చైనా: జిన్‌పింగ్‌ పాలనకు ‘పదేళ్ల పరిమితి’ రద్దు ప్రతిపాదన

  • 26 ఫిబ్రవరి 2018
షి జిన్‌పింగ్ Image copyright Getty Images

చైనా అధ్యక్ష పదవిలో ఎవరైనా వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఉండేందుకు అర్హులని చెప్పే రాజ్యాంగ నిబంధనను తొలగించాలని అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదించింది.

ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నికయ్యే దేశాధ్యక్షుడు వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఆ పదవి చేపట్టగలరన్నది ప్రస్తుత నిబంధన. దీనిప్రకారం.. ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్ 2023లో పదవి నుంచి దిగిపోవాల్సి ఉంది.

ఈ రెండు పర్యాయాల పరిమితి నిబంధనను రద్దు చేయాలన్న తాజా ప్రతిపాదన అమలైతే జిన్‌పింగ్ 2023 తర్వాత కూడా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది.

నిజానికి 2023 తర్వాత కూడా తను అధ్యక్షుడిగా కొనసాగాలని జిన్‌పింగ్ భావిస్తున్నట్లు కొంత కాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది.

Image copyright Getty Images

మావో జెడాంగ్ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ గత ఏడాది జరిగిన పార్టీ శిఖరాగ్ర సదస్సు (కాంగ్రెస్)లో తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారు.

ఆ సదస్సు సందర్భంగా జిన్‌పింగ్ సిద్ధాంతాలను కూడా పార్టీ రాజ్యాంగంలో పొందుపరచారు. సంప్రదాయం ప్రకారం ఆయన వారసుడిని కాంగ్రెస్‌లో ప్రకటించాల్సి ఉండగా.. అటువంటి పరిణామమేదీ జరగలేదు.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరి కుమారుడైన షి జిన్‌పింగ్ 1953లో జన్మించారు. 1974లో పార్టీలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2013లో దేశాధ్యక్షుడయ్యారు.

ఆయన అధ్యక్షుడిగా ఉండగా చైనాలో ఆర్థిక సంస్కరణలు వేగవంతమయ్యాయి. అవినీతి వ్యతిరేక చర్యలు ముమ్మరమయ్యాయి. జాతీయవాదం పునరుద్ధరణ పుంజుకోవటంతో పాటు.. మానవ హక్కుల ఉల్లంఘనలూ ఉధృతమయ్యాయి.

Image copyright Getty Images

రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదన ప్రకటనను చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా ఆదివారం ప్రకటించింది.

‘‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు.. వరుసగా రెండు పర్యాయాలకు మించి ఆ పదవులు నిర్వహించరాదన్న అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతిపాదించింది’’ అని ఆ సంస్థ పేర్కొంది.

అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ.. జాగ్రత్తగా సమయం చూసి ఈ ప్రతిపాదనను ప్రకటించినట్లు కనిపిస్తోంది. చైనా నూతన సంవత్సరాది సెలవులకు ఇళ్లకు వెళ్లిన కోట్లాది మంది ప్రజలు సోమవారం తిరిగి విధుల్లోకి వెళ్లనున్నారు.

అలాగే వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో చైనా కేంద్ర బిందువుగా నిలిచింది. దక్షిణ కొరియా ఈ క్రీడలను 2022 బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనాకు అప్పగించనుంది. మరోవైపు.. కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలోని ఉన్నతస్థాయి అధికారులు కూడా సోమవారం బీజింగ్‌లో సమావేశమవుతున్నారు.

Image copyright Getty Images

కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదన అమలు కావాలంటే చైనా పార్లమెంటు ‘జాతీయ ప్రజా కాంగ్రెస్’ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటు మార్చి 5వ తేదీ నుంచి సమావేశమవతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం కేవలం లాంఛనప్రాయమేనని అత్యధికులు భావిస్తున్నారు.

ప్రస్తుత విధానం ప్రకారం జిన్‌పింగ్ 2023 లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సి ఉంది.

