బ్రిటన్: యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు ఇవీ...

బ్రిటన్‌లో శాకాహారులుగా మారుతున్న యువత సంఖ్య బాగా పెరిగిపోతోంది. 2016 నాటి ఒక అధ్యయనం ప్రకారం- దశాబ్దం కిందటితో పోలిస్తే శాకాహారుల మొత్తం సంఖ్య 360 శాతానికిపైగా పెరిగింది. శాకాహార ఉద్యమాన్ని 35 ఏళ్లలోపువారు ముందుండి నడిపిస్తున్నారు.
శాకాహారం మాత్రమే తీసుకొనేవారి సంఖ్య పెరగడానికి, జంతువధ-నైతికత మొదలుకొని వ్యక్తిగత స్వేచ్ఛ వరకు అనేక అంశాలు కారణమవుతున్నాయి. శాకాహారం వైపు నడిపిస్తున్న ఏడు ప్రధాన అంశాలు ఇవీ...
జంతువధ-నైతికత
జంతు హింస అనైతికమనే భావనే చాలా మంది శాకాహారం వైపు మళ్లడానికి ప్రధాన కారణమవుతోంది. ప్రతి ప్రాణికీ బతికే హక్కు ఉందని, ఆహారం కోసం జంతువులను చంపడం తప్పని వారు భావిస్తున్నారు.
కొంత మందికేమో జంతువుల పట్ల ప్రేమ, వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకొనేందుకు అడ్డువస్తోంది.
కోళ్లు, ఆవులు, ఇతర జంతువులను మనిషి తన ఆహారం కోసం చంపేయడం అమానవీయమని చాలా మంది శాకాహారులు నమ్ముతున్నారు. జంతుహింసను నివారించాలంటే మాంసాహారానికి, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండటమే మార్గమని వారు భావిస్తున్నారు. శాకాహార ఉద్యమకారులు మాంసం, చేపలు, గుడ్లతోపాటు పాల ఉత్పత్తులు, తేనె లాంటి వాటికీ దూరంగా ఉంటున్నారు.
ఫొటో సోర్స్, iStock
పర్యావరణం
మాంసాహారులను శాకాహారం వైపు నడిపిస్తున్న అంశాల్లో పర్యావరణ స్పృహ ఒకటి.
మాంసం కోసం ఉద్దేశించిన జంతువులకు అవసరమైన ఆహారం కోసం సంబంధిత పంటలను, పశుగ్రాసాన్ని చాలా ఎక్కువ భూభాగంలో సాగు చేయాల్సి ఉంటుంది. అవసరాలకు తగినట్లు సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ పోవాలంటే అడవులను నరికివేయాల్సి వస్తుంది. అటవీ విస్తీర్ణం తగ్గితే పర్యావరణంపై ప్రభావం పడుతుంది.
పాడిపరిశ్రమ, పశువుల పెంపకం కోసం నీటిని పెద్దయెత్తున వాడాల్సి వస్తోంది. ఇందులో ప్రధానంగా వాటి ఆహారానికి అవసరమైన పంటలు, గ్రాసం సాగుకే ఖర్చవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనిషి వాడే నీటిలో సుమారు ఎనిమిది శాతం పశువుల పెంపకానికే ఖర్చవుతున్నట్లు అంచనా.
పశువుల ఆహారానికి ఉద్దేశించిన పంటల సాగులో ఎరువులు, రసాయనాల వినియోగం కూడా అధికం. ఇది వాతావరణ కాలుష్యానికి, నీటి కాలుష్యానికి దారితీస్తోంది.
ఇలాంటి పంటల స్థానంలో మనుషులు నేరుగా ఆహారంగా తీసుకొనే పంటలు పండిస్తే వాతావరణ కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని నివారించవచ్చని, పర్యావరణాన్ని కాపాడవచ్చని శాకాహారులు చెబుతున్నారు.
గ్రీన్హౌస్ వాయువుల విడుదల మరో ముఖ్యమైన అంశం. మనిషి కారణంగా వెలువడే గ్రీన్హౌస్ వాయువుల్లో 14 నుంచి 18 శాతం వరకు పశువుల పెంపకమే కారణమని శాకాహార ఉద్యమకారులు పేర్కొంటున్నారు.
