దక్షిణాఫ్రికా: ఎవరీ గుప్తాలు? జాకబ్ జుమాతో వాళ్లకున్న సంబంధమేంటి?

అజయ్, అతుల్ గుప్తా, డుడుజేన్ జుమా

ఫొటో సోర్స్, Gallo Images

ఫొటో క్యాప్షన్,

గుప్తా సోదరుల వద్ద పని చేస్తున్న జాకబ్ జుమా కుమారుడు

దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జాకబ్ జుమాకు భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో అవినీతి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదురవుతున్నాయి. గుప్తాలు వివిధ మంత్రిత్వ శాఖల్లో తమకు కావాల్సిన వాళ్లను నియమించుకున్నారని కూడా ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇంతకూ ఈ గుప్తాలెవరు? దక్షిణాఫ్రికాకు వాళ్లు ఎలా వచ్చారు?

అజయ్ గుప్తా, అతుల్ గుప్తా, రాజేశ్ (టోనీ అని కూడా పిలుస్తారు) గుప్తాలు 1993లో శ్వేతజాతి పాలన ముగియడానికి ముందు, ఆ దేశం మిగతా ప్రపంచంతో సంబంధాలు పెంచుకుంటున్న సమయంలో భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణాఫ్రికాకు వలస వచ్చారు.

వాళ్ల తండ్రి శివకుమార్ గుప్తా మొదట అతుల్‌ను దక్షిణాఫ్రికాకు పంపారు. ఆఫ్రికాకు వచ్చిన అతుల్ సహారా కంప్యూటర్స్ పేరిట కుటుంబ వ్యాపారాన్ని నెలకొల్పారు.

భారతదేశంలో వాళ్లు చిన్న వ్యాపారులు. కానీ దక్షిణాఫ్రికాలోని వాళ్ల సహారా కంపెనీ (భారతదేశంలోని సహారాకు దీనితో ఎలాంటి సంబంధమూ లేదు) వార్షిక టర్నోవర్ ఇప్పుడు సుమారు రూ.140 కోట్లు. ఆ సంస్థలో సుమారు 10 వేల మందికి పైగా పని చేస్తున్నారు.

కంప్యూటర్లతో పాటు ఆ కుటుంబం మైనింగ్, విమానయానం, విద్యుత్ రంగం, మీడియాలలో కూడా విస్తరించింది.

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్,

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా

జుమా + గుప్తా = జుప్తా

జాకబ్ జుమా భార్యల్లో ఒకరైన బోంగి గెమా-జుమా గుప్తాలకు చెందిన జేఐసీ మైనింగ్ సర్వీస్‌లో పని చేసేవారు. గుప్తా కుటుంబం సుమారు రూ.2 కోట్ల విలువ చేసే నివాస భవనాన్ని ఆమె కోసం కొనుగోలు చేశారని వార్తలు వెలువడ్డాయి. అయితే దానిని ఆమె ఖండించారు.

జాకబ్ జుమా కూతురు డుడుజైల్ జుమా సహారా కంప్యూటర్స్‌లో డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలల తర్వాత ఆమెకు ఆ పదవి దక్కింది. అయితే తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

జాకబ్ జుమా కుమారుడు డుడుజేన్ జుమా, గుప్తా యాజమాన్యం కింద ఉన్న కంపెనీలో డైరెక్టర్‌గా పని చేశారు. 2016లో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేశారు.

వివాదాల్లో గుప్తాలు

  • జోహాన్నెస్‌బర్గ్‌లోని సాక్సన్‌వాల్డ్‌లో వాళ్లకు కనీసం నాలుగు విలాసవంతమైన భవనాలున్న ఎస్టేట్ ఉంది. దాని విలువ సుమారు రూ.29 కోట్లు. ఆ ఎస్టేట్‌లోనే హెలిపాడ్ కూడా ఉంది.
  • కేప్ టౌన్‌లో యూకే మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ కుమారుడు సర్ మార్క్ థాచర్ నివాసాన్ని కూడా వాళ్లు కొనుగోలు చేశారు.
  • దక్షిణాఫ్రికా రాజకీయాలపై గుప్తా కుటుంబం పట్టు ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం కూడా ప్రయత్నించారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
  • మార్చి 2016లో సహాయ ఆర్థిక మంత్రి కెబిసీ జోనాస్ - 2015లో ఒక కుటుంబం తనను మంత్రి పదవికి ప్రమోట్ చేస్తానని ఆశ పెట్టారంటూ ప్రకటించడం దుమారం రేపింది. అయితే తాము ఆ పని చేయలేదంటూ గుప్తా కుటుంబం ప్రకటించింది.
  • అదే విధంగా ఏఎన్‌సీ ఎంపీ వైట్జీ మెంటర్ 2010లో తనకూ అలాంటి ఆశే చూపించారంటూ చేసిన ఆరోపణలనూ వారు కొట్టిపారేశారు.

