కరెంట్‌ లేనప్పుడు సెల్‌ఫోన్‌ చార్జ్ చేయడమెలా?

  • 27 ఫిబ్రవరి 2018
కొవ్వొత్తుల వెలుగులో ఫోన్ వీక్షిస్తున్న చిన్నారులు Image copyright Getty Images

తుపానులు, వరదలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినపుడు కరెంట్ సరఫరా నిలిచిపోవటంతో చాలా సమస్యలు ఎదురవుతుంటాయి. భారత్ వంటి దేశాల్లో కరెంటు కోతలు కూడా సర్వసాధారణమే.

ఇలాంటి సందర్భాల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ లేకపోతే ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టే అవుతుంది.

ఇక కరెంటు సరఫరా అందుబాటులో లేని పర్వత, మారుమూల ప్రాంతాలకు వెళ్లినపుడు కూడా సెల్‌ఫోన్ చార్జింగ్ సమస్య తరచుగా ఎదుర్కొంటుంటాం.

అయితే ఎక్కడున్నా ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మీ సెల్‌ఫోన్‌ను మూడు అంచెల్లో సులభంగా చార్జ్ చేసుకోవచ్చు.

ఏమేం కావాలి?

కరెంటు లేనపుడు సెల్‌ఫోన్‌ను చార్జి చేయటానికి కొన్ని ప్రాధమిక వస్తువులు అవసరం

  • కార్ సిగరెట్ లైటర్‌తో ఉండే యూఎస్‌బీ అడాప్టర్
  • ఫోన్‌ చార్జ్ చేయటానికి ఉపయోగించే కేబుల్
  • 9 ఓల్టుల బ్యాటరీ, ఏదైనా లోహపు క్లిప్
  • ఒక బాల్-పాయింట్ పెన్ లేదా తాళం చెవి.
Image copyright YouTube/Mundo Top

మనం చేయాల్సింది.. బ్యాటరీలోని కరెంట్‌ను మొబైల్ ఫోన్‌కు పంపించటం.

విద్యుదావేశ అణువులను ఒక ప్రసార మాధ్యమాన్ని.. అంటే ఒక విద్యుత్ వాహకాన్ని (ఎలక్ట్రికల్ కండక్టర్‌ను) ఉపయోగించి బ్యాటరీ నుంచి సెల్‌ఫోన్‌కి పంపిస్తామన్నమాట.

ఇక్కడ లోహపు క్లిప్ ఈ ఎలక్ట్రికల్ కండక్టర్‌గా పనిచేస్తుంది.

ఇలా పంపించే విద్యుత్ ద్వారా కనీసం అత్యవసర ఫోన్‌కాల్స్ చేయటానికి, సందేశాలు పంపించటానికి సరిపోయేంత విద్యుత్ లభిస్తుంది.

అయితే, ఇది ఎలా చేయాలో మూడు స్టెప్పుల్లో తెలుసుకుందాం.

1: లోహపు క్లిప్‌ను తెరిచి దానిని బ్యాటరీ ధృవాల్లో ఒకదానికి చుట్టాలి

బ్యాటరీలకు రెండు టెర్మినళ్లు ఉంటాయి. ఒకదానిమీద + (పాజిటివ్) గుర్తు, మరొకదానిమీద - (నెగెటివ్) గుర్తు ఉంటాయి.

ఈ రెండు ధృవాలను వైరుతో కలిపితే ఎలక్ట్రాన్లు నెగెటివ్ ధృవం నుంచి పాజిటివ్ ధృవానికి సాధ్యమైనంత వేగంగా ప్రయాణిస్తాయి.

ఈ విద్యుత్ మండలాన్ని పుట్టించటానికి మనం ఒక లోహపు వస్తువును ఉపయోగిస్తాం.

ఎందుకంటే లోహాలు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. ఎలక్ట్రాన్లు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రవహించటానికి ఇవి తోడ్పడతాయి.

ఈ ప్రయోగంలో మనం మొదట లోహపు క్లిప్‌ను తెరిచి బ్యాటరీ నెగటివ్ ధృవానికి చుట్టాలి.

ఈ ఫొటోలో చూపినట్లు లోహపు క్లిప్ ఒక భాగం పైకి, మరొక భాగం వెలుపలికి తెరచి ఉంటుంది.

Image copyright YouTube/Mundo Top

2: కార్ అడాప్టర్‌ను బ్యాటరీ పాజిటివ్ ధృవం మీద ఉంచాలి

ఆ తర్వాత బ్యాటరీ మరో ధృవం మీద కార్ అడాప్టర్‌ను ఉంచాలి.

ఇప్పుడు విద్యుత్ మండలాన్ని పుట్టించటానికి ఇది సిద్ధమైంది.

Image copyright YouTube/Mundo Top

3: బ్యాటరీ మీద క్లిప్‌ను అడాప్టర్‌ మీద ఒకవైపు ఉన్న లోహపు భాగానికి తాకించాలి

ఇక మిగిలింది ఈ రెండు లోహాలు కలవటం.

అంటే లోహపు క్లిప్ - అడాప్టర్ మీద లోహ భాగాన్ని తాకటం.

ఇవి రెండూ కలిస్తే ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. విద్యుత్ పుడుతుంది.

Image copyright YouTube/Mundo Top

చివరిగా.. సెల్‌ఫోన్‌ను యూఎస్‌బీ సాకెట్‌లో ప్లగ్ చేయాలి. కంప్యూటర్‌లో యూఎస్‌బీ సాకెట్‌కు ప్లగ్ చేసినట్లుగానే ఇక్కడ కూడా చేయాలి.

అన్ని బ్యాటరీల్లోనూ ఎలక్ట్రోలైట్లు, ఇతర రసాయనాలు ఉంటాయి. అవి ఒకదానికొకటి ప్రతిస్పందిస్తూ ఎలక్ట్రాన్లు వేగంగా కదిలి విద్యుత్‌ను పుట్టించేలా చేస్తుంటాయి.

అలా.. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.

ఈ ఎలక్ట్రాన్లు లేకుండా ఇంధన శక్తిని మనం చిన్న పరికరాల్లో దాచలేం.

బ్యాటరీ వంటి ఈ పరికరాలు అత్యవసర పరిస్థితుల్లో మనకు విద్యుత్‌ను అందిస్తుంటాయి.

Image copyright YouTube/Mundo Top

విద్యుత్ అందుబాటులో లేనపుడు ఇంట్లోని వస్తువులతో మొబైల్ ఫోన్‌ను చార్జ్ చేయటానికి గల మార్గాల్లో ఇదొకటి మాత్రమే.

ఇంటర్నెట్‌లో ఒకసారి పరికించి చూస్తే.. ఇలాంటి ఐడియాలు చాలా కనిపిస్తాయి.

అయితే అవన్నీ ఇదే సూత్రం మీద ఆధారపడి పనిచేయవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం