జస్టిన్ ట్రూడో: ఈ కెనడా ప్రధానికి ఎన్ని ప్రత్యేకతలో?

  • 17 ఫిబ్రవరి 2018
జస్టిన్ ట్రూడో Image copyright JustinTrudeau/TWITTER

"మీ అబ్బాయి కెనడాకు ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నా". ఇది 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు 4 నెలల వయసున్న జస్టిన్ ట్రూడోను చూసి ఆయన తండ్రి జస్టిన్ పియరీ ట్రూడోతో అన్న మాట.

నిక్సన్ అన్నట్లుగానే.. 2015లో కెనడాకు జస్టిన్ ట్రూడో ప్రధాన మంత్రి అయ్యారు.

ఆయన ఓ దేశానికి ప్రధాన మంత్రి మాత్రమే కాదు.. టీచర్, బాక్సర్, నైట్‌క్లబ్ డ్యాన్సర్, ప్రపంచాన్ని ఆకట్టుకునే నాయకుడు, కార్టూన్ పుస్తకంలో క్యారెక్టర్ కూడా.

వారం రోజులపాటు భారత్‌లో పర్యటించనున్న ట్రూడో గురించి ఎన్నో ఆసక్తికర అంశాలు మీకోసం..

Image copyright MARVEL/RAMON PEREZ
చిత్రం శీర్షిక కార్టూన్ పుస్తకం కవర్ పేజీ

సంక్రాంతి వేడుకల్లో

ఈ కెనడా ప్రధాని ఎందరో భారతీయుల మనసులను దోచారు. భారతీయుల పండుగల్లో ఉత్సాహంగా పాల్గొంటూ భారతీయ సంప్రదాయ వేషధారణ, భాంగ్రా నృత్యాలతో హుషారెత్తిస్తారు.

కుర్తా పైజామాతో బాలీవుడ్ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోలో చూడొచ్చు. ఆయన కెనడా ప్రధాని కాకముందు తీసిన వీడియోనే అయినప్పటికీ, అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత బాగా వైరల్ అయ్యింది.

కెనడాలో ఉన్న హిందూ ఆలయాలను, గురుద్వారాలను ఆయన సందర్శిస్తుంటారు. గత ఏడాది టొరంటోలోని స్వామినారాయణ్ ఆలయ పదో శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారాయన.

ఈ ఏడాది తమిళులతో కలిసి పొంగల్ సంబరాలు చేసుకున్నారు. దీపావళి పండుగనాడు గురుద్వారాకు వెళ్లారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పంజాబీ భాషలో వైశాఖీ శుభాకాంక్షలు చెబుతూ యూట్యూబ్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారాయన.

Image copyright JustinTrudeau/TWITTER

కేబినెట్‌లో సిక్కు మంత్రులు

ఓసారి అమెరికన్లతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌ కంటే నా కేబినెట్‌లోనే ఎక్కువ మంది సిక్కు మంత్రులు ఉన్నారని ఆయన జోక్ వేశారు.

ట్రూడో మంత్రివర్గంలో నలుగురు సిక్కులు ఉన్నారు. వారిలో కీలకమైన కెనడా రక్షణ శాఖ మంత్రి హర్జీత్ సజ్జన్ కూడా ఒకరు.

భారత పర్యటనలో భాగంగా జస్టిన్ ట్రూడో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని కూడా సందర్శించనున్నారు.

క్షమాపణలు చెప్పిన ట్రూడో

1914లో హిందూ, సిక్కు, ముస్లింలు ఉన్న ఓడను కెనడా వెనక్కి పంపిన ఘటనకు 2016లో జస్టిన్ ట్రూడో క్షమాపణలు చెప్పారు.

'కొమగట మారు' అనే జపాన్ ఓడ 1914 మే 23న హాంకాంగ్ నుంచి 376 మంది వలసదారులతో కెనడా చేరుకుంది. అందులో ఎక్కువ మంది భారతీయులే.

అయితే, కెనడాలో అప్పుడున్న విధానాల కారణంగా చాలామంది వెనక్కి రావాల్సి వచ్చింది.

అలా భారత్ వస్తూ బ్రిటిష్ సైన్యం జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఓడ భారతీయ సిక్కు వ్యాపారవేత్తదని తేలింది. ఆ ఘటన కెనడాపై మాయని మచ్చగా ఉండిపోయింది.

Image copyright Vancouver Public Library

బాక్సర్, రన్నర్!

జస్టిన్ ట్రూడోకి బాక్సింగ్‌లోనూ పట్టుంది. అధికారం చేపట్టే స్థాయికి ఎదగడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చిందే అతని గట్టి 'బాక్సింగ్ బౌట్' అని చెప్పొచ్చు.