తమకు నచ్చిన వారిని అందలం ఎక్కించే ప్రయత్నాలతో పాటు, నచ్చని వారిని పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నించారని గుప్తా కుటుంబంపై ఆరోపణలున్నాయి.

గుప్తా కుటుంబానికి చెందిన సుమారు రూ.3 వేల కోట్ల అనుమానాస్పద లావాదేవీల గురించి ప్రశ్నించిన మాజీ ఆర్థిక మంత్రి ప్రవీణ్ గోర్ధాన్‌ను పదవి నుంచి తొలగించడానికి కూడా వారి కుటుంబమే కారణమనే ఆరోపణలున్నాయి.

ఒకానొక సందర్భంలో గుప్తా కుటుంబ సభ్యులు జాకబ్ జుమాతో పాటు తాము కూడా ఇతర దేశాలకు వెళ్తుంటాం కాబట్టి తమకూ దౌత్యపరమైన పాస్‌పోర్టులు కావాలని కోరారు. అయితే వారి విజ్ఞప్తిని తిరస్కరించారు.

అత్యంత ఆడంబరంగా పెళ్లి

మొదటిసారిగా 2013లో వారి పెళ్లికి వచ్చిన అతిథుల ప్లేన్ ప్రిటోరియా సమీపంలోని వాటర్‌క్లూఫ్ మిలటరీ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయినపుడు వారు మొదటిసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆ ఎయిర్‌బేస్‌ను సాధారణంగా మిలటరీ, దౌత్య అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తారు.

అయితే తర్వాత ఈ విషయంపై అతుల్ గుప్తా క్షమాపణలు తెలిపారు.

వారి పెళ్లికి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడం కూడా విమర్శలకు దారి తీసింది.

వీటన్నిటికీ జాకబ్ జుమాతో వాళ్లకు ఉన్న దగ్గర సంబంధాలే కారణమని విమర్శకుల అభిప్రాయం.

మే, 2017లో లీక్ అయిన ఈమెయిల్స్ - గుప్తాలు, ప్రభుత్వం మధ్య ఉన్న సంబంధాల గురించి వెల్లడించాయి.

ఆ తర్వాత పేద రైతుల కోసం ఉద్దేశించిన కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని అతుల్ గుప్తా అకౌంట్‌లో డిపాజిట్ చేసినట్లు తేలింది. దీనిపై ఆయన ఇంకా ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Gupta family

ఫొటో క్యాప్షన్,

అత్యంత విలాసంగా జరిగిన ఈ పెళ్లితో గుప్తాల కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది

బెల్ పాటింగర్ - 'శ్వేత గుత్తాధిపత్యం'

'శ్వేత గుత్తాధిపత్య పెట్టుబడి' ఆలోచనను ముందుకు తెచ్చిన బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ కూడా ఈ వివాదంలో చిక్కుకుంది.

మార్గరెట్ థాచర్ మాజీ సలహాదారు లార్డ్ బెల్ స్థాపించిన 'బెల్ పాటింగర్' అనే సంస్థ నకిలీ ట్విటర్ పేజీలను సృష్టించి దాని ద్వారా శ్వేతజాతీయుల వ్యాపార శక్తిపై ప్రచారం చేసింది. మైనారిటీ శ్వేత జాతీయులు చెప్పుకోదగ్గ ఆర్థిక బలాన్ని కలిగిన దక్షిణాఫ్రికాలో దీని వల్ల జాతిపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి.

ఇదంతా గుప్తా కుటుంబానికి అధ్యక్షుడు జాకబ్ జుమాతో ఉన్న సంబంధాల గురించి, అవినీతి ఆరోపణ నుంచి దృష్టిని మరల్చడానికే అని విపక్షాలు ఆరోపించాయి.

బెల్ పాటింగర్ సంస్థకు గుప్తా కుటుంబానకి చెందిన 'ఓక్‌బే ఇన్వెస్ట్‌మెంట్' సుమారు నెలకు రూ.90 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, AFP / Gupta Family

ఫొటో క్యాప్షన్,

గుప్తాల కుటుంబంలో వివాహం

గుప్తాలకు ఇతర రాజకీయవేత్తలతో సంబంధం ఉందా?

గుప్తాలు గత ప్రభుత్వంతో కూడా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ మాజీ అధ్యక్షుడు థాబో బెకీ గుప్తాలతో జాగ్రత్తగా వ్యవహరించారు.

మాజీ డీఏ నేత హెలెన్ జిల్ కూడా గుప్తాల ఆతిథ్యాన్ని స్వీకరించి, వారి నుంచి పార్టీ విరాళాలు స్వీకరించారు.

ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ (ఈఈఎఫ్) పార్టీ - ఇలాంటి మాఫియా విధానాలు పాటించే గుప్తాల కుటుంబం దేశంలో ఉండడం ప్రమాదకరమనీ, వాళ్లు దేశాన్ని విడిచివెళ్లాలని డిమాండ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి: