BBC EXCLUSIVE: ‘‘జీవితాలను ప్రభావితం చేశాను అనిపించుకోవడమే నోబెల్‌కన్నా గొప్ప పురస్కారం!’’

  • వెంకట కిషన్ ప్రసాద్
  • బీబీసీ ప్రతినిధి
గూగీ వా థియాంగో

ఫొటో సోర్స్, BBC/Sharique

"నోబెల్ రాకున్నా, నా రచనలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తున్నందుకు నేను గర్వ పడుతుంటాను" అని ప్రముఖ కెన్యన్ రచయిత గూగీ వా థియాంగో అన్నారు.

బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన సాహితీ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడారు.

గూగీ తెలుగు సాహిత్యాభిమానులకు సుపరిచితుడే.

ఆయన రాసిన 'డెవిల్ ఆన్ ద క్రాస్' పుస్తకం తెలుగులో 'మట్టికాళ్ల మహారాక్షసి' అనే పేరుతో అచ్చయ్యింది. ఆ తర్వాత 'మాటిగరి', 'బందీ' పుస్తకాలు తెలుగులో వచ్చాయి.

మరో పుస్తకం 'డ్రీమ్స్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ వార్' ఇటీవలే 'యుద్ధకాలపు స్వప్నాలు' అనే పేరుతో తెలుగులో వచ్చింది. ఈ పుస్తకాన్ని ప్రస్తుతం నాగపూర్ జైలులో యావజ్జీవ ఖైదీగా ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తెలుగులోకి అనువదించారు.

వలసవాద పాలన పట్ల, మూడో ప్రపంచ దేశాల్లో వలసవాద మనస్తత్వం పట్ల పదునైన విమర్శలు చేసేవాడిగా పేరున్న గూగీ ఈ ఇంటర్వ్యూలో మాతృభాషలలో విద్య, సాహిత్య సృజన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు.

తన రాజకీయ విశ్వాసాల కారణంగా గూగీ కెన్యాలో జైలు జీవితాన్ని ఎదుర్కొన్నారు. చాలా సంవత్సరాల పాటు పరాయి దేశాల్లో తలదాచుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

గూగీ జైలులో ఉన్న సమయంలో మరుగుదొడ్లో ఉండే టిష్యూ పేపర్‌పై 'డెవిల్ ఆన్ ద క్రాస్' పుస్తకాన్ని రాశారు.

'సీగల్ బుక్స్' ఆహ్వానంపై గూగీ రెండు వారాల పర్యటనపై ఫిబ్రవరి 10న భారత్‌కు వచ్చారు.

ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ -

వీడియో క్యాప్షన్,

వీడియో: షారిఖ్

రచయితగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? ఆనాడు ఆఫ్రికాలో, కెన్యాలో నెలకొన్న పరిస్థితులేంటి?

నేను 1938లో కెన్యాలో పుట్టాను. కెన్యా 1895 నుంచి 1963 వరకు బ్రిటిష్ వలసగా ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన తెల్లవాళ్లు మా నేలను ఆక్రమించుకున్నారు. ఆఫ్రికన్ మూలనివాసులను వారు మూడో తరగతి పౌరులుగా దిగజార్చారు.

1952లో కెన్యన్లు వారిపై తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటును 'మౌ మౌ' ఉద్యమం అని పిలుస్తారు. తిరుగుబాటుదారులు మాత్రం తమను తాము 'కెన్యా ల్యాండ్ అండ్ ఫ్రీడమ్ ఆర్మీ' అని చెప్పుకున్నారు. భూమి, స్వేచ్ఛ - ఇవే తమ లక్ష్యాలని వారు ప్రకటించుకున్నారు.

నేను రెండో ప్రపంచ యుద్ధానికి కాస్త ముందుగా పుట్టాను. బాల్యంలో నేను బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ ఉద్యమాన్ని చూశాను. వీటన్నింటి ప్రభావం నాపై ఉంది.

