సిరియా: ప్రభుత్వ బలగాల దాడుల్లో 20 మంది చిన్నారులు సహా 100 మంది మృతి

  • 20 ఫిబ్రవరి 2018
దాడిలో గాయపడ్డ చిన్నారులు Image copyright EPA

సిరియాలో తిరుగుబాటుదారులు లక్ష్యంగా ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో సోమవారం 20 మంది చిన్నారులు సహా 100 మంది చనిపోయారని సహాయ చర్యల బృందాలు తెలిపాయి.

మృతుల సంఖ్య 100పైనే ఉన్నట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్‌వోహెచ్ఆర్)' చెప్పింది.

సిరియా రాజధాని డమాస్కస్ సమీపాన తూర్పు గౌటా ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతం తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. జైష్ అల్-ఇస్లాం, పలు ఇతర గ్రూపులు ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటిలో జైష్ అల్-ఇస్లాం గ్రూపే అత్యంత బలమైనది.

గత ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. మంగళవారం కూడా బాంబు దాడులు కొనసాగినట్లు 'సిరియా సివిల్ డిఫెన్స్' అనే సహాయ చర్యల గ్రూప్ తెలిపింది. ఈ గ్రూప్‌నే 'వైట్ హెల్మెట్స్' అని కూడా వ్యవహరిస్తారు.

Image copyright AFP/Getty
చిత్రం శీర్షిక తూర్పు గౌట్ ప్రాంతంలోని హమోరియా పట్టణంలో దాడుల నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్న మహిళ, చిన్నారులు

ఐరాస ఆందోళన

నాలుగు లక్షలకు పైగా జనాభా ఉండే తూర్పు గౌటాను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకొనేందుకు సిరియా ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారులపై దాడులను ఈ నెల్లోనే తీవ్రతరం చేశాయి.

రాజధాని సమీపంలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఒకే ఒక్క ప్రధాన ప్రాంతం తూర్పు గౌటా. తూర్పు గౌటా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.

సిరియా ప్రభుత్వ బలగాలు దాడులను నిలిపివేయాలని, పరిస్థితి చేయిదాటిపోతోందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారి పానోస్ మౌమ్‌తిజిస్ ఆందోళన వ్యక్తంచేశారు.

సోమవారం తూర్పు గౌటాలో జరిగిన దాడుల్లో పౌరుల జీవనంపై నేరుగా ప్రభావం పడింది. బేకరీలు, గోదాములు, ఆహారం నిల్వ ఉండే అనేక ప్రదేశాల్లో దాడులు జరిగాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: దాడుల అనంతరం సహాయక చర్యల దృశ్యాలు

తూర్పు గౌటా మరో అలెప్పోగా మారుతుందేమోననే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతున్నట్లు బీబీసీ మధ్యప్రాచ్యం ప్రతినిధి లీనా సింజాబ్ చెప్పారు. దాడుల్లో ప్రధాన రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయని, అంబులెన్సుల రాకపోకలకు కూడా వీల్లేకుండా పోయిందని సహాయ చర్యలు చేపడుతున్న వారు చెప్పారని తెలిపారు.

ఆస్పత్రులు, ఇతర వైద్య కేంద్రాలు దెబ్బతినడంతో వైద్యసేవలు అందించడం కష్టమవుతోంది. దీని కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది.

డమాస్కస్‌పై తిరుగుబాటుదారులు మోర్టారు దాడులు జరుపుతున్నారు. అయితే ప్రభుత్వ దళాలు వారి కన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాయి.

సిరియా సంక్షోభం తలెత్తి వచ్చే నెల ప్రథమార్ధానికి ఏడేళ్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం