తప్ప తాగి.. ఊబర్ ఎక్కి.. లక్ష రూపాయలు బిల్లు కట్టాడు..!

  • 6 మార్చి 2018
బీర్ ఎమిజోల ముందు కెన్నీ బాక్‌మన్ Image copyright Kenneth Bachman

కెన్నీ బాక్‌మన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి బయటకెళ్లి సరదాగా గడిపాడు. క్లబ్‌లో పార్టీ పూర్తయ్యాక ఇంటికి వెళదామని ఊబర్ కారు బుక్ చేసుకున్నాడు. అలా బుక్ చేసుకున్నందుకు ఇప్పటికీ గుండెలు బాదుకుంటున్నాడు.

ఎందుకంటే ఆ రోజు బుక్ చేసుకున్న కారుకి అక్షరాలా లక్ష రూపాయల పైనే బిల్లు కట్టాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. అతడు అమెరికాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఉండి.. అక్కడికి 600 కిలోమీటర్ల దూరంలో న్యూజెర్సీలోని తన ఇంటిని సెలక్ట్ చేసుకున్నాడు.

‘‘కానీ నేను నివసిస్తున్న ఇల్లు ఆ క్లబ్‌కు నాలుగు వీధుల అవతలే ఉంది’’ అని కెన్నీ వాపోయాడు.

’’ఇంకా దారుణమేంటంటే.. నేను బుక్‌ చేసింది ఊబర్ ఎక్స్‌ఎల్’’ అని అతడు ‘బీబీసీ న్యూస్‌బీట్’తో పేర్కొన్నారు.

Image copyright Kenneth Bachman
చిత్రం శీర్షిక కెన్నీ బిల్లు లక్ష రూపాయల పైనే (1,635 డాలర్లు)

అర్థరాత్రి దాటిన తర్వాత 2:51 గంటలకు మొదలైన కెన్నీ చిరు ప్రయాణం.. ‘‘ఐదారు గంటలు’’ కొనసాగింది. గమ్యం చేరేసరికి 1,635.93 డాలర్ల ఊబర్ చార్జీ, అదనంగా 20 డాలర్లు టోల్ చార్జీలు కలిపి మొత్తం 1,656 డాలర్లు.. అంటే దాదాపు రూ. 1.10 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

‘‘ఇదేమీ నాకు గర్వకారణం కాదు’’ అని సదరు ఊబర్ డరైవర్ అంటారు.

‘‘అక్కడ నా దోస్తులున్నారు. వాళ్ల ఇంట్లో నేను ఉంటున్నాను. నేను సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడకు వెళ్లిన వెంటనే తాగటం మొదలు పెట్టా’’ అని ఆ రోజు సాయంత్రం అసలేం జరిగిందనేది కెన్నీ వివరించాడు.

Image copyright Kenny Bachman
చిత్రం శీర్షిక ‘‘ఆ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోలేదు’’ అని కెన్నీ (ఎడమ) అంటారు

అనంతరం ఒక పార్టీకి వెళ్లి అక్కడా తాగానని, ఆ తర్వాత మళ్లీ ఓ క్లబ్‌కు వెళ్లానని అతడు చెప్తున్నాడు.

‘‘అప్పటి నుంచీ నాకు మైకం కమ్మటం మొదలైంది. దాదాపు ఆ ప్రయాణమంతా నేను నిద్రపోయాను. చివర్లో 45 నిమిషాలు మేలుకున్నాను. అసలు నేను ఊబర్ ఆర్డర్ చేసినట్లే నాకు తెలీదు. కానీ కళ్లు తెరిచి చూస్తే ఊబర్ కారులో ఉన్నాను’’ అని కెన్నీ వివరించాడు.

‘‘నాకు మతిపోయింది. షాక్‌లో ఉన్నాను. నాకేమీ తెలియకుండానే చిక్కుకుపోయాను. ఏం చేయాలో పాలుపోలేదు’’ అని చెప్పాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పైగా బుక్ చేసింది ఊబర్ ఎక్స్‌ఎల్ కారు

‘‘ఊబర్‌కు ఈ ప్రయాణం మీద ఫిర్యాదు చేశాను. కానీ.. నేనే అడ్రస్ పెట్టానని, నేను ప్రయాణం చేశానని కాబట్టి నేను బిల్లు కట్టి తీరాలని వారు చెప్పారు’’ అని కెన్నీ వివరించాడు.

‘‘తప్పతాగి తెలివిలేని స్థితిలో ఉన్న నన్ను చూసిన ఆ ఊబర్ డ్రైవర్.. నన్ను దేశమంతా తిప్పి తీసుకెళ్లటం సరైనదే అని నిర్ణయించుకోవటాన్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను’’ అని అతడు అంటాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆ డ్రైవర్‌కి ఫైవ్ స్టార్ రేటింగ్ లభించిందా అనేది అనుమానమే

ఇంకా విషమ పరిస్థితి ఏమిటంటే.. కెన్నీ న్యూజెర్సీ నుంచి మళ్లీ తిరిగి రావాలి.

‘‘నా వస్తువులన్నీ ఇంకా వెస్ట్ వర్జీనియాలోనే ఉన్నాయి. నేను మళ్లీ వెనక్కి వెళ్లి అవన్నీ తెచ్చుకోవాల్సి ఉంది’’ అని అతడు చెప్తున్నాడు.

‘‘నేను అసలు ఖర్చు ఎంతవుతుందని లెక్క వేశాను. నేను బస్సులో ఎక్కి వస్తే 35 డాలర్లు (రూ. 2,300) ఖర్చవుతుంది. పోనీ విమానం ఎక్కి వచ్చినా 115 డాలర్లు (రూ. 7,500) అవుతుంది’’ అని పేర్కొన్నాడు.

‘‘నిజంగా చెప్తే.. ఇది చాలా ఫన్నీగా ఉందని నా ఫ్రెండ్స్ అంటారు. బుద్ధిలేని పనే.. కానీ ఫన్నీగా ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)