ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు ఇవే!! వీటిలో మీకు తెలిసినవి ఎన్ని?

  • 23 ఫిబ్రవరి 2018
తులసి Image copyright Getty Images

చాలా మత సంప్రదాయాల్లో మొక్కలను ఆధ్యాత్మిక చిహ్నాలుగా పరిగణిస్తారు.

ఆనందాన్నిచ్చేదిగా, ఆరోగ్యాన్నిచ్చేదిగా.. కొన్నిసార్లు దైవలోకానికి - భక్తులకు అనుసంధానకర్తగా ఆయా మతాలలో కొన్ని మొక్కలకు పవిత్ర స్థానం కల్పించారు.

సంగీతకారిణి జాహ్నవి హారిసన్ ‘పవిత్ర వృక్షశాస్త్రా’న్ని అధ్యయనం చేస్తున్నారు.

కమలం నుంచి.. తులసి వరకూ.. పవిత్రమైన ఏడు మొక్కలు.. అవి దేనికి ప్రతీకలు, ఎందుకు అనే వివరాలను ఆమె ఇలా వివరిస్తున్నారు.

Image copyright Getty Images

1. కమలం

ఆధ్యాత్మికత నేపథ్యంలో.. విద్యావంతులైన వారికి తామర పుష్పం విశిష్టమైనది. ముఖ్యంగా హిందువులకు (బౌద్ధులకు కూడా). మురికి, బురద నుంచి పుట్టి వాటిపైన ఒంటరిగా నిలుచునే ఈ అందమైన, ఆకర్షణీయమైన కమలం.. జీవానికి, ఫలదీకరణకు, స్వచ్ఛతకు చిహ్నం. ఈ మొక్క వేర్లు బురదలో ఉన్నాకూడా ఈ పుష్పం స్వచ్ఛంగా, ధవళవర్ణంలో నీటిపై తేలియాడుతుంటుంది.

కమలం హిందువుల దేవుడు విష్ణువు నాభి నుంచి పుట్టిందని, పుష్పం మధ్యలో మరో హిందూ దైవం బ్రహ్మ ఆసీనుడై ఉంటాడని పురాణ గాథ. దేవుడి చేతులు, పాదాలు.. కమలం లాగా ఉంటాయని, దేవుడి కళ్లు కమల దళాలుగా ఉంటాయని, దేవుడి చూపు, స్పర్శ తామర మొగ్గలంత మృదువుగా ఉంటాయని కొందరు విశ్వసిస్తారు. ప్రతి వ్యక్తిలోనూ పవిత్రమైన తామర జీవాత్మ ఉంటుందని హిందూమతం ప్రబోధిస్తుంది.

Image copyright Getty Images

2. బదనిక

బదనికను క్రిస్మస్ మాయాజాలంతో అనుబంధమున్నదిగా మనమిప్పుడు పరిగణిస్తున్నాం. కానీ దీని ప్రతీకాత్మకత ప్రాచీన సెల్టిక్ డ్రూయిడ్స్ కాలానికి చెందినది. సూర్యదేవుడు టారానీస్ స్వభావానికి ఈ బదనిక ప్రతినిధి అని వారు నమ్మేవారు. ఈ బదనిక తీగ అల్లుకునిఉన్న ఏ చెట్టునైనా పవిత్రమైనదిగా భావించేవారు.

దక్షిణాయనం.. డ్రూయిడ్ అధినాయకుడు ధవళవస్త్రం ధరించి ఓక్ చెట్టు మీదున్న బదనిక తీగను బంగారు కొడవలితో కత్తిరించే కాలం. ఆ తర్వాత ఈ విశిష్టమైన మొక్కను, దాని చిన్న పండ్లను మతపరమైన కర్మకండాలకు, ఔషధల్లోనూ ఉపయోగిస్తారు. బదనికతో తయారు చేసిన కషాయంతో జబ్బు నయమవుతుందని, ఎలాంటి విషానికైనా విరుగుడుగా పనిచేస్తుందని, మనుషులు, జంతువుల్లోనూ పునరుత్పత్తికి దోహదపడుతుందని, మంత్ర ప్రయోగాల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మేవారు. కానీ నిజానికి ఇవన్నీ పొరపాటే. బదనికను కడుపులోకి తీసుకుంటే విషపూరితమవుతుంది.

