‘ట్రంప్ నిర్ణయం అమలైతే భర్తతోపాటు వెళ్లే భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగం చేయలేరు’!

ఫొటో సోర్స్, LOIC VENANCE/AFP/Getty Images
అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ మహిళలు అక్కడ ఉద్యోగం చేసే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.
అమెరికాలో వారికి పనిచేసే హక్కు లేకుండా చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
భర్తతో పాటు వచ్చే మహిళలకు అమెరికాలో పనిచేసే హక్కును ఒబామా ప్రభుత్వం 2015లో తొలిసారిగా కల్పించింది.
ఇప్పుడు ఆ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.
అదే జరిగితే అమెరికాలో ఉంటున్న వేలాది మంది భారతీయ, చైనా మహిళలు ఉద్యోగం కోల్పోతారు.
అమెరికాలో ఉన్న విదేశీ ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది భారత్, చైనా నుంచి వచ్చిన వారే ఉన్నారు. వారికి హెచ్1బీతో పాటు ప్రాథమిక వీసాలున్నాయి.
ఫొటో సోర్స్, Getty Images
'మమ్మల్ని బంగారు పంజరంలోకి నెట్టేస్తున్నట్లుగా ఉంది'
ట్రంప్ విధానాలపై అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పదేళ్ల క్రితం నేహా మహాజన్ భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారికి అమెరికానే పుట్టిల్లు. ఆమె భర్తకు హెచ్1బీ వీసా ఉంది.
రెండేళ్ల క్రితం ఆమెకు తొలిసారిగా అమెరికాలో పని చేసే హక్కు లభించింది. ఇప్పుడా హక్కును లాగేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
దీనిపై నేహా మహాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
'నన్ను మళ్లీ బంగారు పంజరంలోకి నెట్టేస్తున్నట్లుగా ఉంది. నా ప్రతిభ, శక్తి సామర్థ్యాలతో ఈ ప్రపంచానికి పెద్దగా పనిలేదు. నేను ఇక ఇంటిపనికే పరిమితం కావాలా' అని ఆమె ప్రశ్నించారు.
ఈ నెల ప్రారంభంలో అమెరికా రాజధానిలో నిరసన తెలిపిన భారతీయుల్లో నేహా కూడా ఉన్నారు.
ట్రంప్ తీసుకురావాలని భావిస్తున్న మార్పుల వల్ల భారతీయ, చైనా మహిళలపైనే అధిక ప్రభావం ఉంటుంది.
ఈ రెండు దేశాల నుంచి వచ్చిన వలసవాదుల్లో మహిళల కంటే పురుషులకే ఎక్కువ వీసాలు ఉన్నాయి.
ఫొటో సోర్స్, iStock
న్యూజెర్సీలో దశాబ్దాలుగా భారతీయ టెకీలు సేవలు అందిస్తున్నారు. అమెరికా కలను సాకారం చేసుకుని ఇక్కడే జీవిస్తున్నారు. అమెరికన్ల కంటే భారతీయ టెకీలకు ఇచ్చే వేతనాలు తక్కువ కాబట్టి వీరి వల్ల అక్కడి కంపెనీలు కూడా లాభపడుతున్నాయి.
అమెరికాలోని వలస కార్మికుల భార్యలకు పనిచేసే హక్కు కల్పించడాన్ని ఒబామా హయాంలో కొందరు వ్యతిరేకించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేశారు.
'అమెరికన్లకే ఉద్యోగాలు రావాలని ట్రంప్ భావిస్తున్నారు. వారి జీతాలు పెరగాలని కోరుకుంటున్నారు. వలసవాదులకు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే కంపెనీలు లాభపడొచ్చు. కానీ దానివల్ల అమెరికన్లకు ఎలాంటి ప్రయోజనం ఉండదు' అని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ టెల్ఫోర్డ్ అన్నారు.
ట్రంప్ విధానాలతో అమెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయ మహిళల కల మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.