ఆ తర్వాత చాలా ఏళ్లకు.. ఉగాండాలోని కంపాలాలో ఉన్న మకరెరె యూనివర్సిటీలో చదువు పూర్తయిన తర్వాత నా రచనా వ్యాసంగం మొదలైంది.

బాల్యంలో నేను చూసిన ఉద్యమాల ప్రభావం నా రచనలపై ఉంది. లేదా నేను వాటిని ప్రేరణగా తీసుకున్నాను.

మీరు మీ క్రిష్చియన్ పేరు (జేమ్స్ గూగీ)ని ఎందుకు వదిలేశారు? ఇంగ్లిష్‌లో రాయడం మొదలు పెట్టిన మీరు, దాన్ని వదిలేసి మీ మాతృభాష అయిన గికియు వైపు మళ్లడానికి కారణాలేంటి?

నిజమే, నా మొదటి మూడు నవలలు - ద రివర్ బిట్వీన్, వీప్ మై చైల్డ్, గ్రెయిన్ ఆఫ్ వీట్ - ఇంగ్లిష్‌లోనే రాశాను.

కొంత కాలానికి నేను పేర్ల గురించి, చరిత్ర గురించి పునరాలోచించడం మొదలుపెట్టాను. ఆఫ్రికన్లను బానిసలుగా మార్చుకొని అమెరికాలోని ప్లాంటేషన్లకు తీసుకెళ్లినపుడు వారి పేర్లను మార్చేసే వారు.

ప్లాంటేషన్ యజమాని పేరునే అతని బానిసలకూ పెట్టారు. వారు ఒక ప్లాంటేషన్ నుంచి మరొక ప్లాంటేషన్‌కు మారిపోతే వారి పేర్లు కూడా మార్చేసేవారు. ఒక ఆఫ్రికన్‌కు బ్రౌన్ అనే పేరు పెట్టారంటే ఆ ప్లాంటేషన్ యజమాని పేరు బ్రౌన్ అని అర్థం.

ఆ తర్వాత క్రైస్తవ మిషనరీలు ఆఫ్రికాకు వచ్చినపుడు బాప్టిజం ఇప్పించి మా వాళ్లను క్రిష్చియన్లుగా మార్చారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఆఫ్రికన్లకు క్రైస్తవ పేర్లు పెట్టారు. ఈ పేర్లన్నీ ఇంగ్లిష్ పేర్లే. అందులో భాగంగానే నా పేరును 'జేమ్స్ గూగీ'గా మార్చారు. నాకిది అప్పటి ప్లాంటేషన్ బానిసత్వానికి కొనసాగింపే అనిపించింది.

ఇది అర్థమైన తర్వాత నా పేరును వదిలించుకోవాలని నిశ్చయించుకున్నా. మా పేర్లకన్నా వాళ్ల పేర్లు ఎక్కువ దైవత్వాన్ని కలిగి ఉన్నాయనే భావన ఇందులో యిమిడి ఉంది. ఇది ఓ అహంకార ధోరణి. నా క్రిష్టియన్ పేరును వదిలించుకోవడానికి ఇదొక కారణం.

అలా నేను 'జేమ్స్ గూగీ' నుంచి 'గూగీ వా థియాంగో'గా మారిపోయాను.

స్థానిక భాషల గురించి మీరు మీ 'డీకాలనైజింగ్ మైండ్' పుస్తకంలో చాలా రాశారు. ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో దీనిని మీరెలా చూస్తారు? ఇంగ్లిష్‌ను ఇప్పటికీ మీరు సామ్రాజ్యవాద భాషగానే పరిగణిస్తారా?

వలసకాలంలో ఇంగ్లిష్ భాష సామ్రాజ్యవాద శక్తికి ప్రతీకగా ఉంది. ప్రపంచంలో సామ్రాజ్యవాద శక్తికి ప్రతీకగానే ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక భాషగా ఇంగ్లిష్‌తో మనకు ఇబ్బందేమీ లేదు.

