సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’

సిరియాలో ఓ నిర్వాసిత మహిళ

ఫొటో సోర్స్, Getty Images

సిరియాలో ప్రజలకు మానవతా సాయం చేస్తామంటూ మందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు చెందిన మగాళ్లు.. సిరియా మహిళలపై లైంగిక దోపిడీకి, అత్యాచారాలకు పాల్పడ్డారని బీబీసీకి తెలిసింది.

ఆహార పదార్థాలు అందించినందుకు, మరొక ప్రాంతానికి ప్రయాణించటానికి సాయం చేసినందుకు ‘ప్రతిఫలంగా’ తమ లైంగిక వాంఛలు తీర్చాల్సిందిగా మహిళలను వేధించినట్లు అక్కడి సహాయ కార్యకర్తలు వెల్లడించారు.

కొందరు మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడ్డారని తెలిపారు.

ఇలాంటి లైంగిక దోపిడీ జరుగుతోందని మూడేళ్ల కిందటే హెచ్చరికలు వచ్చినా కూడా.. ఈ దారుణం ఇంకా కొనసాగుతోందని తాజా నివేదిక నిర్ధరిస్తోంది.

అయితే.. ఇటువంటి లైంగిక దోపిడీలను తాము ఏమాత్రం సహించబోమని ఐక్యరాజ్యసమితి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్నాయి.

కానీ తమ భాగస్వామ్య సంస్థలు ఇలాంటి లైంగిక దోపిడీలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయేమో తమకు తెలియదని అంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

సహాయ కేంద్రాలకు వెళ్లాలన్నా భయమే

ఈ లైంగిక దోపిడి ఎంత తీవ్రంగా ఉందో అక్కడి కార్యకర్తల మాటలను బట్టి తెలుసుకోవచ్చు.

'ఈ సహాయ పంపిణీ కేంద్రాలకు వెళ్లడానికి కొందరు సిరియా మహిళలు నిరాకరిస్తున్నారని, తాము ఆ సహాయ వస్తువులను ఇంటికి తీసుకెళితే, తమ శరీరాలను అర్పించి వాటిని తీసుకొచ్చామని జనం భావిస్తారన్న భయమే అందుకు కారణం' అని కార్యకర్తలు వివరించారు.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ లైంగిక దోపిడి గురించి తెలిసినా పట్టించుకోవటం లేదని, దీనికి కారణం అంతర్జాతీయ సిబ్బంది వెళ్లలేని సిరియాలోని ప్రమాదకర ప్రాంతాలకు సహాయాన్ని చేరవేయడానికి మూడో పక్షం వారిని, స్థానిక అధికారులను ఉపయోగించుకోవటం ఒక్కటే మార్గమని ఒక కార్యకర్త పేర్కొన్నారు.

యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) ఈ ప్రాంతంలో లింగ ఆధారిత హింస మీద గతేడాది ఒక అధ్యయనం నిర్వహించింది.

సిరియాలోని వివిధ ప్రాంతాలలో ‘సెక్స్’కు ప్రతిఫలంగా మానవతా సాయం అందిస్తున్నట్లు నిర్ధరించింది.

‘వాయిసెస్ ఫ్రమ్ సిరియా 2018’ శీర్షికతో ప్రచురించిన ఈ నివేదికలో కీలక అంశాలు ఉన్నాయి.

‘‘ఆహారం పొందటం కోసం మహిళలు లేదా బాలికలను అధికారులకు ‘లైంగిక సేవలు’ అందించటానికి కొంత కాలం పాటు పెళ్లిచేయటం,

మహిళలు, బాలికల టెలిఫోన్ నంబర్లు కావాలని పంపిణీదారులు అడగటం,

ఏదైనా ప్రతిఫలంగా పొందటం కోసం మహిళలు, బాలికలను వారి ఇళ్ల వద్ద తమ వాహనాల్లో దింపటం,

లేదా ఆహార పంపిణీకి ప్రతిఫలంగా ‘ఆమె ఇంటికి రావటం’ లేదంటే ‘ఒక రాత్రి వారితో గడపటం వంటి ఉదాహరణలు ఉన్నాయి’’ అని ఈ నివేదిక వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

‘‘వితంతువులు, భర్త నుంచి విడిపోయిన వారు, ‘‘పురుష సంరక్షకులు లేని’ మహిళలు, బాలికలు అధికంగా ఈ లైంగిక దోపిడీకి గురవుతున్నారు’’ అని కూడా ఆ నివేదిక పేర్కొంది.

ఈ లైంగిక దోపిడీ ఉదంతం మూడేళ్ల కిందటే మొదట వెలుగుచూసింది.

ఒక స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్న డానియెల్ స్పెన్సర్ అనే సలహాదారు.. 2015 మార్చిలో జోర్డాన్‌లోని ఒక శరణార్థి శిబిరంలో సిరియా మహిళల నుంచి ఈ ఆరోపణలను మొదట తెలుసుకున్నారు.

దారా, క్యునీట్రా వంటి ప్రాంతాల్లోని స్థానిక ప్రజాప్రతినిధులు.. సాయం అందించటానికి వారి సెక్స్ కోరికలు తీర్చాలని ఎలా పట్టుపట్టారో ఆ మహిళలు వెల్లడించారు.

‘‘సాయం కోసం పంపించిన సామగ్రిని వారు పంపిణీ చేయకుండా తమవద్దే అట్టిపెట్టుకుని.. ఈ మహిళలను సెక్స్ కోసం వాడుకుంటున్నారు. వీరిలో కొందరు ఈ దోపిడీకి గురయ్యారు. ఇంకొందరు తప్పుకున్నారు’’ అని డానియెల్ చెప్పారు.

వీడియో క్యాప్షన్,

'సహాయ సామగ్రిని తమ వద్దే పెట్టుకుని, మహిళలను సెక్స్ కోసం వాడుకునే వారు'- డానియెల్ స్పెన్సర్

‘‘ఒక మహిళ గదిలో ఏడుస్తుండటం నాకు ఇంకా గుర్తుంది. తనకు ఎదురైన చేదు అనుభవం ఆమెను కుంగదీసింది. బతకటానికి అవసరమైన ఆహారం, సోప్ వంటి కనీస అవసరాలను అందించేటపుడు మహిళలు, బాలికలకు భద్రత కల్పించాల్సిన అవసరముంది. ఏ మగాడిని నమ్ముతామో, ఏ మగాడు సాయం చేస్తాడని ఆశిస్తామో.. అతడు ఆ సాయం అందించకుండా తనతో ‘సెక్స్’ చేయాలని డిమాండ్ చేయటం చాలా దారుణం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘ఇది ఎంత ప్రబలంగా విస్తరించిందంటే.. ఈ సహాయ పంపిణీ కేంద్రాలకు వెళ్లివస్తే.. ఆ సాయం కోసం ఏదో లైంగిక కార్యకలాపానికి పాల్పడి ఉంటారని అనుకోవటం మామూలుగా మారిపోయింది’’ అని ఆమె వివరించారు.

కొన్ని నెలల తర్వాత 2015 జూన్‌లో ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (ఐఆర్‌సీ) దారా, క్యూనీట్రాలలో 190 మంది మహిళలు, బాలికలను సర్వే చేసింది.

మానవతా సాయం సహా సహాయ సేవలు పొందే క్రమంలో లైంగిక హింస జరిగిందని 40శాతం మంది చెప్పినట్లు ఆ సంస్థ నివేదిక పేర్కొంది.

‘‘దక్షిణ సిరియాలో మానవతా సాయంతో పాటు వివిధ రకాల సహాయాలు పొందేటపుడు లైంగిక హింస కొనసాగుతున్నట్లు ఈ పరిశీలన నిర్ధరించింది’’ అని ఐఆర్‌సీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ రెండు నివేదికలను బీబీసీ పరిశీలించింది. ఈ నివేదికలను 2015 జూలై 15న జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఐరాస సంస్థలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలతో యూఎన్‌పీఎఫ్ఏ నిర్వహించిన సమావేశంలో అందించారు.

ఆ సమావేశం ఫలితంగా కొన్ని సహాయ సంస్థలు తమ విధివిధానాలను కఠినం చేశాయి.

దోపిడీపై ఏళ్ల తరబడి విస్మరణ

స్వచ్ఛంద సంస్థ కేర్ సిరియాలో తన పర్యవేక్షణ బృందాన్ని విస్తరించింది. ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటుచేసింది. సహాయాన్ని పంపిణీ చేయటం కోసం స్థానిక మండళ్లకు అందించటం నిలిపివేసింది.

అయితే.. ‘‘లైంగిక దోపిడీని, మహిళలు, బాలికలపై బాలాత్కారాలను విస్మరించారు. ఈ ఉదంతం చాలా కాలంగా తెలుసు. ఏడేళ్లుగా దీని గురించి పట్టించుకోలేదు’’ అని డానియెల్ పేర్కొన్నారు.

‘‘ఐక్యరాజ్యసమితి, ప్రస్తుతమున్న దాని వ్యవస్థ.. మహిళల శరీరాలను బలిచేసేలా ఉన్నాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘మరింత ఎక్కువ మంది ప్రజలకు సాయం అందేలా చేయటం కోసం మహిళల శరీరాలను వాడుకోవటంలో, దోపిడీ చేయటంలో, బలాత్కారం చేయటంలో తప్పులేదని ఎక్కడో ఎవరో నిర్ణయం తీసుకున్నారు’’ అని ఆమె తప్పుపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

‘‘సహాయ పంపిణీ సమయంలో లైంగిక దోపిడీకి సంబంధించి విశ్వసనీయ నివేదికలున్నాయి. దీనిని పరిష్కరించటానికి కానీ, నిరోధించటానికి కానీ ఐక్యరాజ్యసమతి నిబద్ధతతో కూడిన చర్యలేవీ చేపట్టలేదు’’ అని ఒక ఐరాస తరఫున 2015 జూలై సమావేశానికి హాజరైన ఒక ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

యూఎన్‌హెచ్‌సీఆర్ అధికార ప్రతినిధి ఆంద్రెజ్ మహెకిక్ మాట్లాడుతూ.. ‘‘సహాయానికి సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో లైంగిక దోపిడీ, లైంగిక హింస ప్రమాదం ఉంటుందని అర్థం చేసుకోవటం ముఖ్యం. సహాయం అవసరమైన పరిస్థితుల్లో ఉన్న ఎవరినైనా దోపిడీ చేయటం గర్హనీయం’’ అని పేర్కొన్నారు.

అయితే.. 2015 నాటి ఆరోపణలు ‘‘అసంపూర్ణంగా, అసందిగ్ధంగా, నిరాధారంగా’’ ఉన్నప్పటికీ.. ఆ ఆరోపణలు మొదట వెలుగుచూసినపుడే ఐరాస కొన్ని చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు.

ఐరాస శరణార్థి సంస్థకు ఈ లైంగిక దోపిడీ జరిగిందని ఆరోపణలు వచ్చిన దక్షిణ సిరియా ప్రాంతానికి చేరుకునే అవకాశం లేదన్నారు. కానీ స్థానిక భాగస్వాములకు శిక్షణనివ్వటం కోసం జోర్డాన్‌కు పిలిపించాలని కోరినట్లు తెలిపారు.

మీరివి చదివారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)