మావో స్థాయికి జిన్‌పింగ్: అధికారాలు పెంచనున్న చైనా ‘రెండు సమావేశాలు’

  • 6 మార్చి 2018
EPA Image copyright EPA
చిత్రం శీర్షిక మావో జెడాంగ్, జీ జిన్‌పింగ్

చైనా రాజకీయ రంగంలో ఇప్పుడు రెండు పెద్ద సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి.

జాతీయ శాసన సభ, రాజకీయ సలహా విభాగం సమావేశాలు బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. వీటినే చైనా 'రెండు సమావేశాలు'గా పిలుస్తారు.

దేశ రాజకీయాల్లో ఈ రెండు సమావేశాలు అత్యంత కీలకమైనవి.

ఈయేడు కీలకమైన రాజ్యాంగ సవరణలు చేసే దిశగా పార్లమెంట్ కొన్ని నిర్ణయాలను ఆమోదించనుంది. అందులో ముఖ్యమైంది ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం.

అంతేకాదు, ఎవరైనా రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండరాదనే నిబంధనను కూడా తొలగించడం. అంటే దీనర్థం షీ జిన్‌పింగ్‌ను మరింత కాలం అధ్యక్ష పీఠంలో కొనసాగించడం.

ఇప్పటికే ఆయన సిద్ధాంతాలు, మార్గదర్శకాలతో నవ చైనా ముందుకు వెళుతోంది. దీన్నే 'షీ జిన్‌పింగ్ ఆలోచనలు'గా పిలుస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆయ‌న పాల‌న‌లో తీసుకొచ్చిన‌ కొత్త‌ సంస్క‌ర‌ణ‌ల‌నే జిన్‌పింగ్ థాట్ అంటారు.

ఏమిటీ సమావేశాలు?

చైనా చట్టసభను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలుస్తారు. ఇది భారత్‌లోని లోక్‌సభ లాంటిదని చెప్పవచ్చు.

ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఎన్‌పీసీ అత్యంత బలమైన జాతీయ సభ. అయితే, చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉండటంతో అంతర్జాతీయ పరిశీలకులు మాత్రం దీన్ని రబ్బర్ స్టాంప్‌గా అభివర్ణిస్తుంటారు.

ఈ ఏడాది చైనా ప్రావిన్స్‌లు, స్వతంత్ర ప్రాంతాలు, కేంద్ర పరిపాలన మున్సిపాలిటీలు, హాంకాంగ్, మకావ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతాలు, సాయుధ దళాల నుంచి దాదాపు 2,980 మంది ఎన్‌పీసీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు.

ఇందులో 742 మంది మహిళలు, 438 మంది మైనారిటీ సభ్యులు కూడా ఉన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఎన్‌పీసీ భవనం

దేశంలో చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) అత్యంత బలమైన రాజకీయ సలహా సంస్థ. అయితే, దీనికి చట్టాలు చేసే అధికారం మాత్రం లేదు.

ప్రస్తుతం సీపీపీసీసీలో 2,158 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. వీటి సమావేశాలు కూడా కీలకమైనవే.

ఈ రెండు సమావేశాలను చైనీస్‌లో 'లియాంగ్ హుయ్‌'గా పిలుస్తుంటారు. ఇవి వారం నుంచి రెండు వారాల వరకు కొనసాగుతాయి.

ఈ ఏడాది సీపీపీసీసీ సమావేశాలు మార్చి 3న, ఎన్‌పీసీ సమావేశాలు మార్చి 5న ప్రారంభమయ్యాయి.

ఈ సమావేశాల్లో ఏం జరగొచ్చు?

ఐదేళ్లకోసారి నిర్వహించే కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు గతేడాది 2017లో జరిగాయి. ఆ తర్వాత జరుగుతున్న పెద్ద కార్యక్రమం ఈ రెండు సమావేశాలు. అందుకే ఇవి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • దేశంలో మావో జెడాంగ్ తర్వాత ఆ స్థాయిలో అత్యున్నత అధికారాలు అనుభవిస్తున్నది షీ జిన్‌పింగే. మావో స్థాయిలో ప్రస్తుత అధ్యక్షుడిని నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
  • జిన్‌పింగ్ రాజకీయ తాత్వికతగా పిలిచే జీ జిన్‌పింగ్ ఆలోచనలను రాజ్యాంగంలో చేర్చడంపై ఆమోద ముద్ర వేయడం.
  • మరోదఫా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌నే కొనసాగించేందుకు నిర్ణయించడం.
  • ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండకూదనే నిబంధనను తొలగించడం. అంటే జిన్‌పింగ్ 2023 వరకు అధ్యక్షుడిగా కొనసాగేలా మార్గం సుగమం చేయడానికి ఆమోదం తెలపడం.
  • అవినీతి నిరోధక చర్యలు చేపట్టేందుకు అత్యున్నత అధికారాలతో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయడం.

ఈ సమావేశంలో తీసుకొనే ముఖ్యమైన నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు.

ఆర్థిక సంస్కరణలు, జీ జిన్‌పింగ్ ఎక్కువగా దృష్టిసారించే అవినీతి, పర్యావరణ పరిరక్షణపై కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

Image copyright AFP

ప్రతిపక్షం ఏమైనా ఉందా?

చైనాలో ఏక పార్టీ వ్యవస్థ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా పిలిచే కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించిందే చట్టంగా మారుతుంది.

నిజానికి దేశంలో అధికారికంగా చాలా రాజకీయ పార్టీలున్నాయి. కానీ, అవన్నీ కమ్యూనిస్టు పార్టీకి మద్దతిస్తున్నవే.

చైనా మీడియా ఎలా చూస్తోంది?

ఈ రెండు సమావేశాలకు చైనా జాతీయ మీడియా భారీ స్థాయిలో కవరేజ్ ఇస్తోంది. అయితే, సమావేశాలపై ఏ మీడియాలోనూ విమర్శలు కనిపించవు.

'చాలా కాలంగా ఎదురు చూస్తున్న జాతీయ సంస్థల పునరుద్ధరణ ఎన్‌పీసీ సమావేశంలో ప్రధాన అంశంగా ఉంటుంది' అని చైనా రేడియో ఇంటర్నేషనల్ ప్రశంసించింది.

'సుస్థిర పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పేదరిక నిర్మూలన ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలుగా ఉండనున్నాయి' అని బీజింగ్‌కు చెందిన చైనా ఫైనాన్స్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.

Image copyright EPA
చిత్రం శీర్షిక సీపీపీసీసీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తారు

అయితే, అమెరికాకు చెందిన ఎన్‌టీడీటీవీ.కాం మీడియా మాత్రం, 'చాలా ప్రావిన్స్‌ల నుంచి తమ సమస్యలు చెప్పుకోడానికి ఫిర్యాదుదారులు బీజింగ్‌కు తరలివస్తున్నారు' అని పేర్కొంది.

రెండు పర్యాయాలకు మించి ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండేలా నిబంధనలను మార్చనుండటంపై చైనాలో కొంత మంది విమర్శలు చేస్తున్నారు.

''ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా ఉండరాదనే నిబంధనను 1982లో రాజ్యాంగంలో చేర్చారు. నియంతృత్వం, వ్యవస్థ కంటే వ్యక్తి గొప్పగా భావించే పరిస్థితి రాకూడదనే దీన్ని తీసుకొచ్చారు'' అని శాసన సభ్యులకు రాసిన ఒక బహిరంగ లేఖలో చైనా యూత్ డైలీ మాజీ ఎడిటర్ పేర్కొన్నారు.

'ఈ నిర్ణయాన్ని భవిష్యత్తు తరాలు చైనా చరిత్రలో ఓ ప్రహసనంగా భావిస్తాయి' అని ఆయన బీబీసీతో చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచైనా సైన్యం గురించి ఛగ్లాగామ్ ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)