అంతకుముందు ఆయన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఫ్రెంచ్ భాష, గణితం బోధించేవారు.

2016లో మెక్సికో అధ్యక్షుడు పెనా నీటోతో కలిసి ట్రూడో జాగింగ్ చేస్తూ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఫొటో బాగా వైరల్ అయ్యింది.

అంతేకాదు, 'సివిల్ వార్ II: చూసింగ్ సైడ్స్' అనే కార్టూన్ పుస్తకం కవర్ పేజీపై కూడా ఆయన చిత్రాన్ని ముద్రించారు.

Image copyright Reuters

బీరు సీసాలపై ఫొటో

ఉక్రెయిన్‌కు చెందిన ఓ మద్యం తయారీ కంపెనీ బీరు సీసాలపై జస్టిన్ ట్రూడో ఫొటోను ముద్రిస్తోంది.

ట్రూడో పార్టీ లిబరల్ పార్టీకి గుర్తుగా ఆ సీసాలపై 'ఎల్' అక్షరం కూడా ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు ఆయన మద్దతు ఇచ్చినందుకు గౌరవార్థం అలా చేస్తున్నారు.

ట్రూడో స్టైలే వేరు. ఆయన వేసుకునే రంగురంగుల సాక్సులకూ భలే క్రేజ్ ఉంది.

జర్మనీలోని హాంబర్గ్‌లో జీ20 దేశాల సదస్సు జరగుతున్న సమయంలో ట్రూడో వేసుకున్న సాక్సులు పలువురిని ఆకట్టుకున్నాయి.

అంతేకాదు, ఆయన సాక్సుల విశేషాలను తెలిపేందుకే ప్రత్యేకంగా ఓ ఫేస్‌బుక్ పేజీ కూడా ఉంది. ఉక్రెయిన్ వ్యాపార రాయబారులు ట్రూడోకి సాక్సులనే బహుమతిగా ఇచ్చారు.

Image copyright REUTERS

చిన్నారికి ట్రూడో పేరు

వలసదారుల పట్ల ట్రూడో ఎంతో ఉదారంగా వ్యవహిరిస్తారన్న ప్రశంసలు పొందారు.

అందుకు కృతజ్ఞగా సిరియా నుంచి కెనడా వలస వెళ్లిన ఓ శరణార్థి జంట తమ కుమారుడికి జస్టిన్ ట్రూడో అడమ్ బిలాన్ అని పేరు పెట్టుకుంది.

2015 నవంబర్‌లో ప్రధాని పీఠం ఎక్కిన నాటి నుంచి 2017 జనవరి వరకు 40 వేల మందికి పైగా సిరియా శరణార్థులు కెనడా వెళ్లి స్థిరపడ్డారు.

7 ముస్లిం దేశాలకు చెందిన శరణార్థులపై అమెరికా గతేడాది విధించిన తాత్కాలిక నిషేధాన్ని కూడా ట్రూడో వ్యతిరేకించారు.

Image copyright ADAM SCOTTI/TWITTER

ట్రంప్‌తో కరచాలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కరచాలనం చేయడంలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తారన్న పేరుంది. అయితే, ట్రంప్ బలవంతపు కరచాలనాన్ని జస్టిన్ ఎలా డీల్ చేశారో చూపించే వీడియో బాగా వైరల్ అయ్యింది.

ఇటీవల టొరంటోలో నిర్వహించిన వార్షిక గే ప్రైడ్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. కెనడా ప్రభుత్వాధినేత ఆ పరేడ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.

చిన్న పిల్లల మనస్తత్వం, అహంకారి, అనుభవ రహితుడు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనేం పట్టించుకోరు.

ఇటీవల ఓ సమావేశంలో మహిళ ప్రసంగంలో 'మ్యాన్‌కైండ్'(మానవజాతి) అనే పదాన్ని వాడారు. అయితే, వెంటనే ట్రూడో కలగజేసుకుని మ్యాన్‌కైండ్‌కి బదులుగా 'పీపుల్‌కైండ్' అనే పదాన్ని వాడాలి అని సలహా ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

Image copyright JIM WATSON/AFP/Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్, ట్రూడోల కరచాలనం

తాజ్‌మహల్ పర్యటన

46 ఏళ్ల జస్టిన్ ట్రూడో ఈనెల 17 నుంచి 23 వరకు భారత్‌లో పర్యటిస్తారు.

దౌత్య, వాణిజ్య పరపమైన సమావేశాలతో పాటు ఆగ్రాలోని తాజ్‌మహల్‌, దిల్లీలోని జామా మసీదు సందర్శిస్తారు.

వీటితోపాటు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, గుజరాత్‌లోని స్వామినారాయణ్ అక్షర్‌ధాం ఆలయాలకు కూడా ఆయన వెళ్లే అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)