హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- ఆండ్రియాస్ ఇల్మెర్
- బీబీసీ ప్రతినిధి, సింగపూర్

ఫొటో సోర్స్, China Science Press
ధ్వని కంటే ఐదు రెట్ల అధిక వేగంతో ప్రయాణించే విమానం తయారు చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు
ప్రస్తుతం విమానంలో బీజింగ్ నుంచి న్యూయార్క్ వెళ్లాలంటే 14 గంటలు పడుతోంది. ఆ సమయాన్ని తగ్గించేందుకు చైనా కసరత్తు చేస్తోంది.
ఇందుకోసం కొత్త హైపర్సోనిక్ విమానాన్ని తయారు చేసే పనిలో చైనా పరిశోధకులు ఉన్నారు.
ఇలాంటి టెక్నాలజీ కొత్తమీ కాదు. కాకపోతే అలాంటి విమానాలను రక్షణ రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఎందుకంటే ప్రయోగాలు చేసేందుకు వారికి ఎక్కువ నిధులు ఉంటాయి.
అంతేకాదు లాభాలు ఆర్జించాల్సిన అవసరం వారికి ఉండదు కాబట్టి.
ధ్వని కంటే ఐదురెట్ల అధిక వేగంతో ప్రయాణించే విమానాలు వాణిజ్యపరంగా విజయవంతం అవుతాయా?
ప్రయాణికుల విమానాలు నిజంగానే రెండు గంటల్లో పసిఫిక్‌ను దాటేస్తాయా?
ఫొటో సోర్స్, Getty Images
సూపర్సోనిక్ కాంకర్డ్ విమానం 2003లో చివరిసారిగా ప్రయాణించింది.. ఆ తర్వాత అది వాణిజ్యపరంగా మళ్లీ గాల్లోకి ఎగరలేదు
వేగం..వేగం..వేగం..!
విమానం ఎంత వేగంతో వెళుతుందో చెప్పడానికి దాని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూస్తారు.
ధ్వని వేగాన్ని ప్రామాణికంగా మాక్‌లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1,235 కిలోమీటర్లు.
ఈ వేగాన్ని మూడు రకాలుగా విభజిస్తారు.
1. సబ్‌సోనిక్: ధ్వని కంటే తక్కువ వేగంతో ప్రయాణించేవి
అంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రయాణికుల విమానాలు.
2. సూపర్ సోనిక్: ధ్వని కంటే ఎక్కువ వేగంతో వెళ్లేవి
మాక్ 1 నుంచి మాక్ 5 వరకు అంటే ధ్వని కంటే ఐదు రెట్లు అధిక వేగంతో ప్రయాణించేవి.
అంటే గంటకు 6,175 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవన్న మాట.
ఉదాహరణకు 1976 నుంచి 2003 వరకు యూరప్ - అమెరికా మధ్య నడిచిన కాంకర్డ్ విమానం.
3. హైపర్ సోనిక్: మాక్ 5 కంటే ఎక్కువ (గంటకు 6,175 కిలోమీటర్ల కంటే అధికం) వేగంతో వెళ్లేవి.
ప్రస్తుతం చిన్న చిన్న వాహనాలను ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
నాసాకు చెందిన మానవ రహిత ఎక్స్-43ఏ హైపర్ సోనిక్ విమానం ఇది. అత్యధిక వేగంతో ప్రయాణించిన రికార్డు దీని పేరు మీదే ఉంది
'వేగాన్ని రెట్టింపు చేస్తే గాలి ప్రతిఘటన నాలుగు రెట్లు పెరుగుతుంది'
చైనా సైన్స్ అకాడమీ సైంటిస్టులు ఈ హైపర్ సోనిక్ విమానాల తయారీపైనే దృష్టి సారించారు. వీరు ప్రధానంగా రెండు సవాళ్లపై పరిశోధన చేస్తున్నారు.
ఒకటి ఏరో డైనమిక్స్, రెండోది ఇంజన్. ఈ సవాళ్లను అధిగమించడం అంత సులువేమీ కాదు. హైపర్ సోనిక్ విమానాల డిజైన్ గాలి ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి.
విమానం ప్రయాణిస్తున్నప్పుడు గాలి దాని వేగాన్ని అడ్డుకుంటుంది. విమానం ముందుకు వెళ్లకుండా గాలి ప్రతిఘటిస్తుంది. విమాన వేగం పెరిగే కొద్దీ గాలి ఒత్తిడి పెరుగుతుంది.
'వేగాన్ని రెట్టింపు చేస్తే గాలి ప్రతిఘటన నాలుగు రెట్లు పెరుగుతుంది' అని మెల్బోర్న్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ నికొలస్ హచ్చిన్స్ చెప్పారు.
ఫొటో సోర్స్, USAF
ఇది మానవ రహిత బోయింగ్ ఎక్స్-51 స్క్రామ్ జెట్ పరిశోధక విమానం.. హైపర్సోనిక్ విమానంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి దీన్ని డిజైన్ చేశారు
గాలిని జయించడానికి నాలుగు రెక్కల విమానం!
అందుకే చైనా పరిశోధకులు విమాన డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. విమానం రెక్కలపైన అదనంగా మరో రెండు రెక్కలు ఏర్పాటు చేసి పరీక్షించారు.
అంటే విమానానికి నాలుగు రెక్కలు ఉంటాయన్న మాట. ఒకరకంగా ఇది డబుల్ డెక్కర్ విమానం లాంటిది. ప్రస్తుతానికి చిన్న పరిమాణంలో ఉన్న విమానాన్ని తయారు చేసి పరీక్షించారు.
ఈ ప్రాజెక్టు టేకాఫ్ తీసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.
ఫొటో సోర్స్, Reaction Engines
యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు ఐదు గంటల్లోనే ప్రయాణికులను తరలించేందుకు ఈ హైపర్ సోనిక్ విమానం డిజైన్ చేశారు
ధ్వని కంటే ఐదు రెట్ల అధిక వేగం చేరుకోవడం ఎలా?
ఒకవేళ ఇంజన్ కొత్త డిజైన్ గాలి ప్రతిఘటనను తగ్గించినా మరికొన్ని సవాళ్లు ఉన్నాయి.
అందులో ఒకటి వేడిని తట్టుకోవడం.
విమానం ధ్వని కంటే అధిక వేగాన్ని చేరుకుంటే షాక్‌వేవ్స్ వస్తాయి.
మామూలుగా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన శబ్దం వస్తుంది.
అద్దాలను సైతం పగలగొట్టగల శక్తి ఆ శబ్దానికి ఉంటుంది.
అందుకే ధ్వని కంటే ఐదు రెట్ల అధిక వేగం అందుకునే విమానం ఇంజన్ తయారు చేయడం చాలా సంక్షిష్టమైన విషయం.
ఫొటో సోర్స్, Darpa
ఇది అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ తయారు చేసిన ఫాల్కన్ హెచ్‌టీవీ-2 విమానం.. మాక్ 20 స్పీడ్ అంటే గంటకు 20,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు.. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది
సంప్రదాయ, జెట్ ఇంజన్ల కలయికలో కొత్త ఇంజన్!
మాక్ 5 వేగానికి చేరుకోవాలంటే సూపర్సోనిక్ ఇంజన్ వల్లే సాధ్యమవుతుంది. దీన్ని స్క్రామ్‌జెట్ ఇంజన్ అని కూడా పిలుస్తారు.
ఈ రకమైన ఇంజన్ గాలిని పీల్చుకుని, ఇంధనాన్ని మండించడానికి దాన్ని ఉపయోగిస్తుంది. అయితే, ఈ ఇంజన్ మాక్ 5 కంటే అధిక వేగంతో ప్రయాణించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది.
అంటే విమానం మొదట మాక్ 5 వేగానికి చేరుకునేందుకు మరో జెట్ ఇంజన్ అవసరం అవుతుంది. అందుకే ఇంజన్ చాలా శక్తివంతంగా ఉండాలి. అందుకోసం సాంప్రదాయ, జెట్ ఇంజన్ కలయికలో కొత్త ఇంజన్ రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
'అలాంటి ఇంజన్ తయారు చేసేందుకు చైనాలో చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి' అని క్వీన్స్లాండ్ యూనివర్శిటీ ప్రొఫసెర్ మైఖేల్ స్మార్ట్ చెప్పారు.
ఫొటో సోర్స్, Boom
సూపర్ సోనిక్ ప్రయాణికుల విమానాలను తిరిగి తీసుకురావాలని అమెరికా సంస్థ బూమ్ భావిస్తోంది
హైపర్ సోనిక్ విమానాలు వాణిజ్యపరంగాఅనుకూలమేనా?
సాంకేతిక కారణాలను పక్కన పెడితే హైపర్సోనిక్ విమానం వాణిజ్యపరంగా విజయం సాధిస్తుందా? ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడానికి ఉపయోగపడుతుందా?
1969లో కాంకర్డ్ సూపర్సోనిక్ విమానం తొలిసారి ఆకాశంలో ఎగిరినప్పుడు అందరూ దాని పనితీరును ప్రశంసించారు.
భవిష్యత్ విమానం ఇక అదేనని కీర్తించారు. కానీ ఆ తర్వాత కొన్ని విమానాలు మాత్రమే తయారు చేశారు. 2003లో దాన్ని పూర్తిగా నిలిపేశారు. దానికి కొనసాగింపుగా మరో విమానం తయారు చేయలేదు.
ఫొటో సోర్స్, Aerion
ఇది ఏరియాన్ బిజినెస్ జెట్ ఊహాచిత్రం.. సూపర్సోనిక్ బిజినెస్ జెట్ తయారు చేసేందుకు ఏరియాన్, జీఈ ఏవియేషన్ కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయి
ఎందుకంటే ఇలాంటి విమాన ప్రయాణాలు అధిక ఖర్చుతో కూడుకుని ఉంటాయి.
అంతేకాదు, సముద్రంపై నుంచి వెళ్తున్నప్పుడు మాత్రమే ధ్వని కంటే అధిక వేగంతో ప్రయాణించేందుకు కాంకర్డ్ విమానానికి అనుమతి ఉంది.
అట్లాంటిక్ గగనతల మార్గాల్లో పరిమితులు కూడా వాణిజ్యపరంగా అది విజయం సాధించలేకపోవడానికి ఒక కారణం.
ఫొటో సోర్స్, Spike
సూపర్సోనిక్ జెట్ తయారు చేసే ఆలోచనలో స్పైక్ కంపెనీ కూడా ఉంది
ప్రస్తుతం చైనా సైంటిస్టుల పరిశోధన మొగ్గ దశలోనే ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే హైపర్సోనిక్ విమానం కల సాకారం కావొచ్చు.
కానీ ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.
మీరివి చదివారా?
- ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్స్!
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
- గ్వాటెమాల అడవుల్లో నిదుర లేచిన మయా నాగరికత!
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- ఈ కళ్లజోళ్లు దొంగలను పట్టిస్తాయ్
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదవాలనుందా!
- ఇదండీ హెచ్-1బీ వీసా కథా కమామిషు!
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.