రగ్బీకి ‘సై’ అంటున్న ఘనా బాలికలు

రగ్బీకి ‘సై’ అంటున్న ఘనా బాలికలు

ఘనా దేశంలో ఫుట్ బాల్ కు ఉన్నంత ఆదరణ రగ్బీ ఆటకు లేదు.

కానీ, ఘనా రగ్బీ యూనియన్ ఇప్పుడు అక్కడి పాఠశాలల్లో ఈ క్రీడను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచించింది.

ఈ దేశంలో ప్రస్తుతం రిజిస్టర్ అయిన రగ్బీ క్లబ్బులు 13 దాకా ఉన్నాయి.

2020 నాటికి వేయి మందికి పైగా ఆటగాళ్ళను తయారు చేయాలన్నది లక్ష్యం. ఇప్పుడు ఈ ఆట పట్ల అమ్మాయిలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

పద్నాలుగేళ్ళ యా అడ్జై, గతేడాది నుంచే రగ్బీ ఆడటం ప్రారంభించింది. ఆమె ప్రస్తుతానికి ఏడుగురు ఆటగాళ్ళతో ఆడే షార్ట్-ఫార్మాట్ రగ్బీని వారానికోసారి ఆడుతుంది. ఇందులో కూడా సవాళ్ళకు కొదవేమీ ఉండదు.

ఫొటో క్యాప్షన్,

రగ్బీ అభివృద్ధికి సరిపడా వనరులను సమకూరితే పద్నాలుగేళ్ళ యా అడ్జై వంటి వారు తమ కలలను సాకారం చేసుకోగలరు

‘‘నాకు రగ్బీ అంటే ఇష్టం. ఇది చాలా ఆసక్తికరమైన ఆట. ఈ ఆటను అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనుంది. కానీ, మా అమ్మానాన్నలు నన్ను ఈ ఆట ఆడనివ్వరు. అదే నాకున్న ప్రధాన సమస్య. రగ్బీ ఆడాలంటే, నాలాంటి అమ్మాయిలకు జెర్సీలు, బూట్లు కావాలి. అవి ఉండే రగ్బీ ఇంకా బాగా ఆడవచ్చు’’ అని అడ్జై చెప్పింది.

రిజిస్టర్ అయిన మొత్తం 13 రగ్బీ జట్లలో మహిళల జట్లు నాలుగే ఉన్నాయి. వాళ్ళందరూ జాతీయ రగ్బీ లీగ్‌లో ఆడతారు. పాఠశాలల్లో రగ్బీని ప్రోత్సహించే పని ఇప్పుడు "గెట్ ఇన్‌టు రగ్బీ" అనే కార్యక్రమంలో భాగంగా అమలవుతోంది.

ఫొటో క్యాప్షన్,

‘‘శిక్షణ దుస్తులు, వస్తువులు, పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయడానికి ఆర్థిక సాయం వంటివి చాలా అవసరం’’

ఘనా రగ్బీ యూనియన్‌లో డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన రఫాటూ ఇనూసా, పాఠశాలల్లో ఈ క్రీడను ప్రమోట్ చేస్తున్నారు.

‘‘రాబోయే కొన్నేళ్ళలో ఘానాలో రగ్బీ ప్రధాన క్రీడగా ఎదగాలి. ప్రస్తుతానికి మేం.. మేం పాఠశాలలకు, మార్కెట్లకు, స్థానిక కమ్యూనిటీలకు వెళ్తున్నాం. మార్కెట్ల నుంచి వెళ్తున్నపుడు కొందరు రగ్బీ బంతిని విసురుకున్న సందర్భాలు నాకు తెలుసు. అయితే, ఈ ప్రయత్నంలో మాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. శిక్షణ దుస్తులు, కావాల్సిన వస్తువులు, పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయడానికి ఆర్థిక సాయం వంటివి చాలా అవసరం’’ అని ఆమె చెప్పారు.

ఇక్కడి క్రీడాకారుల వయసు 10 నుంచి 15 ఏళ్ళ వరకూ ఉంటుంది. పిచ్ మంచిగా లేనంత మాత్రాన వీళ్ళ క్రీడా ఆశయాలని దూరం చేయలేదు.

ఘనాలో రగ్బీ అభివృద్ధి కోసం సరిపడా వనరులను సమకూర్చాలి. అప్పుడే పద్నాలుగేళ్ళ యా అడ్జై వంటి వారు తమ కలలను సాకారం చేసుకోగలరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)