‘మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’

  • 24 ఫిబ్రవరి 2018
దక్షిణ సూడాన్ Image copyright AFP GETTY

దక్షిణ సూడాన్‌లో మహిళలపై అత్యాచారాలు పెరగడమే కాదు.. ఆ ఘోరాన్ని చూసేలా వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.

దక్షిణ సూడాన్‌లో మహిళలపై వేధింపులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయని, మానభంగాలు, హత్యలకు లెక్కేలేదని యూఎన్ నివేదిక స్పష్టం చేసింది.

ఈ ఘోరాలకు 40 మంది సీనియర్ సైనికాధికారులు కారణమని యూఎన్ మానవ హక్కుల సంఘం పరిశోధకులు చెప్పారు.

వారి పేర్లు మాత్రం నివేదికలో వెల్లడించలేదు. దర్యాప్తు మొదలైన తర్వాత వారి వివరాలు బయటపెట్టే అవకాశం ఉంది.

Image copyright Getty Images

'ప్రాణాలతో ఉండాలంటే కుటుంబ సభ్యులపై అత్యాచారం చేయాలన్నారు'

'కుటుంబ సభ్యులపై అత్యాచారం చేసేలా మాపై ఒత్తిడి తెచ్చేవారు' అని బాధితులు తమతో చెప్పినట్లు యూఎన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

'ప్రాణాలతో ఉండటం కోసం తన 12 ఏళ్ల కుమారుడు సొంత అమ్మమ్మతో శృంగారంలో పాల్గొనాల్సి వచ్చింది' అని ఒక మహిళ చెప్పింది. అలా చేయకపోతే పిల్లాడిని చంపేస్తామని బెదిరించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

అంతేకాదు, తన కళ్ల ముందే భర్తను నపుంసకుడిని చేశారని చెప్పింది.

ఒక పురుషుడిపై సామూహిక అత్యాచారం చేసి, అతను చనిపోయిన తర్వాత పొదల్లో పడేయడం చూశానని మరొక వ్యక్తి చెప్పారు.

పురుషులపై లైంగిక హింస చాలా అధికంగా ఉందని దక్షిణ సూడాన్‌ మానవ హక్కుల కమిషనర్ యాస్మిన్ సూక్ అభిప్రాయపడ్డారు.

2015లో శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. ఇంకా ఇలాంటి అరాచకాలు కొనసాగుతున్నాయని వివరించారు.

పౌరులను హింసించడం, హత్యలు చేయడం, గ్రామాలను ధ్వంసం చేయడం ఇలాంటి నేరాలు దక్షిణ సూడాన్‌లో పెరిగాయని యూఎన్ నివేదిక తెలిపింది.

Image copyright AFP

'ఈ ఆరోపణల్లో నిజమెంతో తేలాల్సి ఉంది'

ఈ ఆరోపణల్లో నిజమెంతో తేల్చాల్సి ఉందని దక్షిణ సూడాన్‌ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇలాంటి నివేదికలు చాలావరకు 'కాపీ పేస్ట్‌'లా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ నివేదికను తాము సీరియస్‌గా తీసుకుంటామని అతెంగ్ వెక్ అతెంగ్ బీబీసీతో చెప్పారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ పూర్తి వివరాలు అందిస్తే.. దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

యుద్ధ నేరాలపై విచారణకు ఆఫ్రికా యూనియన్‌తో కలిసి దక్షిణ సూడాన్ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది.

కానీ ఆ దిశగా దక్షిణ సూడాన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎందుకంటే దక్షిణ సూడాన్ సైనిక అధికారులే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నారని బీబీసీ ప్రతినిధి విల్స్ రోస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ఈ కథనం గురించి మరింత సమాచారం