జెన్నిఫర్ లారెన్స్: ‘రాజకీయాల’ కోసం నటనకు ‘సెలవు’

  • 19 ఫిబ్రవరి 2018
జెన్నిఫర్ లారెన్స్ Image copyright PA
చిత్రం శీర్షిక డేవిడ్ ఒ రసెల్ దర్శకత్వం వహించిన ’సిల్వర్ లైనింగ్స్ ప్లేబ్యాక్’ సినిమాకు గాను జెన్నిఫర్ లారెన్స్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు

ఆమె ఆస్కార్ విజేత. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో ఒకరు. ఆమె జెన్నిఫర్ లారెన్స్. ఇప్పుడు హాలీవుడ్‌కు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఒక ఏడాది కాలం పాటేననుకోండి.

’హంగర్ గేమ్స్’ సినిమాల్లో కథానాయికగా ప్రపంచ వ్యాప్తంగా యువ ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టిన జెన్నిఫర్ లారెన్స్.. ’’యువతను రాజకీయంగా మరింత చైతన్యవంతం’’ చేసేలా ఉద్యమించటానికి ఈ ఏడాది విరామం తీసుకుంటున్నారు.

ఆమె ఇప్పటికే దర్శకుడు డేవిడ్ ఒ. రసెల్‌తో కలిసి రిప్రెజెంట్.యూఎస్. (Represent.Us.)లో భాగంగా ఉన్నారు.

Image copyright Vittorio Zunino Celotto/Getty Images

రాజకీయ లంచగొండితనం అంతం కోసం, అవినీతి వ్యతిరేక చట్టాల రూపకల్పన కోసం ఈ స్వచ్ఛంద సంస్థ ప్రచారం చేస్తోంది.

జెన్నిఫర్ నటించిన తాజా సినిమా ’రెడ్ స్పారో’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత తాను విరామం తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

‘‘వచ్చే ఏడాది నేను సెలవు తీసుకోబోతున్నా’’ అని జెన్నిఫర్ ’ఈటీ’తో పేర్కొన్నారు.

’’రిప్రజెంట్. అజ్’లో భాగస్వామిగా నేను పనిచేయబోతున్నాను.. క్షేత్ర స్థాయిలో యువతను రాజకీయంగా మరింత క్రియాశీలం చేయటానికి ప్రయత్నిస్తాను. దీనికి పక్షపాత రాజకీయాలకు సంబంధం లేదు’’ అని ఆమె చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గత నెలలో లాస్ ఏంజెలెస్‌లో జరిగిన మహిళల ప్రదర్శనలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

‘‘ఇది కేవలం అవినీతి వ్యతిరేక ఉద్యమం. అవినీతిని నిరోధించటానికి, ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దటానికి రాష్ట్రాల వారీగా చట్టాలు చేయటం కోసం కృషి’’ అని తెలిపారు.

రాజకీయ ఉద్యమకారిణిగా జెన్నిఫర్ ఇప్పటికే కొంత పేరు సంపాదించుకున్నారు. 2015 లోనే హాలీవుడ్‌లో వేతనాల వ్యత్యాసం మీద చర్చించిన ప్రముఖ నటీమణుల్లో ఆమె ఒకరు.

మహిళల హక్కులు, సమానత్వం కోరుతూ గత నెలలో లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 2018 మహిళల కవాతులోనూ ఆమె కామెరాన్ డియాజ్, అడిల్‌లతో కలిసి పాల్గొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు