున్నా.

ఆర్మీ కేంద్రం నుంచి బయటకు వచ్చాక, సమాజంలో అందరితో కలిసిపోయాం. అయితే మేం తాలిబాన్‌కు మద్దతు ఇచ్చామన్న కారణంగా, మొదట్లో ఎవరూ మాతో మాట్లాడేవారు కాదు.

ఎవరితోనైనా మాట్లాడేందుకు దగ్గరికి వెళ్తే, వాళ్లు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయేవారు. చాలా బాధేసేది. తాలిబాన్‌లో చేరి ఎంత పెద్ద తప్పు చేశానో గ్రహించాను.

నేను మారిపోయానన్న విషయాన్ని క్రమంగా అందరూ అర్థం చేసుకున్నారు. నేను చేసిన పనికి ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. చక్కగా మాట్లాడుతున్నారు.

'నా కొడుకు డాక్టర్ అవ్వాలి'

బయటకు వచ్చాక ఫోన్‌ని స్విచాఫ్ చేశాను. దాంతో వాళ్లు (తాలిబాన్లు) నన్ను సంప్రదించలేదు. నా తోటివాళ్లలో కొందరికి తాలిబాన్ల నుంచి హెచ్చరికలు వచ్చాయని తెలిసింది. అయినా, వాళ్లు ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు.

పదో తరగతి వరకు చదువుకున్నాను. తాలిబాన్‌లో చేరకుండా ఉంటే పైచదువులకు వెళ్లేవాడిని. ప్రభుత్వ కొలువు సాధించేవాడిని. ఆర్మీ సాయంతో కార్పెంటర్‌గా మారాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మంచి ఉద్యోగం సాధించాలన్న కోరిక ఉంది, కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు.

నా కొడుకును బాగా చదివించి, డాక్టర్‌ను చేయాలన్నదే నా ఆశ. (భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పేరును గోప్యంగా ఉంచుతున్నాం. )

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)