ఆ మహిళలే ఉత్తర కొరియా 'రహస్య ఆయుధాలు'!
- లౌరా బికర్
- ప్యెంగ్చాంగ్, దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కిమ్ యో-జోంగ్
ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలే నిర్వహించాల్సిన అవసరం లేదన్న విషయం అర్థమైపోయింది.
ఎందుకంటే, మిస్సైల్‌ను మించిన శక్తివంతమైన 'ఆయుధ' సంపత్తి ఆ దేశానికి ఉంది. కిమ్ జోంగ్- ఉన్ చెప్పిన పనిని గిరిదాటకుండా చేసిపెట్టే మహిళా ప్రతినిధులే ఆ 'రహస్య ఆయుధాలు'.
అందులోనూ ఆయన గారాల సోదరి కిమ్ యో- జోంగ్ మరింత పవర్ ఫుల్!
ఈ విషయం తాజా శీతాకాల ఒలింపిక్స్ క్రీడల ప్రారంభం సమయంలో స్పష్టంగా కనిపించింది.
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె, దక్షిణ కొరియా వాసులను మంత్రముగ్ధుల్ని చేశారు.
తన సోదరుడు, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ స్వహస్తాలతో రాసి పంపిన ఆహ్వాన పత్రంతో దక్షిణ కొరియా అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టారు ఆమె. ఆ ఉత్తరంలోని ప్రతి విషయాన్నీ టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారంలో చూపించాయి.
ఆమె జుట్టు మీద చర్చ!
అంతేకాదు, ఆమె హెయిర్ స్టైల్, దుస్తుల నుంచి ఆమె చేసిన సంజ్ఞల వరకు అన్నింటిపైనా మీడియాలో చర్చలు నడిచాయి.
మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆమె పేరును అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టిన విషయాన్ని మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఇక ప్యెంగ్చాంగ్లో శీతాకాల ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేదికపై ఆమె ప్రత్యక్షమైనప్పుడు స్టేడియంలో కనిపించిన సందడి అంతా ఇంతా కాదు. అందరి చూపూ ఆమె వైపే. ప్రేక్షకుల ఫోన్ కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేశాయి.
దక్షిణ కొరియా నేలపై అడుగుపెట్టిన ఉత్తర కొరియా మహిళా 'ఫైర్ బ్రాండ్'ను చూడాలన్న ఆసక్తి స్టేడియంలోని అందరి ముఖాల్లోనూ కనిపించింది.
ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి!
"ఇదో వింత, అద్భుతం, ఇంతకుముందు ఎన్నడూ ఉత్తరకొరియా వాళ్లను చూడలేదు’’ అని ఓ యువకుడు అన్నారు.
కిమ్ తన స్వహస్తాలతో రాసిన ఆహ్వాన పత్రాన్ని ఆయన సోదరి యో-జోంగ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌కి అందించారు.
ఉత్తర కొరియా ప్రతినిధి
ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల్లో కిమ్ యో- జోంగ్‌దే కీలక పాత్ర. అలాగే తన అందం, ఆహార్యంతో ఇతరులను ఇట్టే తనవైపు తిప్పుకోగల చాతుర్యం ఆమె సొంతం.
తన సోదరుడి ప్రతిష్ఠను, దేశ ప్రత్యేకతను ప్రదర్శించడంలోనూ ఈ పర్యటనలో ఆమె సఫలమయ్యారు.
"దక్షిణ కొరియా వాసులకు ఉత్తర కొరియాకు చెందిన కిమ్ కుటుంబ సభ్యులు కనిపించడం చాలా అరుదైన విషయం. ఆమెను చూసేందుకు జనాలు ఎగబడటం సహజమే. అయితే, ఉత్తర కొరియన్లు ఎంత సమర్థవంతులన్న విషయాన్ని ఆమె నిరూపించారు" అని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఉత్తర కొరియా మాజీ బ్యూరో చీఫ్ జీన్ లీ అభిప్రాయపడ్డారు.
"వింటర్ ఒలింపిక్స్ వేడుకల కోసం ఉత్తర కొరియా అందగత్తెలను పంపించింది. నిజానికి అందంతో ఇతరుల దృష్టిని ఆకర్షించడం వారి పని. అంతే తప్ప, వాళ్లేమీ చెడ్డవారు కాదు’’ అని జీన్ లీ వివరించారు.
శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభానికి కొన్ని వారాల ముందునుంచే దక్షిణ కొరియాలో ఉత్తర కొరియా సుందరీమణుల సందడి మొదలైంది. ఆ దేశ ప్రముఖ సెలబ్రిటీ, 'మారన్‌బాంగ్' సంగీతకారిణి హ్యోన్ సాంగ్ వోల్ ఎంతోమంది మనసులను దోచేశారు.
దక్షిణ కొరియా మీడియా హ్యోన్ సాంగ్ వోల్పైనే ఎక్కువ దృష్టి సారించింది. దాంతో అప్పటికి ఐదు నెలల క్రితమే ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించిందన్న వాస్తవాన్ని మరిపించేలా చేశారామె.
ఫొటో సోర్స్, AFP/Getty
సొగసైన వేషధారణతో దక్షిణ కొరియా వాసుల మనసు దోచిన ఉత్తర కొరియా చీర్‌లీడర్స్.
సహజ సౌందర్యం
చర్మ సౌందర్యం కోసం దక్షిణ కొరియా వాసులు తెగ కష్టపడతారు. కానీ, సహజమైన, సంప్రదాయబద్ధమైన అందానికి ఉత్తర కొరియా అమ్మాయిలు చక్కటి ఉదాహరణ.
చిరునవ్వుతో ఇతరుల మనసులు దోచుకోవాలన్న విషయాన్ని తమకు శిక్షణలోనే చెబుతారని ఉత్తర కొరియా చీర్‌లీడర్స్ బృంద మాజీ సభ్యురాలు ఒకరు చెప్పారు.
"ఉత్తర కొరియా స్వీయ సోషలిస్టు భావజాలాన్ని ప్రమోట్ చేయాలని చెబుతారు. మేము ఎంత గర్వంగా ఉన్నామో శత్రువుకు అర్థమయ్యేలా ప్రదర్శన చేయాలని అనుకుంటాం. అందరికంటే మెరుగ్గా మా ప్రదర్శన ఉండాలి. అందుకోసం ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాలి" అని చీర్‌లీడర్స్ బృంద మాజీ సభ్యురాలు హాన్ సియో- హీ వివరించారు.
ఆమె ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోయారు. ఎందుకంటే ఆమె సోదరుడు కూడా అలాగే పొరుగు దేశానికి పారిపోయాడు. ఒకవేళ ఆమె అక్కడే ఉండి ఉంటే తనకు, తన కుటుంబానికి జైలు శిక్ష పడేది. ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలో స్వేచ్ఛగా గడుపుతున్నారు.
సంచిలో ఉత్తర కొరియా మట్టి, కిమ్ తండ్రి ఫొటో!
"ఎక్కడికెళ్లినా తమ స్వదేశంపై, దేశాధినేత పట్ల గౌరవాన్ని మరవకూడదు. అందుకే ఉత్తర కొరియా నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొందరు పిడికెడు మట్టిని కూడా సూట్‌కేసుల్లో తీసుకెళ్తారు. మరికొందరు కిమ్ జోంగ్- ఇల్ (ఆ దేశ ప్రస్తుత పాలకుడి తండ్రి) చిత్రపటాన్నిపట్టు వస్త్రంలో చుట్టి, సంచిలో పట్టుకెళ్తారు" అని ఓ మహిళ వివరించారు.
ఇలాంటి భావజాలం దక్షిణ కొరియా ప్రజలకు చాలా వింతగా అనిపిస్తుంది.
2003లో జరిగిన ఓ సన్నివేశాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
"ఉత్తర కొరియా చీర్‌లీడర్స్ బృందం దక్షిణ కొరియా చేరుకున్న సమయంలో వర్షం పడుతోంది. అయితే, ఆ వర్షానికి ఉత్తర కొరియా జాతీయ పతాకం మీద ఉన్న కిమ్ జోంగ్- ఇల్ చిత్రం తడిసిపోయింది. దాంతో ఆందోళన పడుతూ అందరూ బస్సులోంచి గబగబా దిగారు. ఆ ఫొటోను కాపాడేందుకు అందరూ చుట్టూ చేరారు. అది చూసి ముక్కున వేలేసుకోవడం దక్షిణ కొరియా వాసుల వంతైంది. ఉత్తర, దక్షిణ కొరియా దేశాలకు మధ్య ఉన్న తేడాను నొక్కి చెప్పేందుకే వాళ్లు అలా చేస్తారు" అని అంటారు హాన్ సియో హీ అంటారు.
ఇవి కూడా చదవండి:
- 'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడు... యూనియన్ లీడర్, మైనింగ్ బాస్!
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి: రౌహాని
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- ఆ దెబ్బలకు కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)