అయితే ఇంగ్లిష్ అనేది తెలుగుకన్నా గొప్ప భాషేమీ కాదు. తెలుగు అనేది ఎట్లా ఒక భాషనో, ఇంగ్లిష్ కూడా అట్లాగే ఒక భాష. అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ కాదు.

ఇంగ్లిష్, తెలుగు, గికియు లేదా ఫ్రెంచ్ అన్నీ సమానమైన భాషలే.

అయితే ఎవరైనా తమ భాష మరే ఇతర భాషకన్నా గొప్పదని అంటే అది మిగిలిన భాషలను అవమానించడమే.

భాషల మధ్య సంబంధం సమాన హోదాలో ఉండాలే తప్ప ఆధిపత్య ధోరణిలో ఉండగూడదు.

ఇంగ్లిష్‌కు తనదైన భాషా సౌందర్యం ఉంది. తెలుగుకు తనదైన వినూత్న సౌందర్యం ఉంటుంది. హిందీకి తనదైన సౌందర్యం ఉంటుంది. ప్రతి భాష మరో భాషను ప్రభావితం చేస్తుంది.

కానీ భాషలను చిన్నది, పెద్దది అనే ఆధిపత్య ధోరణితో చూసినప్పుడే సమస్య తలెత్తుతుంది.

భాషలన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉండాలి. అయితే అది గుర్రానికీ, రౌతుకు మధ్య సంబంధంలా ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకునే సంబంధంలా ఉండాలి.

తమ భాషలను కాపాడుకునేందుకు సంఘర్షిస్తున్న భారతీయ ఆదివాసీ సమూహాలకు మీరిచ్చే సలహా ఏంటి?

తమ భాషల కోసం పోరాడటం తప్ప ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదు. వాళ్లు తమ భాషలలో రచనలు చేయాలి.

తమ భాషలలోకి అనువాదాలు చేసుకోవాలి. మరోమాటలో చెప్పాలంటే - మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

వనరులు సమీకరించుకోండి. మీ భాషలలో రాయండి. వాటిని అభివృద్ధి చేసుకోండి. అట్లాగే మీ భాషలలోని సాహిత్యాన్ని హిందీలోకీ, ఇంగ్లిష్‌లోకి అనువాదం కూడా చేయండి.

భాషల మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు లేవంటే, ఒక భాష మరొక భాషపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్టే అర్థం.

భారత్‌లోనైనా, ప్రపంచంలో మరెక్కడైనా ప్రతి వ్యక్తికీ, ప్రతి పిల్లవాడికీ తమ భాషపై హక్కు ఉంటుంది. ఇది మౌలికమైన విషయం.

సోషల్ మీడియా విస్తృతమవడం వల్ల ప్రజలకు తమ స్థానిక భాషలలో వ్యక్తీకరణకు అవకాశం దొరికిందంటారా?

అంతగా కానప్పటికీ సోషల్ మీడియా వల్ల కొంత ఉపయోగం ఉంది. ఇంటర్నెట్ వ్యాప్తి మూలంగా ప్రజలకు తమ భాషలలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వీలవుతోంది.

అయితే ప్రతి ఒక్కరికీ తమ మాతృభాషే మౌలిక ఆధారం - లేదా అదే బేస్. బేస్ చాలా ముఖ్యమైంది. అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగించాలన్నా సరే దానికి గట్టి బేస్ ఉండాల్సిందే.

అట్లాగే మనిషి గ్లోబల్‌గా ఎక్కడికి దూసుకు పోవాలనుకున్నా సరే.. మాతృభాష అనే ఆధారం (బేస్) గట్టిగా ఉండాలి.

మీరు ప్రపంచమంతా తిరిగారు కదా. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో స్థానిక భాషలలో వస్తున్న సాహిత్యం ఎలా ఉంది?

నేడు చాలా వరకు గొప్ప సాహిత్యం వస్తుందనే చెప్పాలి. ప్రపంచంలో గతంలో వలసలుగా ఉన్న దేశాలకు చెందిన రచయితలు సృష్టిస్తున్న సాహిత్యమే నేడు అత్యద్భుత సాహిత్యంగా ఉందని నా అభిప్రాయం.

అయితే, దురదృష్టవశాత్తు ఆ సాహిత్యంలో ఎక్కువ భాగం యూరప్‌కు చెందిన ఆధిపత్య భాషలలోనే - అంటే ఫ్రెంచ్, ఇంగ్లిష్, పోర్చ్‌గీస్, స్పానిష్‌లలోనే వస్తోంది.

నిజానికి తెలుగులో లేదా గుజరాతీలో, ఆదివాసీ, దళిత భాషలలో సాహిత్యం పుట్టి ఇంగ్లిష్ సహా మిగతా భాషలలోకి వెళ్లగలిగితే బాగుండేది.

ఇటు నుంచి అటు వెళ్లే క్రమం చాలా ముఖ్యమైంది.

ప్రస్తుత ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పరిస్థితి ఎలా ఉందని మీ అభిప్రాయం?

ఆధిపత్యంలో ఉన్న వర్గాలు ఎప్పుడైనా తాము అణిచివెయ్యాలని చూసే వర్గాల గొంతు నొక్కాలని చూస్తాయనే విషయం చరిత్ర పొడవునా కనిపిస్తుంది.

కాబట్టి అణచివేతకు గురవుతున్న వారు తమ ప్రజాస్వామిక హక్కుల పరిధిని వ్యాప్తి చేసుకోవడం కోసం నిరంతరం పోరాడాల్సిందే. అది వారి బాధ్యత.

ఫొటో సోర్స్, FB/Kranti Tekula

సమకాలీన భారత రచయితలలో మీరెవరిని ఇష్టపడతారు?

నిజానికి తొలి భారతీయ ఇంగ్లిష్ రచయితలు కెన్యాలో మా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు.

1960 దశకం తొలి భాగంలో నైరోబీలో ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్‌ను మార్చడానికి వారు కృషి చేశారు. ఆసియా, కరేబియన్, ఆఫ్రో-అమెరికా రచయితల సాహిత్యాన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదం చేయడానికి వారు కృషి చేశారు.

ఆసియా విభాగపు రచయితల్లో భారతీయ రచయితలు ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారు. వారంతా మాకు అభిమాన పాత్రులే.

ఇంకా సల్మాన్ రష్దీ, సుసీ తారు తదితరులు నాకు మంచి స్నేహితులు. నాకు భారతీయ సాహిత్యంతో మంచి పరిచయమే ఉంది.

మహాభారతం, రామాయణం, వేదాలు వంటి వాటితో కూడా కొంత పరిచయం ఉంది.

రెండేళ్ల క్రితం భారత్‌లో చాలా మంది రచయితలు దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేశారు. దీనిపై మీ అభిప్రాయం?

భారత్ అంటే నా దృష్టిలో భారతీయ ప్రజలే. భారత్‌లోనైనా, కెన్యాలోనైనా, అమెరికాలోనైనా ఎక్కడైనా ప్రజాస్వామిక పరిధిని పెంచుకోవడం కోసమే ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. సహనం పెరగాలి.

జాతి, కులం, రంగు, జెండర్ ఆధారంగా మనుషుల మధ్య విభజన సరైంది కాదు.

పుట్టుక ఆధారంగా మనుషుల పట్ల వివక్షను ఆమోదించలేం.

నేను తరచుగా చెపుతుంటాను - మనుషులు పుట్టడానికి ముందే దేవుడి దగ్గరికి వెళ్లి తమకు ఫలానా ఇంట్లో పుట్టాలని ఉందని దరఖాస్తులైతే ఇవ్వరు కదా.

