గయానా: ‘ఆత్మహత్యల దేశం’

  • 21 ఫిబ్రవరి 2018
విద్యార్థీ, టీచర్

ఆత్మహత్యలు అన్ని దేశాల్లోనూ ఉండే సమస్యే. కానీ దక్షిణ అమెరికాలోని గయానా అనే చిన్న దేశంలో ఆ సంఖ్య మరీ ఎక్కువ.

విస్తీర్ణంలో దాదాపు బ్రిటన్ పరిమాణంలో ఉండే గయానా జనాభా సుమారు 7.8లక్షలు.

ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడే మహిళల జాబితాలో ఆ దేశానిది మొదటి స్థానం. అదే మగవారి విషయంలో దానిది రెండో స్థానం.

గయానాలో ప్రతి లక్షమందిలో 44మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ప్రపంచ సగటుకంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఒకే దేశంలో అన్ని ఆత్మహత్యలా?

ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారు?

పేదరికం, దేశ వ్యాప్తంగా నేరాలు పెరగడమే ఈ సమస్యకు ప్రధాన కారణాలని చెబుతారు.

కుటుంబ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఎక్కువ మంది డిప్రెషన్‌కు గురికావడం కూడా ఆత్మహత్యలకు కారణమవుతోంది.

వీటికి తోడు, గయానా వాసులు తమ మానసిక స్థితి గురించి ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు.

అందుకే గయానాలోని కొన్ని స్కూళ్లు, విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా పంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. దాని వల్ల వారికి ఏవైనా సమస్యలున్నా బయటికి చెప్పుకుంటారని, ఫలితంగా వారి మానసిక పరిస్థితి కాస్త కుదుట పడుతుందనీ అవి భావిస్తున్నాయి.

గయానాలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. తోటి విద్యార్థుల చేతిలో వెక్కిరింతలు, బెదిరింపులకు గురవుతున్నారు. దాంతో వారి మనసులపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

గయానాలో ప్రతి ఏడుగురిలో ఒకరు కేవలం రోజుకి రూ.130 కంటే తక్కువ ఆదాయంతో దుర్భర పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు.

అందుకే ఆత్మహత్యల సమస్యను నివారించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.

2015లో మనుషుల మరణాలకు దారితీసిన కారణాల్లో ఆత్మహత్యలది 17వ స్థానం.

నిజానికి ప్రతి ఐదు ఆత్మహత్యల్లో నాలుగు పేద, మధ్య స్థాయి దేశాల్లోనే చోటు చేసుకుంటున్నాయి.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)