విశాఖలో సముద్రం అలల కింద సిరుల సాగు.. మీరు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యాంశాలు

  • 22 ఫిబ్రవరి 2018
సీవీడ్ సాగు Image copyright iStock

నేలమీద, నీళ్ల పైన పంటలు పండించడం అందరికీ తెలిసిందే. కానీ సముద్రపు అడుగున కూడా పంటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్నాడీ యువకుడు.

డాలర్లు కురిపిస్తున్న సముద్రపు మొక్కల (సీవీడ్స్‌) పెంపకంపై బీబీసీ చానల్‌లో డాక్యుమెంటరీ చూసి స్ఫూర్తి పొందిన డొంకిన సంతోష్‌ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖ తీరంలో ఈ సాగు మొదలుపెట్టాడు.

విశాఖపట్నం నుండి భీమిలికి వెళ్లే దారిలో మంగమూరిపేట తీరంలో సముద్రపు మొక్కల పెంపకాన్ని కొందరు యువకులతో కలిసి ఏడాది క్రితం ప్రారంభించారు.

విశాఖకు చెందిన సంతోష్‌ బీబీఎం చదివారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించి, చివరికి ఈ వినూత్నమైన స్వయం ఉపాధిని ఎంచుకున్నారు. మరో 300 మంది మత్స్యకారులకూ ఉపాధి కల్పిస్తున్నారు.

''ఈ నాచు మొక్కల పెంపకానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఎరువులు, ఆహారం, ఔషధాల తయారీలో వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది’’ అని సంతోష్‌ పేర్కొన్నారు.

‘‘ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌, కాంబోడియా దేశాల్లో అధికంగా ఈ సాగు చేస్తున్నారు. మన దేశంలో కేరళ, గుజరాత్‌, గోవా తీర ప్రాంతాల్లో సీవీడ్‌ ఎక్కువగా పెంచుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాలు సాగుకు అనుకూలం'' అని ఆయన చెప్పారు. సీవీడ్ సాగు వివరాల గురించి ఆయన చెప్పిన విషయాలివీ...

1. విశాఖ తీరాన్ని ఎలా ఎంపిక చేశారు?

జియోలాజికల్‌ సర్వే, హోమోగ్రఫీ సర్వేల నివేదికల ఆధారంగా మంగమూరిపేట తీర ప్రాంతాన్ని సాగుకు ఎంపిక చేశాం. ఎనిమిది నెలల్లో దిగుబడి వస్తుంది. వానా కాలంలో కూడా పెంచుకోవచ్చు కానీ, దానికి అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

2. సాగు విధానం ఎలా ఉంటుంది?

తీరానికి కొంత దూరంలో అలల తాకిడి తక్కువగా ఉన్న అనువైన ప్రాంతంలో సీవీడ్‌ని ప్లాస్టిక్‌ నెట్స్‌లో పెంచుతున్నాం. సముద్రపు అలలపై ఈ మొక్కల ఆనవాళ్లు కనపడేలా జీలుగు బెండ్లు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఉంచి అవి కెరటాలకు కొట్టుకుపోకుండా కింద బరువైన దిమ్మలు పెడుతున్నాం.

3. ఎలాంటి వాతావరణం ఉండాలి? ఎలా పెరుగుతుంది?

ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌ ఉండాలి. తీరంలో అలల తీవ్రత తక్కువగా ఉండాలి. 30 పీపీటీల ఉప్పదనం ఉన్న సముద్రపు నీటిలో మునుగుతూ ఈ మొక్కలు అవసరమైన లవణాలు, ఆహారాన్ని పొంది పెరుగుతాయి. 50 కిలోల విత్తనాలు వేస్తే 240 కిలోల వరకు దిగుబడి వస్తుంది.

4. సీవీడ్‌ దేనికి ఉపయోగిస్తున్నారు?

పంట దిగుబడి అనంతరం సీవీడ్‌ని బైప్రొడక్ట్‌గా తయారు చేస్తున్నాం. పొడిగా తయారు చేస్తే రెండేళ్ల వరకు నిలువ ఉంటుంది. దీనిని చేపలు, రొయ్యలకు ఆహార ఉత్పత్తుల్లో, సబ్బులు, టూత్‌ పేస్టులు, ఐస్‌క్రీమ్‌ల తయారీలో వాడుతున్నారు.

5. ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి?

చేపల వేటకు సముద్రంలోకి పోయి ఆపదల పాలవ్వకుండా మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలనేది మా లక్ష్యం.

400 మంది యువతకు, మహిళలకు ఉపాధి లభిస్తోంది. ప్రస్తుతం 25 టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. పలు సంస్థల నుండి వస్తున్న ఆర్డర్ల ప్రకారం 90 టన్నులు పండించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

తమిళనాడులోని కన్యాకుమారిలో గల తన స్నేహితుడి దగ్గర విత్తనాలు తెచ్చి పండిస్తున్న సంతోష్‌.. మార్కెట్‌లో కిలో సీవీడ్‌కి రూ. 30 నుండి రూ. 45 ధర ఉందని చెప్పారు.

క్యాన్సర్‌ నిరోధక ఔషధాల్లో సీవీడ్‌ ఉపయోగ పడుతుందని ప్రచారంలోకి రావడంతో ఈ సాగుకు ఇపుడు డిమాండ్‌ పెరిగింది.

మొత్తం 973.7 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సీవీడ్‌ సాగుకు అపార అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు