శ్రీలంకలో ఎమర్జెన్సీ.. అసలక్కడ ఏం జరుగుతోంది?

  • 6 మార్చి 2018
కండి జిల్లాలో అత్యవసర పరిస్థితి

శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం పది రోజుల పాటు ఎమర్జెన్సీ విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది.

కండి జిల్లాలో సింహళ, ముస్లింల మధ్య హింస చోటుచేసుకున్న అనంతరం అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటన చేసింది.

మంత్రుల సమావేశంలో అధ్యక్షుడు, మంత్రులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సమావేశం తర్వాత మంత్రి ఎస్.పి. దిశానాయక విలేకరులకు తెలిపారు.

ఈ ఎమర్జెన్సీ వ్యవధి పెరుగుతుందా అని ప్రశ్నించినపుడు పదో తేదీన దీనిపై అధ్యక్షుడు ప్రకటన చేస్తారని వివరించారు.

అంతకు ముందు.. అంటే సోమవారం.. ముస్లింలపై దాడుల అనంతరం కండి జిల్లాలో పోలీసులు అత్యవసర పరిస్థితి విధించారు.

అయినా రాత్రి తమ ప్రాంతాల్లో రాళ్లదాడి జరిగిందని స్థానిక ముస్లింలు తెలిపారు.

సోమవారం జరిగిన ఘర్షణల్లో ముస్లింలకు చెందిన కనీసం మూడు పాఠశాలలు, దుకాణాలు, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.

తమ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించినా దాడులు ఆగకపోవడంపై ముస్లింలు భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు ఈ ప్రాంతంలో సైన్యాన్ని పెద్దఎత్తున మోహరించి.. రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మంగళవారం అక్కడ ఘర్షణలు జరగలేదు. అయినా ఎప్పుడు ఏమవుతుందోనని పోలీసులు, ముస్లింలు ఆందోళన చెందుతున్నారని స్థానిక విలేకరి ఒకరు తెలిపారు.

ఇలా మొదలు

ఒక రోడ్డు ప్రమాదం అనంతరం కొందరు ముస్లిం యువకులు ఓ సింహళ వ్యక్తిపై దాడి చేశారు. అతడు గాయపడగా, ఆస్పత్రిలో చేర్చారు.

ఆపై క్రమంగా ఆ ప్రాంతంలో హింస రాజుకుంది.

మంగళవారం కండి జిల్లాలో పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.

దీంతో పాటు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో బంద్ పాటించారు. ఈ బంద్ సందర్భంగా జరిగిన చిన్న పాటి ఘర్షణలో ఓ తమిళుడిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు