సిరియా యుద్ధంలో ఎవరు ఎవరి వైపున్నారు? అక్కడ అసలేం జరుగుతోంది?

2014 అక్టోబరులో ఉత్తర సిరియాలోని కొబానే పట్టణంలో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ సేనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఉత్తర సిరియాలోని కొబానే పట్టణంలో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ సేనలు (2014 అక్టోబరు)

సిరియాలో అసలేం జరుగుతోంది? యుద్ధం ఎవరి మధ్య? అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, రష్యా, ఇరాన్, టర్కీ- ఏ దేశం ఎవరి వైపు? సిరియా ప్రజల పరిస్థితి ఏమిటి? ఐక్యరాజ్యసమితి ఏమంటోంది?- ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో!

సిరియా నేలపై నిత్యం నెత్తురు చిందుతూనే ఉంది. పెద్దయెత్తున విధ్వంసం జరుగుతోంది. మధ్య ప్రాచ్యంలోని ఈ దేశంలో యుద్ధం మొదలై, ఈ నెల (మార్చి) ప్రథమార్ధానికి ఏడేళ్లవుతుంది.

2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం క్రమేణా హింసాత్మకంగా, తిరుగుబాటుగా మారింది. అనంతరం అంతర్యుద్ధంగా పరిణమించింది. ఫిబ్రవరి చివరి వరకున్న సమాచారం ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 3.4 లక్షల మందికి పైగా చనిపోయారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అరబ్ దేశాల్లో అప్పటికే జరుగుతున్న ఉద్యమాల ప్రేరణతో సిరియా దక్షిణ ప్రాంతంలోని డెరా నగరంలో 2011 మార్చిలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి.

ఎలా మొదలైంది?

తన తండ్రి హఫీజ్ స్థానంలో 2000వ సంవత్సరంలో బషర్ అల్-అసద్ సిరియా పాలనా పగ్గాలు చేపట్టారు. అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, సిరియాలో నిరుద్యోగం, అవినీతి తీవ్రస్థాయిలో ఉన్నాయని, రాజకీయ స్వేచ్ఛ లేదని, అసద్ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందన్న విమర్శలుండేవి.

అరబ్ దేశాల్లో అప్పటికే జరుగుతున్న ఉద్యమాల (అరబ్ స్ప్రింగ్) ప్రేరణతో సిరియా దక్షిణ ప్రాంతంలోని డెరా నగరంలో 2011 మార్చిలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. వీటిని అణచివేసేందుకు ప్రభుత్వం పెద్దయెత్తున బలప్రయోగానికి దిగింది.

దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ఆందోళనలు పెరిగే కొద్దీ ప్రభుత్వ చర్యలు తీవ్రతరమయ్యాయి.

అసద్ వ్యతిరేక వర్గం (విపక్షం) మద్దతుదారులు సాయుధ సంఘర్షణకు దిగారు. అసద్ వ్యతిరేక తిరుగుబాటుదారుల సంస్థ 'ఫ్రీ సిరియన్ ఆర్మీ'కి అమెరికానే ఆయుధాలు అందించినట్టు ఆరోపణలున్నాయి.

అయితే, విదేశీ మద్దతున్న ఉగ్రవాదాన్ని తుద ముట్టిస్తామని, సిరియా అంతటా ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరిస్తామని అధ్యక్షుడు అసద్ ప్రకటించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన తర్వాత, ప్రభుత్వ బలగాలను ఎదుర్కొనేందుకు తిరుగుబాటుదారులతో అనేక గ్రూపులు ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అలెప్పోలో జరిగిన కాల్పుల్లో తన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో రోదిస్తున్న ఓ తండ్రి (2013 జనవరి)

అగ్నికి ఆజ్యం పోసిన విదేశీ జోక్యం

ప్రారంభంలో అసద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరులా కనిపించిన ఈ యుద్ధం క్రమేణా విస్తృతమైంది. అమెరికా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా సహా పలు ప్రాంతీయ, ప్రపంచ శక్తులు ఇందులో జోక్యం చేసుకోవడం ఇందుకు ఓ ప్రధాన కారణం.

ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాలకు అమెరికా, రష్యా, ఇతర దేశాలు సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అందించడం సమస్యను మరింత జటిలం చేసింది.

ఇది అంతర్యుద్ధ తీవ్రతను పెంచింది. ఇతర దేశాల పరోక్ష యుద్ధానికి సిరియా కేంద్రంగా మారిపోయింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సిరియాలోని హోమ్స్ నగరంలో చోటుచేసుకొన్న విధ్వంసం (2012 నవంబరు)

వర్గాల మధ్య విభజన రేఖలు

సిరియాను చాలా వరకు లౌకిక లక్షణాలున్న దేశంగా పరిగణిస్తారు. సిరియాలోని వివిధ వర్గాల మధ్య ఘర్షణలకు విదేశీ శక్తులు ఊతమిచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి.

సిరియా జనాభాలో సున్నీల ప్రాబల్యం అధికం. అధ్యక్షుడు అసద్ షియా అలావైట్ వర్గానికి చెందినవారు. ఈ వర్గంపై సున్నీలను విదేశీ శక్తులు ఎగదోస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఈ రెండు వర్గాల మధ్య విభజన రావడంతో రెండు పక్షాలూ ఒకదానిపై మరొకటి అకృత్యాలకు, దాడులకు పాల్పడుతున్నాయి.

ఇరు పక్షాల మధ్య ఇక రాజకీయ సయోధ్య సాధ్యం కాదనేంత తీవ్రస్థాయిలో విభజన రేఖలు ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

అలెప్పో రాష్ట్రంలో సిరియా సైన్యంతో పోరాటంలో పాల్గొంటున్న తిరుగుబాటుదారుడు (2012)

సొమ్ము చేసుకొన్న జిహాదీ గ్రూపులు

సిరియాలో వర్గాల మధ్య విభజనను జిహాదీ గ్రూపులు సొమ్ము చేసుకొన్నాయి. ఈ గ్రూపులు బలపడటంతో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.

ఒకప్పుడు అల్‌ఖైదా అనుబంధంగా ఉన్న అల్-నూస్రా ఫ్రంట్, 'హయత్ తాహిర్ అల్-షామ్' అనే కూటమిని ఏర్పాటు చేసింది. వాయువ్య సిరియాలోని చాలా ప్రాంతాలను ఈ కూటమే నియంత్రిస్తుంది.

ఈశాన్య సిరియాలోని అనేక ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) పట్టు సాధించింది. తర్వాత రష్యా మద్దతున్న సిరియా ప్రభుత్వ బలగాలు, టర్కీ మద్దతున్న రెబల్ గ్రూపులు, అమెరికా అండగల కుర్దుల మిలీషియా కూటమి దాడులతో పట్టణ ప్రాంతాల్లో ఐఎస్ ప్రాబల్యాన్ని కోల్పోయింది.

ఇప్పుడు ఇది ఈశాన్య సిరియాలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్, అఫ్గానిస్థాన్‌, యెమెన్‌లకు చెందిన వేల మంది షియా మిలీషియా సభ్యులు సిరియా సైన్యం తరపున పోరాడుతున్నారు. షియా పవిత్ర క్షేత్రాలను పరిరక్షించేందుకే తాము ఈ యుద్ధంలో పాల్గొంటున్నామని వారు చెబుతున్నారు.

సిరియా వ్యవహారాల్లో చాలా దేశాల జోక్యం ఉంది. అమెరికా, రష్యా, టర్కీ, ఇతర దేశాలు తమ తమ కారణాలతో సిరియా యుద్ధంలో భాగస్వాములయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సిరియా, రష్యా అధ్యక్షులు బషర్ అల్-అసద్, వ్లాదిమిర్ పుతిన్

రష్యా ఏం చేస్తోంది?

సిరియాలో తన ప్రయోజనాలను కాపాడుకోవాలంటే రష్యాకు అసద్ ప్రభుత్వ మనుగడ ముఖ్యం. 2015 సెప్టెంబరులో ప్రభుత్వానికి మద్దతుగా రష్యా వైమానిక దాడులను మొదలుపెట్టింది. సిరియా ప్రభుత్వ 'సుస్థిరత' కోసమే తాము ఈ చర్య చేపట్టామని చెప్పింది.

