Reality check: చైనీస్‌.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?

  • 6 మార్చి 2018
ఏప్రిల్ 17, 2015న ఇస్లామాబాద్‌లో చైనా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద కూర్చున్న పాకిస్తానీయుడు Image copyright FAROOQ NAEEM/GETTY

చైనీస్ భాషను పాకిస్తాన్ అధికారిక భాషగా ప్రకటించింది? కొన్ని రోజుల క్రితం ఈ వార్త వైరల్ అయింది. ఇది నిజమా?

బీబీసీ రియాలిటీ చెక్ ఫలితం :

ఇది నిజం కాదు. దేశంలో చైనీస్ భాషను బోధించాలని పాకిస్తాన్ పార్లమెంట్ తీర్మానించింది. కానీ.. ఆ భాషను అధికారిక భాషగా పేర్కొంటూ ఎటువంటి తీర్మానం చేయలేదు.

చైనీస్ భాషను పాకిస్తాన్ అధికారిక భాషగా ప్రకటించారంటూ.. 'అబ్ తక్' టీవీ చానెల్ ఈ వార్తను ప్రసారం చేసింది. బ్రేకింగ్ న్యూస్ అంటూ వరుస కథనాలతో హడావుడి చేసింది.

అయితే.. పాకిస్తాన్ పార్లమెంట్ చేసిన తీర్మానం వేరుగా ఉంది.

'చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌'(సీపీఈసీ)లో భాగంగా.. ఈ ప్రాజెక్ట్‌లో పని చేసేవారి మధ్య భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పాకిస్తాన్‌లో చైనీస్ భాషను బోధించాలన్నది ఆ తీర్మానం సారాంశం.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. చైనా పాకిస్తాన్‌ వ్యాప్తంగా వివిధ రంగాల్లో6,200కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది.

ఇది ఫేక్ న్యూస్..

ఈ వార్తను ఏఎన్ఐ, ఇండియా టుడే, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లాంటి భారతీ మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి.

అంతటితో ఆగక చైనాతో పెరుగుతున్న పాకిస్తాన్ మైత్రికి ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానాలు చేశాయి.

తర్వాత అసలు విషయం తెలుసుకుని పొరపాటు జరిగినట్లు అంగీకరించాయి.

పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త కూడా అబ్ తక్ వార్తను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ పార్లమెంట్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

ఈ వార్తతో అటు చైనాలో కూడా కొందరు స్పందించారు. షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి హ్యూజియోంగ్ అనే వ్యక్తి ''చైనా - పాకిస్తాన్‌ల మధ్య చీలికలు తేవడానికి ప్రయత్నిస్తున్నారు'' అని కామెంట్ చేశారు.

అధికారిక భాష ఏది?

పాకిస్తాన్ అధికారిక భాష ఉర్దూ. కానీ అధికారిక వ్యవహారాలన్నీ ఇంగ్లీష్‌లోనే జరుగుతాయి. పాకిస్తాన్‌లో స్థానిక భాషలు చాలానే ఉన్నాయి.

ఉదాహరణకు.. పాకిస్తాన్‌లో పంజాబీ భాషను 48% మంది మాట్లాడుతారు. కానీ పాకిస్తాన్‌లో ఈ భాషకు అధికారిక గుర్తింపు లేదు.

పాకిస్తాన్‌లో ఉర్దూ భాషను కేవలం 8% మంది ప్రజలు మాత్రమే మాట్లాడుతారు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలు మాట్లాడుతారు. దేశంలో అంతరించింపోతున్న భాషలను ప్రభుత్వం విస్మరిస్తోందని చాలా మంది విమర్శిస్తున్నారు.

పాకిస్తాన్‌లో ఎక్కువ మంది మాట్లాడే భాషలను అధికారిక భాషలుగా గుర్తించాలంటూ.. కొన్ని రాజకీయ పార్టీలు, సాహిత్య సంస్థలు ఫిబ్రవరి 22న మాతృభాషా దినోత్సవం నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ భాష అంతరించిపోతోంది..

పాక్ - చైనా మధ్య మైత్రి పెరుగుతోందా?

ఇరు దేశాల మధ్య స్నేహం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఫేక్ న్యూస్ నమ్మదగినదిగా ఉందని 'ఔట్ లుక్' వార్తా సంస్థ పేర్కొంది.

'వన్ బెల్ట్ వన్ రోడ్' పాలసీలో భాగంగా ఏర్పాటైన సీపీఈసీ ప్రాజెక్ట్‌లో రహదారుల నిర్మాణం, పవర్ ప్లాంట్లు, పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటుతో చైనా సంస్థలు పాకిస్తాన్ దేశవ్యాప్తంగా విస్తరించాయి.

పాకిస్తాన్ మీడియాలో కూడా చైనా ప్రవాహం కొనసాగింది. అందులో భాగమే.. చైనీస్ భాషకు సంబంధించిన వారపత్రిక పాకిస్తాన్‌లో ప్రారంభమైంది.

హౌషాంగ్ పత్రిక కూడా తన కార్యకలాపాలను పాకిస్తాన్‌లో ప్రారంభించింది. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలకు సహాయకారిగా ఉండటానికే తమ పత్రికను పాకిస్తాన్‌లో ప్రారంభించామని హౌషాంగ్ పేర్కొంది.

Image copyright AAMIR QURESHI/GETTY

చైనా.. పాకిస్తాన్ పాలిట మరో ఈస్ట్ ఇండియా కంపెనీనా?

పాకిస్తాన్, చైనా దేశాలు ఇప్పటికే.. 'దోస్తీ' పేరుతో 24గంటలు ప్రసారమయ్యే రేడియో చానెల్‌ను ప్రారంభించాయి. ఈ రేడియో ప్రసారాల్లో 'లెర్న్ చైనీస్' పేరుతో ఓ కార్యక్రమం గంట సేపు ప్రసారమవుతుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో.. పాకిస్తాన్‌లోని స్థానిక భాషలకు, సంస్కృతులకు, వ్యాపారాలకు మరింత రక్షణ కావాలని కొందరు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో వీస్తున్న చీనీస్ గాలులు తమ సామాజిక, సాంస్కృతిక రంగాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే.. 'ది నేషన్' అనే ఇంగ్లీష్ పత్రిక కూడా.. 'సీపీఈసీ' పాకిస్తాన్‌లో సాంస్కృతిక సంఘర్షణకు దారి తీస్తుందని హెచ్చరించింది. 'ద న్యూస్' అనే పత్రిక కూడా ఈ విషయమై స్పందిస్తూ.. చైనా పోకడను చరిత్రలోని ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తూ.. పాకిస్తాన్ చైనాకు బంటుగా తయారవుతోందని ప్రస్తావించింది.

Image copyright Empics

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు