ఆస్ట్రేలియా: ఖర్బుజా తిని ముగ్గురు మృతి

  • 4 మార్చి 2018
ఖర్బుజా Image copyright Getty Images

లిస్టీరియా అనే బాక్టీరియా సోకిన ఖర్బుజా పండ్లను తినటం వల్ల ఆస్ట్రేలియాలో ముగ్గురు మృతి చెందారు.

న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలో సాగైన ఈ ఖర్బుజా పండ్లను తినటం వల్ల మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు.

మృతుల్లో ఇద్దరు న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొకరు విక్టోరియా రాష్ట్రవాసి.

వృద్ధులు, గర్భిణులు, పసిపిల్లలు కోసి ఉంచిన ఖర్బుజాలను తినొద్దని అధికారులు హెచ్చరించారు.

‘‘లిస్టెరోసిస్ బారినపడే అవకాశం ఉన్న ప్రజలెవరూ మార్చి 1వ తేదీకి ముందు కొన్న ఖర్బుజాలను వినియోగించొద్దు’’ అని న్యూసౌత్‌వేల్స్ ఆరోగ్య సంస్థ అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ వికీ షెపర్డ్ తెలిపారు.

గ్రిఫిత్ అనే పంటపొలంలో పండిన ఖర్బుజాల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తేల్చారు.

జనవరి నెల నుంచే ఖర్బుజాల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ల నుంచి ఖర్బుజాలను తొలగించి, తిప్పి పంపిస్తున్నారు.

Image copyright Getty Images

లిస్టరోసిస్ అంటే ఏంటి?

  • లిస్టీరియా బాక్టీరియా సోకిన ఆహారం ద్వారా.. లేదంటే పశువుల ద్వారా సంక్రమించే అంటువ్యాధి లిస్టరోసిస్.
  • శుద్ధి (పాశ్చరైజ్) చేయని పాలు, డెయిరీ పదార్థాల వల్ల కూడా సంక్రమిస్తుంది.
  • ప్యాక్ చేసిన.. శాండ్‌విచ్‌ల వంటి ఆహార పదార్ధాల్లో కూడా లిస్టీరియా ఉంటుంది.
  • లిస్టరోసిస్ బారిన పడితే.. శరీరం వేడెక్కటం, జ్వరం వచ్చినట్లు అనిపించటం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలుంటాయి.
  • ఒక్కోసారి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ, వృద్ధులు, పిల్లలకు త్వరగా లిస్టరోసిస్ సోకే అవకాశాలున్నాయి.

ఆధారం: ఎన్‌హెచ్‌ఎస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)