రెడ్‌ వైన్‌తో ‘దంత సమస్యలు దూరం’!!

 • 23 ఫిబ్రవరి 2018
రెడ్‌వైన్, దంతాలు Image copyright iStock

రైడ్ వైన్ వల్ల గుండెకు మేలు చేయటం నుంచి చక్కెర వ్యాధి ముప్పును తగ్గించటం వరకూ పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటివరకూ చెప్తున్నారు.

తాజాగా.. దంత క్షయం, చిగుళ్ల వ్యాధిపై పోరాడేందుకు సాయం చేసే రసాయనాలు కూడా రెడ్ వైన్‌లో ఉన్నాయని గుర్తించారు.

ఈ పానీయంలోని పాలీఫెనాల్స్ అనే మిశ్రమాలు.. నోటిలోని కీడుచేసే బ్యాక్టీరియాను పారదోలేందుకు దోహదపడతాయని పరిశోధకులు గుర్తించారు.

కానీ.. ఈ పరిశోధన ఫలితాలను.. ఎక్కువగా రెడ్ వైన్ తాగటానికి ‘పచ్చ జెండా’ చూపటం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కీడుచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరానికి రక్షణ కల్పించే యాంటీఆక్సిడెంట్లు తరహాలో పాలీఫెనాల్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇంతకుముందలి అధ్యయనాలు సూచించాయి.

Image copyright Getty Images

అయితే.. పాలీఫెనాల్స్ మన పేగులోని ‘మంచి బ్యాక్టీరియా’తో కలిసి పనిచేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించటం కూడా చేయగలవని ఇటీవలి అధ్యయనాలు చెప్తున్నాయి.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు వైన్ పాలీఫెనోల్స్ కూడా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయా అనే అంశంపై దృష్టి సారించారు.

పళ్లకు, చిగుళ్లకు అంటుకుని పళ్ల మీద గార, రంధ్రాలు, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా మీద రెడ్ వైన్‌లోని రెండు పాలీఫెనాల్స్‌ ప్రభావాన్ని.. ద్రాక్ష గింజలు, రెడ్ వైన్ మిశ్రమ పూరకాల ప్రభావాన్ని పోల్చి చూశారు.

కణాలకు బ్యాక్టీరియా అంటుకుపోయే సామర్థ్యాన్ని వైన్ పాలీఫెనాల్స్, మిశ్రమాలు తగ్గించాయని వారు గుర్తించారు.

నోటిలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రేరేపించే ప్రోబయోటిక్‌గా భావించే స్ట్రెప్టోకాకస్ డెంటిసానీతో కలిపి ప్రయోగించినపుడు.. చెడు బ్యాక్టీరియాను నిరోధించటంలో ఈ పాలీఫెనాల్స్ మరింత బాగా పనిచేశాయి.

ఈ పరిశోధన ఫలితాలు.. సరికొత్త దంత చికిత్సలకు దారిచూపగలవని పరిశోధకులు చెప్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బెర్రీల్లో పాలీఫెనాల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి

పాలీఫెనాల్స్ ఎక్కడ లభిస్తాయి?

రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇతర పానీయాలు, ఆహారాల్లో కూడా ఇవి లభ్యమవుతాయి.

పానీయాలు:

 • కాఫీ
 • గ్రీన్ టీ
 • బ్లాక్ టీ
 • సిడార్
 • నారింజ రసం, నిమ్మ రసం

ఆహారాలు:

 • బ్లూబెర్రీ
 • రాస్ప్‌బెర్రీ
 • కివీ
 • నల్ల ద్రాక్ష
 • చెర్రీ
 • బీన్స్

ఆధారం: అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్


ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)