కాబట్టి మనుషులుగా మనమంతా సమానమే.

ఫొటో క్యాప్షన్,

తన హిందీ అనువాద పుస్తకంతో గూగీ వా థియాంగో - ఎడమ వైపు అనువాదకుడు ఆనంద్ స్వరూప్ వర్మ

మీకు నోబెల్ రావొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈసారి కూడా మీకది దక్కలేదు. దీనిపై మీ కామెంట్?

రచయితగా నేను ఎవరినైనా కలిసినప్పుడు, ఆ వ్యక్తి మీ పుస్తకం నన్ను ప్రభావితం చేసిందని చెప్పినపుడు అది నాకు నోబెల్ దక్కినంత ఆనందం కలిగిస్తుంది.

1996లో సాయిబాబా (ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా - ప్రస్తుతం నాగ్‌పూర్ జైలులో మావోయిస్టు సంబంధిత కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు) నాతో మాట్లాడారు. తాను డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఓ బుక్ షాప్‌కు వెళ్లినపుడు నా పుస్తకం 'డెవిల్ ఆన్ ఎ క్రాస్' కనిపించిందట. అది తన జీవితాన్ని మార్చేసిందని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని నాకు చెప్పారు.

కాబట్టి నా పుస్తకాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయనేదే నాకు ముఖ్యం.

నా 'డీకాలనైజింగ్ మైండ్' పుస్తకం వల్ల ఎవరికైనా తమ భాషలను ఎలా చూడాలి అనే అవగాహన పెరిగిందా అన్నది ముఖ్యం.

ఇదే నాకు ఎక్కువ సంతోషం కలిగిస్తుంది. రచయితకు ఇంతకన్నా ఏం కావాలి? ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద పురస్కారం మరొకటేముంది?

ఫొటో సోర్స్, FB/Kranti Tekula

ఫొటో క్యాప్షన్,

హైదరాబాద్‌లో జరిగిన సభలో సుసీ తారుతో గూగీ

మీకు తెలుగు నేలతో దగ్గరి సంబంధాలున్నాయి కదా. మీ మూడు పుస్తకాలు తెలుగులో వచ్చాయి. మరొకటి ఈ మధ్యే వచ్చింది. కెన్యాలో మౌమౌ ఉద్యమం జరిగినప్పుడే తెలంగాణలో భూమి కోసం రైతుల పోరాటం జరిగింది. వీటిని మీరెలా చూస్తారు?

నాకు తెలంగాణ రైతాంగ ఉద్యమం గురించి చాలా ఏళ్ల తర్వాత తెలిసింది. అవును, మౌమౌ ఉద్యమం కూడా భూమి, స్వేచ్ఛ కోసం జరిగిందే.

తెలుగు ప్రాంతానికి చెందిన సుసీ తారు మహిళలూ, దళితులకూ సంబంధించిన పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మేమిద్దరం కలిసి చదువుకున్నాం.

సుసీ థారు విద్యార్థినిగా ఉన్నప్పుడు నా మొదటి నాటకంలో నల్లజాతి తల్లిగా పాత్ర పోషించారు. ఆ నాటకం పేరు 'బ్లాక్ హామ్లెట్'. ఆమె ద్వారా నాకు దళిత ఉద్యమాల గురించి తెలిసింది. అట్లా నాకు తెలుగు వాళ్లతో సంబంధం ఉంది.

గూగీకి ఇష్టమైన భారతీయ వంటకం?

ఇక్కడి పరాఠాలు నాకిష్టం. భారతదేశమంతటా ఇవి దొరుకుతాయి (నవ్వుతూ).

మీరు ఇటీవల చదివిన పుస్తకం?

ఇండియన్ ఫిలాసఫీ.

(ఫోటోలు/వీడియో: షారిఖ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)