Image copyright iStock

3. తులసి

హిందూమతంలో.. పవిత్ర బృందావనానికి రక్షకురాలిగా వ్యవహరించటం ద్వారా కృష్ణభగవానుడికి, ఆయన భక్తులకు బృందాదేవి సేవ చేసిందని చెప్తారు. బృందావనం ఇప్పుడు ఒక తీర్థస్థలం. బృందాదేవి మానవరూపంలో ఉన్న దేవత అయినప్పటికీ ఆమెను భౌతిక ప్రపంచంలో తులసి రూపంగా అవతరించాలని, ఆమె ఎక్కడ పెరిగినా అది బృందావనం లాగా పవిత్ర స్థలం అవుతుందని కృష్ణుడు ఆశీర్వదించాడని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. ఈ పవిత్ర తులసి మొక్క అన్ని చోట్లా విస్తారంగా పెరుగుతంది.

ప్రపంచమంతటా కోట్లాది మంది హిందువులు, అందులోని వేర్వేరు శాఖల వారు ఆలయాల్లోనూ, ఇళ్లలోనూ తులసిని పూజిస్తారు.

Image copyright Getty Images

4. పేయోటి

నైరుతి టెక్సస్, మెక్సికోల్లోని ఎడారుల్లో సహజంగా పెరిగే ఒక చిన్నపాటి, కాండంలేని జెముడు మొక్క పేయోటి. స్థానిక ఆదివాసీలు లక్షల ఏళ్లుగా దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. మెక్సికోకు చెందిన హ్యూచోల్ ఇండియన్లు, ఉత్తర అమెరికాలోని చాలా ఆదివాసీ అమెరికా తెగల ప్రజలు.. పేయోటి పవిత్రమైన పుష్పమని, దేవుడితో సంభాషించేందుకు ఇది సాయం చేస్తుందని విశ్వసిస్తారు. ప్రార్థనా కార్యక్రమాల్లో ఉపయోగించే ఈ పుష్పం.. భ్రాంతిని కలుగజేయగలదు. ఆ భ్రాంతినే వేరే ప్రపంచ దృశ్యాలుగా భావించేవారు.

పేయోటి ఆధ్యాత్మిక శక్తులను ప్రస్తుతించేది కేవలం ఆదివాసీలు మాత్రమే కాదు. ఆ జెముడుకు గల భ్రాంతికలిగించే గుణం వల్ల.. 1950ల్లో కళాకారులు, సంగీతవిద్వాంసులు, రచయితలు దీనిని ఒక మతాన్ని ఆరాధించినట్లు ఆరాధించేవారు. తన రచన ‘వన్ ఫ్లూ ఓవర్ ద కకూస్ నెస్ట్’లోని ప్రారంభ వాక్యాలను పేయోటి వల్ల భ్రాంతిలో ఉన్నపుడు రాసినట్లు కెన్ కెసీ పేర్కొన్నారు!

Image copyright Getty Images

5. చౌకుమాను

సతత హరితంగా ఉండే చౌకుమాను చెట్టును చిరకాలంగా పునర్జన్మకు, అమరత్వానికి ప్రతీకగా పరిగణించేవారు. ఎందుకంటే.. ఈ చెట్టు కొమ్మల నుంచి వచ్చే వేళ్లు మళ్లీ నేలలో పాతుకుని కొత్త మొదళ్లుగా తయారుకాగలవు. అంతేకాదు.. చౌకుమానులో బోలైపోయిన పాత బెరడు లోపల నుంచి కొత్త కాండం కూడా పుట్టుకురాగలదు. అందుకే ఇది పునర్జన్మకు ప్రతీకగా నిలవటంలో ఆశ్చర్యం లేదు!

క్రైస్తవ విశ్వాసంలో చౌకుమాను చెట్టు ప్రతీకాత్మకమైనది: చనిపోయిన వారి శవపేటికల్లో చౌకుమాను చిగుర్లు పెట్టటం సంప్రదాయంగా ఉండేది, చాలా చర్చిల వద్ద చౌకుమాను చెట్లు ఉండేవి. చర్చి పక్కన కొన్ని చౌకుమాను చెట్లను నాటటం పరిపాటి అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో అప్పటికే చౌకుమాను చెట్టు ఉన్న ప్రదేశంలో చర్చిల నిర్మాణం జరిగేది. ఈ చెట్లను క్రైస్తవ శకానికి ముందు డ్రూయిడ్లు పవిత్రమైనవిగా భావించేవారు. వాస్తవంగా పాగన్ ఆలయ స్థలాల్లో ఈ చౌకుమాను చెట్లను నాటటం లేదా ఈ చెట్లు ఉన్న ప్రాంతాలను పాగన్ ఆలయాల కోసం ఎంపిక చేసుకోవటం జరిగింది. అనంతర కాలంలో ఈ పద్ధతినే చర్చి కూడా అవలంబించింది!

Image copyright Getty Images

6. గంజాయి

రాస్తాఫారీయన్ మతంలో గంజాయికి ప్రాధాన్యం ఉంది. ‘జీవ వృక్షం’ అంటూ ప్రస్తావించిన చెట్టు గంజాయి మొక్కేనని.. దీని వినియోగం పవిత్రమైనదని ఆ మతం విశ్వసిస్తుంది. ఉదాహరణకు ప్రకటన 22:2 ఇలా చెప్తుంది.. ‘ఈ మొక్క యొక్క ఆకులు జనులను నయం చేయును’.

రాస్తాఫారీ ‘తార్కిక సదస్సు’ల్లో గంజాయి వినియోగం అంతర్భాగం. అవి మతపరమైన సమావేశాలు. సభ్యులు రాస్తా దృక్పథంలో జీవితం గురించి ఆ సదస్సుల్లో చర్చిస్తారు. వీరు ఈ మొక్కను ‘పవిత్ర మూలిక’ అనీ, ‘జ్ఞాన మొక్క’ అనీ అభివర్ణిస్తుంటారు. ఈ మొక్క ధూమపానం ద్వారా గొప్ప జ్ఙానం, అంత:దృష్టి లభిస్తుందని వారు విశ్వసిస్తారు. ఈ మూలికను ఉపయోగించటం వల్ల దేవుడికి, విశ్వానికి, ఆధ్యాత్మిక స్వీయాత్మకు మరింత దగ్గరగా పయనిస్తామని వారు భావిస్తారు. ఈ ’జ్ఞాన మొక్క’ ధూమపానం చాలా సంప్రదాయబద్ధమైన చర్య: దీనిని ఒక సిగరెట్‌లా చుట్టటమో, పైపులో కూరటమో చేస్తారు. దానిని ఒకరి తర్వాత ఒకరు పీలుస్తూ పంచుకుంటారు. ఈ ధూమపానానికి ముందు ప్రార్థన చేస్తారు.

Image copyright Getty Images

7. భూతులసి

ఆహార పదార్థాల్లో సువాసన, రుచి కోసం వాడే ఆకులుగా ‘భూతులసి’ (ఓసిమమ్ బసీలియమ్) చాలా మందికి తెలుసు. కానీ సనాతన క్రైస్తవమతంలో, ప్రత్యేకించి గ్రీకు చర్చి పరిధిలో ఇది చాలా పవిత్రమైన మొక్క. ’బాసిల్’ అనే పేరే ‘రాచరికా’ గ్రీకు పదం నుంచి వచ్చింది.

యేసు సమాధి సమీపంలో అతడి రక్తం చిందిన చోట ఈ మొక్క పుట్టిందని సనాతన క్రైస్తవులు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ శిలువ పూజలో, ప్రత్యేకించి ఉపవాస దినాలలో ఈ భూతులసి మొక్క పాత్ర కూడా విడదీయరానిదైంది. మతాచార్యుడు పవిత్ర జలాన్ని శుద్ధి చేయటానికి ఈ భూతులసి ఆకులను ఉపయోగిస్తారు. సమావేశమైన జనం మీదకు పవిత్ర జలాన్ని చిలుకరించటానికి కూడా ఈ భూతులసి ఆకులను ఉపయోగిస్తారు. శిలువను ఈ మొక్క బొకేలతో అలంకరించి చర్చి చుట్టూ ఊరేగించి, ఆ ఆకు రెమ్మలను భక్తులకు పంచుతారు. చాలా మంది ఆ రెమ్మలకు వేర్లు పుట్టే వరకూ నీటిలో ఉంచుతారు. అలా వేర్లు వచ్చిన తర్వాత దానిని తమ ఇంట్లో నాటుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)