ఇది రవాణా కాలుష్యం కంటే ఎక్కువని వారు చెబుతున్నారు. ఆవులు నిత్యం పెద్దమొత్తంలో మీథేన్ వాయువును విడుదల చేస్తాయని వారు ప్రస్తావిస్తున్నారు.
ఆరోగ్యం
ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శాకాహారాన్ని ఎంచుకొనేవారు పెద్దసంఖ్యలో ఉన్నారు.
పశువుల ద్వారా వచ్చే ఆహారోత్పత్తులను తీసుకోకపోతే అవసరమైన అన్ని పోషకాలూ అందవనేది అపోహ మాత్రమేనని శాకాహార ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లలో కొవ్వు శాతం తక్కువని, పీచుపదార్థం, మెగ్నీషియం, పొటాషియం, ఇతర విటమిన్ల శాతం ఎక్కువని, ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణలో కీలకమని చెబుతున్నారు.
ఇలాంటి ఆహారం తీసుకొనేవారిలో కొవ్వు శాతం తక్కువని, రక్తపోటు అదుపులో ఉంటుందని, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) తక్కువగా ఉంటుందని, హృద్రోగాలు, క్యాన్సర్ వల్ల మరణం సంభవించే ఆస్కారం తక్కువని వారు పేర్కొంటున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
స్వతంత్రత
యువతీయువకులు తాము స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనేందుకు అవకాశమున్న అంశాల్లో- ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది ఒకటని శాకాహార ఉద్యమకారుడు, సంగీత కళాకారుడు జే బ్రేవ్ చెప్పారు. శాకాహారులుగా మారే ఎంతో మంది యువతకు ఇదే నిర్ణయాత్మక అంశంగా నిలుస్తోందన్నారు. కెరీర్ గురించి ఆలోచించడాని కంటే చాలా ముందే వారు ఆహారపు అలవాట్లను స్వతంత్రంగా నిర్ణయించుకొనేందుకు వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా పాత్ర
శాకాహార ఉద్యమానికి సోషల్ మీడియా ఊతమిచ్చిందని రచయిత్రి గ్రేస్ డెంట్ చెప్పారు.
ఇంటర్నెట్ అందుబాటులోకి రాక ముందు మాంసాహారం నుంచి శాకాహారం వైపు మళ్లడం అన్నది పెద్దగా లేదని ఆమె తెలిపారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా పుణ్యామా అని శాకాహార ఉద్యమం బాగా వ్యాప్తి చెందుతోందని, దీనికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఒకే రకమైన ఆహారపు అలవాట్లు ఉన్న వ్యక్తులను కలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోందని చెప్పారు.
బోనీ రెబెకా, ఫ్రీలీ ద బనానా గర్ల్, సీన్ కాలగన్ తదితర శాకాహార ఉద్యమకారులు శాకాహారం, శాకాహార వంటకాల గురించి యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వేదికల్లో అందించే కంటెంట్‌ను లక్షల మంది ఆసక్తిగా చూస్తారని గ్రేస్ డెంట్ ప్రస్తావించారు.
ప్రముఖుల దన్ను
మాంసాహారం, పాల ఉత్పత్తులు తీసుకోకపోయినా కెరీర్లో, జీవితంలో విజయవంతమవ్వొచ్చని, చక్కటి శరీరాకృతితో కనిపించవచ్చని శాకాహార ఉద్యమానికి మద్దతుగా నిలిచే ఎలీ గోల్డింగ్, నటాలీ పోర్ట్మన్, ఎలెన్ డి జెనెరెస్, జొవాక్విన్ ఫీనిక్స్, రసెల్ బ్రాండ్, మిలీ సైరస్ లాంటి ప్రముఖులు యువతకు చాటి చెబుతున్నారు.
పెరుగుతున్న ఆహార కేంద్రాలు
శాకాహార స్టాళ్లు, కేఫ్‌లు, రెస్టారంట్లు బ్రిటన్ వ్యాప్తంగా ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి.
ఫ్యాట్ గే వేగన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హ్యాక్నీ డౌన్స్ వేగన్ మార్కెట్ శాకాహారుల ఆదరణను పెద్దయెత్తున చూరగొంటోంది. అనేక అగ్రశ్రేణి రెస్టారంట్లు శాకాహార వంటకాల సంఖ్యను పెంచుతున్నాయి. ఇంతకుముందెన్నడూ లేనంత విరివిగా, తేలిగ్గా శాకాహారం అందుబాటులోకి వస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)