లవ్ బ్యాంక్: ప్రేమ లేఖ నుంచి సినిమా టికెట్ వరకు.. ప్రతీ జ్ఞాపకం పదిలం

మ్యూజియంలో లవ్ మీటర్ వద్ద ఒక జంట
ఫొటో క్యాప్షన్,

లవ్ మీటర్ వద్ద ఒక జంట

ఐరోపాలోని స్లొవేకియా దేశంలో అదో అందమైన పట్టణం. అక్కడో అరుదైన బ్యాంకు ఉంది. అదే 'లవ్ బ్యాంక్'.

ప్రేమికుల రోజున ప్రేమ జంటలు ఈ బ్యాంకుకు వెళ్లి, తాము రాసుకొన్న ప్రేమలేఖలను, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులను, కలిసి దిగిన ఫొటోలను, కలిసి చూసిన సినిమా టికెట్లను, ఉంగరాలను, ఇతర జ్ఞాపకాలను శాశ్వతంగా ఉండేలా పదిలపరచుకోవచ్చు.

బ్యాంకులో చిన్నపాటి సొరుగులు లక్ష ఉన్నాయి.

మధ్యయుగ కాలం నాటి బాన్‌స్కా స్టియావ్‌నికా పట్టణంలోని హౌస్ ఆఫ్ మెరీనా పురావస్తు ప్రదర్శనశాలలో ఈ బ్యాంకు ఉంది.

ఫొటో క్యాప్షన్,

హౌస్ ఆఫ్ మెరీనా మ్యూజియం

ఆండ్రెజ్-మరియా ప్రేమ కథ

ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘ ప్రేమ కవిత 'మెరీనా' ఈ మ్యూజియంలోనే ఉంది.

2,910 లైన్లు ఉండే ఈ కవితను ఆండ్రెజ్ స్లాడ్‌కోవిక్ రాశారు. ఇది 1846లో ప్రచురితమైంది.

స్లొవేకియా పాఠశాలల్లో 'మెరీనా' పాఠ్యాంశం కూడా!

బాన్‌స్కా స్టియావ్‌నికా పట్టణంలో ఆండ్రెజ్, మరియా పిశ్చ్‌లోవా 14 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డారు.

ఆండ్రెజ్‌ పేదవాడు. మరియాది సంపన్న కుటుంబం.

చదువుకునే రోజుల్లో ఆండ్రెజ్, మరియా ఇంటికి వెళ్లి ట్యూషన్ చెప్పేవాడు. అలా వారిద్దరూ ప్రేమలో పడ్డారు.

అయితే మరియా తల్లిదండ్రులు ఆమెను ఓ సంపన్నుడికి ఇచ్చి పెళ్లి చేశారు.

ఆండ్రెజ్ తర్వాత ప్రీస్ట్‌గా మారాడు. మరియాకు పెళ్లయ్యాక రెండేళ్లకు అతడు ఒక మతపెద్ద కుమార్తెను వివాహమాడాడు.

ఈ పట్టణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించి, పరిరక్షిస్తూ వస్తోంది.

మెరీనా కవితను స్లొవేకియా ప్రజలు తమ జాతీయ సంపదగా పరిగణిస్తారు.

లవ్ బ్యాంకులో దాచుకొనే వస్తువులకు ప్రత్యేకమైన సీల్ వేస్తామని, అవన్నీ భద్రంగా ఉంటాయని, వాటిని దాచుకొన్న వ్యక్తులు తప్ప ఎవ్వరూ చూడలేరని మ్యూజియం అధికార ప్రతినిధి కేటరినా జవోర్‌స్కా బీబీసీతో చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

లవ్ బ్యాంక్‌లో ఓ జంట

మీ ప్రేమ ఎంత బలమైనది?

ఒక జంట ప్రేమ ఎంత బలమైనదో చెప్పే 'కొలమానిని' కూడా తమ మ్యూజియంలో ఉందని కేటరినా జవోర్‌స్కా తెలిపారు.

ప్రేమికులు ఒక హ్యాండిల్ పట్టుకోవాల్సి ఉంటుందని, వారు ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసి ఉన్నప్పుడు లేదా ముద్దాడుతున్నప్పుడు వారి శరీరంలో ఉండే విద్యుదావేశాన్ని దీని సాయంతో లవ్ మీటర్ గుర్తిస్తుందని ఆమె తెలిపారు.

ఈ విద్యుదావేశానికి అనుగుణంగా మెరీనా కవిత నుంచి కొన్ని పంక్తులను ఈ సాధనం ఎంపిక చేస్తుందని, వారి ప్రేమ ఎంత బలమైనదో అవి సూచిస్తాయని ఆమె వివరించారు.

మెరీనా కవితలోని పంక్తుల ఆధారంగా స్లొవేకియా పాలనా యంత్రాంగం దేశంలోని పలు వీధులకు పేర్లు పెట్టింది. కవిత రాసిన ఆండ్రెజ్ స్లాడ్‌కోవిక్ పేరు మీద ఒక పట్టణానికి 'స్లాడ్‌కోవిక్' అని నామకరణం చేసింది.

మెరీనా కవితలోని కొన్ని పంక్తులు:

''నీ పెదవులనొదిలి నేనుండగలను

నిను పెళ్లాడే అవకాశాన్నీ వదులుకోగలను

నీ కోసం ప్రాణమైనా ఇవ్వగలను

కానీ, నిను ప్రేమించక నేనుండలేను!"

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)