మావో శకంలోను, ఆయన మరణానంతరం తలెత్తిన గందరగోళం పునరావృతం కాకుండా నిరోధించటం కోసం.. అధ్యక్ష పదవిలో ఎవరైనా గరిష్టంగా 10 సంవత్సరాలు మాత్రమే కొనసాగేలా పరిమితి ఉండాలని నాటి నాయకుడు డెంగ్ జియావోపింగ్ 1990ల్లో ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు.

జిన్‌పింగ్‌కు ముందు ఇద్దరు అధ్యక్షులు ఈ విధానాన్ని పాటించారు. కానీ జిన్‌పింగ్ 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనవైన నిబంధనలు రూపొందించటంలో చురుకుగా కదులుతున్నారు.

Image copyright Getty Images

ఆయన ఎంత కాలం పదవిలో కొనసాగుతారన్నదానిపై స్పష్టత లేదు. అయితే.. ఈ ప్రతిపాదన అర్థం ‘‘చైనా అధ్యక్షుడు జీవితాంతం పదవిలో కొనసాగుతారని కాదు’’ అని చైనా ప్రభుత్వం నిర్వహించే ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక సంపాదకీయం వ్యాఖ్యానించింది.

ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనదని, ఎందుకంటే 2020 నుంచి 2035 వరకూ చైనాకు ‘‘సుస్థిరమైన, బలమైన, నిరంతర నాయకత్వం’’ అవసరమని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల్లో ఒకరైన సు వేని ఉటంకిస్తూ పేర్కొంది.

కానీ.. జిన్‌పింగ్ అధికారాలపైన కూడా పరిమితులను తొలగించే అవకాశం ఉండటం కొందరు పరిశీలకులకు ఆందోళన కలిగిస్తోంది. ’’ఆయన శాశ్వత చక్రవర్తిగా మారతారని నేననుకుంటున్నా’’ అని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌లో పాలిటిక్స్ ప్రొఫెసర్ విల్లీ లామ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో పేర్కొన్నారు.


Image copyright Getty Images

‘పాపా షి’ పట్టు బిగిస్తున్నారు

సిలియా హాటన్, బీబీసీ వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ ఎడిటర్

ఈ ప్రకటన చాలా మంది ఊహించిందే.

చైనాలో జనజీవితాన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీ శాసిస్తోంది. ఇప్పుడు.. తనను అధికారంలోకి తీసుకువచ్చిన పార్టీని మించి జిన్‌పింగ్ తన పట్టు పెంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హోర్డింగ్‌ల మీద ఆయన ఫొటో అతికించి కనిపిస్తోంది. జిన్‌పింగ్ నిక్‌నేమ్ ‘పాపా షి’ అధికారిక పాటల్లోనూ వినిపిస్తోంది.

గతంలో కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణ బలంగా ఉంటే.. ఉన్నత స్థాయి పదవిలోని వ్యక్తులు పరిమిత కాలం వరకే సారథిగా ఉండేవారు. ఒక నాయకుడు ఒక దశాబ్దకాలం ఆ పదవిలో ఉన్న తర్వాత అధికారాన్ని విధిగా వేరొకరికి అప్పగించేవారు.

షి జిన్‌పింగ్ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి రోజుల నుంచే ఈ వ్యవస్థను మార్చేశారు. అవినీతి వ్యతిరేక కార్యక్రమాన్ని ఆయనే ప్రారంభించారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులను ఆ వ్యవస్థే నిర్మూలించింది.

జిన్‌పింగ్ స్పష్టమైన రాజకీయ దూరదృష్టిని కూడా ప్రదర్శించారు. సరికొత్త అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను నిర్మించే ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ వంటి భారీ జాతీయ ప్రాజెక్టులను అమలు చేయటం నుంచి 2020 నాటికి చైనాలో పేదరికాన్ని తుడిచిపెట్టే భారీ ప్రణాళికల వరకూ అందులో ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)