రోహింజ్యా సంక్షోభం: రెండు దేశాల మధ్యలో నలిగిపోతున్న మూడు లక్షల మంది పిల్లలు

వీడియో క్యాప్షన్,

వీడియో: సొంత దేశానికే పరాయి వాళ్లయిన పిల్లలు

మియన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ వచ్చిన వేలాది రోహింజ్యాల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

శరణార్థి శిబిరాల్లో వారి సమస్యలు కాస్త తగ్గినట్లు కనిపించినా పిల్లలపై మాత్రం తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఆ చిన్నారుల శరీరాలు, మనసులకు అయినా గాయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

కాక్సస్ బజార్ నుంచి బిబిసి ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అందిస్తోన్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images

ఈ పిల్లలు పాడుతున్నది మియన్మార్ జాతీయ గీతం. కానీ వారున్న ప్రాంతం బంగ్లాదేశ్ కాక్సస్ బజార్ లోని రోహింజ్యా శరణార్థి శిబిరం. క్యాంపుల్లో పిల్లలు చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు.

పిల్లల్ని స్కూలుకు పంపేవిధంగా వారి తల్లిదండ్రులకు ఏదో ఒక ఉపాధి కల్పిస్తున్నారు. సొంత దేశానికే పరాయి వాళ్లయిన ఈ పిల్లల్లో చాలా మంది తమ తల్లిదండ్రులు కళ్ల ముందే హతమవ్వడం చూశారు.

నెలలు గడిచినా ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఆ రోజు కూరగాయలు అమ్మేందుకు మార్కెట్లో కూర్చున్నా. ముసుగులో ఉన్న కొంతమంది వచ్చి వెంటవెంటనే కాల్పులు జరిపారు. నా ఇద్దరు సోదరులు అక్కడే చనిపోవడం చూశాను. అన్ని వైపుల ఆందోళనలు నెలకొన్నాయి. ఇంటికి పారిపోయి కుటుంబాన్ని తీసుకొని సరిహద్దు వైపు పయనమయ్యా. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయమవుతోంది’’ అని ముహ్మద్ నూర్ బీబీసీతో అన్నారు.

గతేడాది ఆగస్టులో మియన్మార్ లో హింస చెలరేగింది. దాంతో దాదాపు ఏడు లక్షల మంది రోహింజ్యాలు ఉన్నపళంగా ఇళ్లు వదిలి బంగ్లాదేశ్ పారిపోయి వచ్చారు.

అంతర్జాతీయ సంస్థల ప్రకారం ఇందులో దాదాపు మూడు లక్షల మంది చిన్నారులున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పిల్లలుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఈ పిల్లలు చాలా ఘోరాలు చూశారు. దాని వల్ల వీరిలో మానసిక ఆందోళన పెరిగింది. కొందరు తల్లిదండ్రులు హతమవ్వడం చూస్తే మరికొంతమంది తూపాకులు పేలడం చూశారు. ఇంకొందరు తమ ఇళ్లు తగలబడటం చూశారు. చాలా మంది పిల్లలు ఆ భయానక ఘటనల ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. వీరికి మానసిక చికిత్స చాలా అవసరం. లేకపోతే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కు గురయ్యే అవకాశం ఉంది’’ అని యు.ఎన్.హెచ్.సి.ఆర్. మనోవైద్యురాలు మహమూద తెలిపారు.

ఆ భయంకర దృశ్యాలను మరిచిపోని చిన్నారులున్నారు. వాళ్ల మనస్సులో అవే ఘటనలు నాటుకుపోయాయి. అమ్మ , నాన్నల హత్య లేదా మనుషుల రూపంలో వచ్చి చేసిన విధ్వంసం వాళ్ల కళ్ల ముందు కదలాడుతోంది.

ఈ లక్షలాది చిన్నారుల్లో వేలాది పిల్లలకు తల్లిదండ్రులు దూరమయ్యారు. గతంలో అయిన గాయాలు వీరి భవిష్యత్తు గురించి ఆలోచించలేకుండా చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)