'ఉగ్రవాదులను' మాత్రమే లక్ష్యంగా చేసుకొంటామని రష్యా చెప్పింది. అయితే రష్యా సైన్యం పాశ్చాత్య దేశాల మద్దతున్న తిరుగుబాటు గ్రూపులపై, పౌరుల నివాస ప్రాంతాలపై పదే పదే దాడులు జరుపుతోందని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

రష్యా జోక్యంతో యుద్ధ రంగంలో పరిస్థితులు అసద్ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయాయి.

తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న తూర్పు అలెప్పోను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకొనేందుకు 2016 ద్వితీయార్ధంలో ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో రష్యా కీలక భూమిక పోషించింది. తీవ్రస్థాయి వైమానిక, శతఘ్ని దాడులతో ప్రభుత్వ బలగాలకు గట్టి తోడ్పాటును అందించింది.

తూర్పు సిరియాలోని డీర్ అల్-జౌర్ నగరంపై సుదీర్ఘకాలంగా తనకున్న పట్టును ఐఎస్ 2017 సెప్టెంబరులో కోల్పోయేలా చేయడంలో ప్రభుత్వ దళాలకు రష్యా ప్రత్యేక బలగాలు బాగా సహకరించాయి.

ఆ తర్వాత రెండు నెలలకు సిరియా నుంచి తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఇప్పటికీ సిరియా వ్యాప్తంగా రష్యా వైమానిక దాడులను కొనసాగిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

డమాస్కస్‌లో వైమానిక దాడిలో గాయపడ్డ ఒక బాధితుడికి చికిత్సలో సహాయం అందిస్తున్న వ్యక్తి (2015 ఫిబ్రవరి)

ఇరాన్ ప్రమేయం ఏమిటి?

అరబ్ పాలకుల్లో అసద్ ఇరాన్‌కు బాగా సన్నిహితుడు. ఆయన ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు ఇరాన్ ఏటా వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది.

సిరియా ప్రభుత్వానికి సైనిక సలహాదారులను, రాయితీతో ఆయుధాలను, రుణాన్ని, చమురును అందిస్తోంది. ఇరాన్ వందల మందితో కూడిన పోరాట దళాలను కూడా సిరియాకు తరలించిందనే ఆరోపణలున్నాయి.

లెబనాన్‌లోని షియా ఇస్లామిక్ రాజకీయ, మిలిటరీ సంస్థ 'హిజ్బుల్లా'కు ఇరాన్ నుంచి ఆయుధాలను తరలించాలంటే ప్రధానంగా సిరియా గుండానే తరలించాలి.

'హిజ్బుల్లా' సంస్థ సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వానికి మద్దతుగా వేల మంది ఫైటర్లను యుద్ధ రంగంలోకి దించింది.

ఇజ్రాయెల్ సంగతేంటి?

హిజ్బుల్లా సంస్థ అధునాతన ఆయుధాలను సమీకరించుకోవడంపై ఇజ్రాయెల్‌ ఆందోళన చెందుతోంది. ఇరాన్, హిజ్బుల్లాలను ఎదుర్కొనేందుకు అని చెబుతూ సిరియాలో ఇజ్రాయెల్ పదుల సంఖ్యలో వైమానిక దాడులు నిర్వహించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా ఏంచేస్తోంది?

అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేక పక్షాలకు అమెరికా మద్దతు అందిస్తోంది. సిరియాలో పెద్దయెత్తున జరుగుతున్న అరాచకాలకు అసద్ ప్రభుత్వమే కారణమని అమెరికా ఆరోపిస్తోంది.

గతంలో తిరుగుబాటుదారుల్లో ఒక వర్గానికి యూఎస్ సైనిక సాయం కూడా చేసింది. 2014 సెప్టెంబరు నుంచి సిరియాలో ఐఎస్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడులు చేపడుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అనుకూల బలగాలనూ లక్ష్యంగా చేసుకొంది.

2017 ఏప్రిల్‌లో తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్‌షేఖౌన్ పట్టణంలో అసద్ ప్రభుత్వం రసాయనిక దాడికి పాల్పడిందంటూ, దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైమానిక స్థావరంపై క్షిపణి దాడి జరిపించారు.

ఖాన్‌షేఖౌన్ పట్టణంలో సారిన్ వాయువును ప్రయోగించడంతో 80 మందికి పైగా చనిపోయారు. ఈ రసాయనిక దాడికి సిరియా ప్రభుత్వమే కారణమని ఐక్యరాజ్యసమితి, రసాయన ఆయుధాల నిర్మూలన సంస్థ సంయుక్తంగా జరిపిన విచారణలో వెల్లడైంది.

అమెరికాకు క్షేత్రస్థాయిలో కుర్దు, అరబ్ మిలీషియాల కూటమి - 'సిరియా డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్‌డీఎఫ్)' కీలక భాగస్వామి. 2015 నుంచి ఇప్పటివరకు, ఐఎస్ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో అత్యధిక ప్రాంతాల నుంచి ఐఎస్‌ను ఎస్‌డీఎఫ్ ఫైటర్లు తరిమివేశారు.

ఎస్‌డీఎఫ్ అధీనంలోని భూభాగంలో ఐఎస్‌ను తుద ముట్టించేందుకు, ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అవసరమైనంత స్థాయిలో సిరియాలో సైన్యాన్ని ఉంచుతామని అమెరికా 2018 జనవరిలో ప్రకటించింది.

వీడియో క్యాప్షన్,

టర్కీ సైన్యాలు సిరియాలో ఎందుకు అడుగుపెట్టాయి? (2018 జనవరిలో పబ్లిష్ అయిన వీడియో స్టోరీ)

టర్కీ పాత్ర ఏమిటి?

సిరియాలోని తిరుగుబాటుదారులకు టర్కీ గట్టి మద్దతుదారు. అయితే ఎస్‌డీఎఫ్‌లో అత్యంత బలమైన వైపీజీ మిలీషియాను నియంత్రించేందుకు టర్కీ వీరిని వాడుకొంటోంది. వైపీజీ మూలాలు.. టర్కీలో కుర్దుల ప్రాబల్య ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కోసం మూడు దశాబ్దాల పాటు పోరాడిన 'కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)'లో ఉన్నాయని టర్కీ ఆరోపిస్తోంది.

వాయువ్య సిరియాలోని అఫ్రిన్‌ ప్రాంతం నుంచి వైపీజీని తరిమేసేందుకు జనవరిలో టర్కీ ఆపరేషన్‌ను చేపట్టింది.

సౌదీ సైనిక, ఆర్థిక సహకారం

సిరియా తిరుగుబాటుదారులకు సైనిక, ఆర్థిక సహకారం అందించే ప్రధానమైన దేశం సౌదీ అరేబియా. సిరియాలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలని సున్నీ పాలిత సౌదీ అరేబియా ప్రయత్నిస్తోంది.

యుద్ధం ప్రభావం: లక్షల మంది మృతి

సిరియా అంతర్యుద్ధంలో మొత్తం 3.46 లక్షల మందికి పైగా చనిపోయారని, వీరిలో 1.03 లక్షల మంది సాధారణ పౌరులని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే 'సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్' నిరుడు డిసెంబరులో చెప్పింది. ఆచూకీ తెలియకుండా పోయిన, లేదా చనిపోయారని భావిస్తున్న 56,900 మందిని ఈ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేసింది.

సిరియా సంక్షోభం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 4.7 లక్షల మంది చనిపోయారని 2016లో ఒక మేధో సంస్థ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

అలెప్పోలోని బుస్తన్ అల్-ఖాసర్ ప్రాంతం వీడి వెళ్లిపోతున్న సిరియా పౌరులు (2016 డిసెంబరు)

దేశం వీడిన 56 లక్షల మంది ప్రజలు

సిరియాలో 61 లక్షల మంది అంతర్గతంగా నిర్వాసితులయ్యారు. 56 లక్షల మంది సిరియా విడిచి వెళ్లిపోయారని, వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులేనని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో తెలిపింది. శరణార్థులు పోటెత్తడంతో పొరుగు దేశాలైన లెబనాన్, జోర్డాన్, టర్కీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

శరణార్థుల్లో దాదాపు 10 శాతం మంది ఐరోపా దేశాలను ఆశ్రయం కోరారు. శరణార్థుల భారాన్ని మోసే విషయంలో వివిధ దేశాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇది ఆయా దేశాల్లో రాజకీయపరమైన విభజనకూ కారణమైంది.

