వేటగాడిని తినేసిన సింహాలు

  • 14 ఫిబ్రవరి 2018
సింహం Image copyright Cameron Spencer/Getty Images

వన్యప్రాణుల వేటగాడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని సింహాలు చంపి పూర్తిగా తినేసి, తలను మాత్రం వదిలిపెట్టాయి. దక్షిణాఫ్రికాలోని క్రుగెర్ జాతీయ పార్కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సింహాలు అతడి శరీరాన్ని దాదాపు మొత్తం తినేశాయి. కొన్ని భాగాలు మాత్రం పార్కులో అక్కడక్కడా చెల్లాచెదురుగా కనిపించాయి.

పార్కులో వేటకు వచ్చిన సమయంలో సింహాలు అతడిని చంపి ఉంటాయని లింపోపో పోలీస్ అధికార ప్రతినిధి మోషె ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ చెప్పారు.

‘అవి వేటగాడి మొండేన్ని తినేశాయి. తలను మాత్రం వదిలిపెట్టాయి’ అని ఆయన అన్నారు. ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలీలేదు.

వేటకు ఉపయోగించే తుపాకీ, గుండ్లు అతడు చనిపోయిన ప్రాంతంలో దొరికాయి.

ఇటీవలి కాలంలో లింపోపోలో అక్రమ వేట పెరిగిపోయింది. కొన్ని వన్య మృగాల శరీర భాగాలను ఆఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో సంప్రదాయ వైద్యంలో భాగంగా ఉపయోగిస్తారు. అందుకే వేటగాళ్లు వాటి వెనక పడుతున్నారు.

ముఖ్యంగా సింహం ఎముకలు, ఇతర భాగాలకు ఆగ్నేయ ఆసియాలో ఎక్కువ డిమాండ్ ఉందని బార్న్ ఫ్రీ ఫౌండేషన్ చెబుతోంది.

గతేడాది లింపోపో ప్రాంతంలో మూడు సింహాలకు విషం పెట్టి చంపి వాటి తలనూ కాళ్లనూ నరికేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)