అమెరికా ఉద్యోగాలు: హెచ్-1బీ కొత్త మార్పులు ఏంటి? వాటితో లాభనష్టాలేంటి?

అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం

ఫొటో సోర్స్, Facebook/USCIS

హెచ్-1బీ వీసాల జారీ మరింత కఠినంగా మారుతోంది.

హెచ్-1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కొన్ని మార్పులు చేసింది. మార్పులు కొన్నే అయినా, 80% మంది భారతీయులపై దీని ప్రభావం ఉండబోతోందని కొందరి అభిప్రాయం.

ఈ కొత్త మార్పులు ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చాయి.

ప్రతి సంవత్సరం దాదాపు 85వేల మందికి మాత్రమే హెచ్-1బీ వీసా వస్తుంది. వీరిని స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు.

సంవత్సరానికి 85 వేల హెచ్-1బీ వీసాల్లో 20వేల వీసాలు అమెరికాలో మాస్టర్స్ చేసిన విద్యార్థులకు కేటాయిస్తారు. వీటికి వారు మాత్రమే అర్హులు. తక్కిన 65వేల వీసాల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఆ కంపెనీలు చెల్లించే వేతనం థర్డ్ పార్టీ ద్వారానే అందుతుంది. ఈ క్రమంలో.. కంపెనీలు చెల్లించే వేతనంలో కొంత థర్డ్ పార్టీ జేబుల్లోకి వెళుతోంది.

వీసా దరఖాస్తుదారులు

ఫొటో సోర్స్, FAcebook/USCIS

ఏమిటా మార్పులు?

ఉద్యోగులు మోసపోతున్నారన్న కారణాలను చూపి, ఆ వేతనం పూర్తి వివరాలను కూడా అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది.

సదరు కంపెనీతో ఉద్యోగి కాంట్రాక్ట్ వివరాలు, ఉగ్యోగి అర్హత, పని విధానాలు, వేతనం, పనిగంటలు.. లాంటి వివరాలను కంపెనీ పత్రాలతో చూపాలి.

ఈ వివరాలను అందించడానికి కంపెనీలు ఇష్టపడవు. కాబట్టి, ఉద్యోగాలను అమెరికన్లతోటే భర్తీ చేసుకునే అవకాశముంది. దీంతో ఇతర దేశాల వ్యక్తులకు ఉద్యోగాలు తగ్గిపోతాయి.

ఇందుకు చాలా డాక్యుమెంటేషన్ అవసరమవుతుంది. అన్ని వివరాలను పూసగుచ్చినట్టు అందించాలి, ఏమాత్రం అలసత్వం, పొరపాటు దొర్లినా వీసాను తిరస్కరించవచ్చు.

పైగా, ఈ వివరాలను ధ‌ృవీకరించుకునేందుకు అధికారులు ఆయా కంపెనీలకు వచ్చి ప్రత్యక్షంగా పరిశీలనలు చేస్తారు. ఆ ప్రభావం సిబ్బంది, వారి పనితీరుపై పడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.

గతంలో హెచ్-1బీ వీసా పరిమితి మూడేళ్లు ఉండేది. ఉద్యోగ కాలం ముగిశాక మళ్లీ ఇంకొక ఉద్యోగం వెతుక్కోవడానికి 60రోజుల వ్యవధి ఉండేది.

కానీ ప్రస్తుత మార్పులో.. పని పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోవాలి. మరో ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం లేదు.

వీసాలో ఇచ్చిన సమాచారం మేరకు.. ఉద్యోగ కాల పరిమితి పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోవాల్సిందే.

వినోద్ కుమార్

ఫొటో సోర్స్, VINOD KUMAR REDDY

‘‘అమెరికా వదిలి ఆస్ట్రేలియాకు వెళతాను’’

అమెరికా యూనివర్సిటీలో మాస్టర్స్ చదివి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వినోద్ కుమార్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది. వినోద్ వర్జీనియాలో నివసిస్తున్నారు.

ప్రస్తుతం హెచ్-1బీ వీసాలో చేసిన మార్పుల ప్రభావం భారతీయులపై తీవ్రంగా ఉండబోతోందని వినోద్ అన్నారు. ఇది పూర్తిగా 'బై అమెరికన్, హైర్ అమెరికన్' ఫలితమేనని వినోద్ అభిప్రాయపడుతున్నారు.

''ఇది పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన య్ అమెరికన్, హైర్ అమెరికన్'' నినాదం ప్రభావమే! నా మాస్టర్స్ పూర్తయ్యింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. హెచ్-1బీ వీసాలో వచ్చిన మార్పులతో చాలా నిరుత్సాహపడ్డాను.

హెచ్-1బీలో మార్పులతో ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఇక్కడ నా గడువు ముగిశాక నేను ఆస్ట్రేలియా వెళదామనుకుంటున్నా.

అక్కడ పర్మనెంట్ రెసిడెంట్(పి.ఆర్.) సులభంగానే వస్తోంది. ఆస్ట్రేలియాలో ఐటీ రంగ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇతర రంగాల్లో ఉద్యోగాలకు కొదవ లేదు.

అయినా ఫర్వాలేదు.. పి.ఆర్.వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. చాలా మంది ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు.''

అమెరికా వీసా

ఫొటో సోర్స్, iStock

అమెరికా ఏమంటోంది?

కాగా, హెచ్-1బీ విధానాల్లో చేసిన మార్పులు ఉద్యోగులు-యాజమాన్యాల సంబంధాలను చట్టబద్ధం చేస్తాయని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది.

ఒక ఉద్యోగి.. తన మాతృసంస్థలో కాకుండా థర్డ్ పార్టీ.. అంటే మాతృసంస్థ తరపున వేరే సంస్థలో పనిచేస్తున్నప్పుడు - ఉద్యోగికీ, యాజమాన్యానికీ మధ్య ఈ చట్టబద్ధత ఉండాలని, దానికోసమే ఈ నిబంధనల మార్పు అని వెల్లడించింది.

ట్రంప్ ఆదేశాలకు, య్ అమెరికన్, హైర్ అమెరికన్ నినాదానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు, ఇవి అమెరికాలోని కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే తీసుకున్నట్లు వివరించింది.

దేశ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం కార్మికులకు తగినన్ని రక్షణలు కల్పించకుండా తప్పించుకునేవారితో అమెరికా కార్మికులకే కాకుండా.. విదేశీ కార్మికులకు కూడా నష్టమేనని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)