ఆఫ్రికా: మరో రెండు భాషల్లో బీబీసీ వార్తలు

  • 19 ఫిబ్రవరి 2018
నైజీరియాలోని లాగోస్‌లో విధులు నిర్వహిస్తున్న బీబీసీ ఈబో, యోరుబా ప్రతినిధులు
చిత్రం శీర్షిక నైజీరియాలోని లాగోస్‌లో విధులు నిర్వహిస్తున్న బీబీసీ ఈబో, యోరుబా ప్రతినిధులు

ఆఫ్రికాలో మరో రెండు భాషలు- ఈబో (Igbo), యోరుబా (Yoruba) లలో బీబీసీ వరల్డ్ సర్వీస్ తన సేవలను ప్రారంభించింది.

నైజీరియా దేశంతోపాటు పశ్చిమ, మధ్య ఆఫ్రికాల్లో ఈ భాషలు మాట్లాడే ప్రజల కోసం బీబీసీ ఈ సర్వీసులను తీసుకొచ్చింది. వీరిలో ప్రధానంగా మొబైల్ వాడే యూజర్లను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ కంటెంట్ అందిస్తుంది.

ఈబో భాషను నైజీరియాలోని ఆగ్నేయ ప్రాంతంలో, యోరుబాను నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో, బెనిన్, టోగో దేశాల్లో మాట్లాడతారు. ఈబోను మూడు కోట్ల మందికి పైగా, యోరుబాను నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు మాట్లాడతారు.

1940ల తర్వాత బీబీసీ వరల్డ్ సర్వీస్ చేపడుతున్న అతిపెద్ద విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ రెండు భాషల్లో సర్వీసులను ప్రారంభించింది. ఆఫ్రికా, ఆసియాల్లో బీబీసీ మొత్తం 12 సర్వీసులను తీసుకొస్తోంది.

చిత్రం శీర్షిక నైజీరియాలోని లాగోస్‌లో బీబీసీ యోరుబా బృందంతో మాట్లాడుతున్న ఒక విద్యావేత్త

ఆఫ్రికా ఖండంలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలో ఉండే నైజీరియాలో 200కు పైగా భాషలు మాట్లాడతారు. నైజీరియాతోపాటు పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని ప్రజలను దృష్టిలో ఉంచుకొని బీబీసీ వరల్డ్ సర్వీస్ నిరుడు బీబీసీ పిడ్‌జిన్‌ సేవలను ప్రారంభించింది.

పిడిజిన్‌ ప్రధానంగా వ్యవహారిక భాష. అందరి ఆమోదమున్న ప్రామాణికమైన లిపి ఈ భాషకు లేదు. ఈ కారణంగా, పిడిజిన్‌లో సేవలను ప్రారంభించేందుకు బీబీసీ బృందం పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈబో, యోరుబా భాషల్లో సర్వీసులను ప్రారంభించే ముందు కూడా సంబంధిత బృందాలకు సవాళ్లు ఎదురయ్యాయి. నేటి తరం పాఠకులు, వీక్షకులకు అనువుగా ఈ భాషలను వినియోగించే విషయంలో విద్యావేత్తల సలహాలు తీసుకొని బృందాలు ముందుకు సాగాయి.

ఆఫ్రికా సాహిత్య మూలపురుషుల్లో ఒకరిగా పరిగణించే ప్రఖ్యాత రచయిత చినువా అచెబే.. ఈబో మాట్లాడే ప్రముఖుల్లో ఒకరు.

యోరుబా మాట్లాడే ప్రముఖుల్లో నైజీరియా కవి, రచయిత, నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత వోల్ సోయింకా ఒకరు.

ప్రస్తుతం ఈబో, యోరుబా భాషల్లో సేవలు అందించే మీడియా సంస్థలు స్వల్ప సంఖ్యలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)