సహాయానికి 350 కోట్ల డాలర్లు అవసరమన్న ఐరాస

2018లో సిరియాలో 1.31 కోట్ల మందికి ఏదో రూపంలో సహాయం అందించాల్సి ఉంటుందని, ఇందుకోసం 350 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

దేశ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు కడు పేదరికంలో బతుకుతున్నారు. ఆహార పదార్థాల కొరత, అధిక ధరల కారణంగా 60 లక్షల మందికి ఆహార భద్రత లేదు. కొన్ని ప్రాంతాల్లో తమ ఆదాయంలో 15-20 శాతాన్ని కేవలం తాగునీటి కోసం వెచ్చించాల్సి వస్తోంది.

బాధితులకు సాయం అందించాలన్నా కష్టమే

బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్రా సంస్థలు సాయం అందించడం కూడా కష్టమవుతోంది. సాయుధ బలగాలు చుట్టుముట్టిన ప్రాంతాల్లో లేదా సహాయ సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో సుమారు 29.8 లక్షల మంది ప్రజలు ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఐరాస చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి?

అసద్ ప్రభుత్వంగాని, ప్రభుత్వ వ్యతిరేక పక్షాలుగాని ప్రత్యర్థిని పూర్తిస్థాయిలో దెబ్బతీయలేకపోతున్నందు వల్ల ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని, ఈ సంక్షోభానికి రాజకీయ పరిష్కారమే ముగింపు పలకగలదని అంతర్జాతీయ సమాజం చాలా కాలం కిందటే ఒక అంచనాకు వచ్చింది.

సమస్య పరిష్కారం కోసం 2012 నాటి జెనీవా తీర్మానం అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానించింది. సిరియాలో అన్ని పక్షాల సమ్మతితో పూర్తి అధికారాలతో తాత్కాలిక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ తీర్మానం పేర్కొంటోంది.

ఐరాస మధ్యవర్తిత్వంలో 2014 ప్రథమార్ధంలో శాంతి చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది దఫాలుగా చర్చలు జరిగాయి. జనవరిలో జరిగిన తొమ్మిదో విడత చర్చల్లో- రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం, స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంపై చర్చించాలని సంబంధిత ప్రతినిధి బృందాలను కోరారు. అయితే ఇప్పటివరకు పురోగతి లేదు.

విపక్షంతో చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు అసద్ సుముఖంగా లేరు. యుద్ధరంగంలో ఇటీవలి కాలంలో ఎదురుదెబ్బలు ఎక్కువగానే తగిలినా విపక్షం మాత్రం, అసద్ గద్దె దిగితేనే పరిష్కారం సాధ్యమని స్పష్టం చేస్తోంది.

చర్చలకు రష్యా కూడా మోకాలడ్డుతోందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP

తిరుగుబాటుదారులకు పట్టున్న ప్రాంతాలు ఇవీ

సిరియాలోని అతిపెద్ద నగరాలన్నింటినీ ప్రభుత్వం తన నియంత్రణలోకి తెచ్చుకోగలిగింది. అయితే దేశంలోని చాలా ప్రాంతాలు ఇంకా తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్నాయి. వాయువ్య సిరియాలోని ఇడ్లిబ్ రాష్ట్రం తిరుగుబాటుదారుల కంచుకోట. ఈ రాష్ట్రంలో హయత్ తాహిర్ అల్-షా జిహాదీలు లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఉత్తర సిరియాలో అలెప్పో రాష్ట్రం, మధ్య సిరియాలో హోమ్స్ రాష్ట్రం, దక్షిణ సిరియాలో డెరారా, క్వునీట్రా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులదే పైచేయిగా ఉంది.

తూర్పు ఘూటా: ఆకలి కేకలు.. ఆర్తనాదాలు

సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపాన ఉండే తూర్పు ఘూటా ప్రాంతంలోనూ ప్రభుత్వం పెద్దయెత్తున దాడులు జరుపుతోంది. వైమానిక, భూతల దాడులతో తూర్పు ఘూటా దద్దరిల్లుతోంది.

ఈ ప్రాంతంలో 3.93 లక్షల మంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నారు. తీవ్రమైన ఆహార కొరతతో ఎంతో మంది అలమటిస్తున్నారు. ఔషధాలు, వైద్యసేవలు అందడం లేదు. ఆకలికేకలు, ఆర్తనాదాలు సాధారణమైపోయాయి.

వీడియో క్యాప్షన్,

Who’s fighting whom in Syria? Explained in 90 seconds

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)