అదానీ బొగ్గు ప్రాజెక్టు: ఆస్ట్రేలియాలో నిరసన జ్వాలలు

  • 7 మార్చి 2018
స్టాప్ అదానీ ఉద్యమం Image copyright Stop Adani campaign

భారత్‌కు చెందిన అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో ఓ బొగ్గు గనిని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. కానీ కొన్ని నెలలుగా దానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుతుందనీ, భారీ స్థాయిలో గ్రీన్ హౌజ్ వాయువులు విడుదలవుతాయనీ ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నారు.

ఆ ప్రాజెక్టు వల్ల చాలామందికి ఉద్యోగాలు లభిస్తాయని దానికి అనుకూలంగా ఉన్నవారు అంటున్నారు.

అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి ఆస్ట్రేలియా వెళ్లారు. అదానీ గ్రూప్ చైర్మన్‌తోనూ మాట్లాడారు.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో అదానీ సంస్థ కార్మైకెల్ బొగ్గు గనిని ఏర్పాటు చేసే పనిలో ఉంది.

ఆ ప్రాంతానికి కొంత దూరంలో అదానీ గ్రూప్‌‌ను వ్యతిరేకిస్తూ రహస్యంగా ఓ నిరసనకారుల బృందం పనిచేస్తోంది. అదానీ మద్దతుదార్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికే వాళ్లలా రహస్యంగా పనిచేస్తున్నారు.

Image copyright Getty Images

‘ఈ శిబిరాల్లోనే మేం మా కార్యాచరణను రూపొందిస్తాం. విరాళాలపై ఆధారపడే మేం నిరసనను కొనసాగిస్తున్నాం’ అంటారు స్కాట్ డేన్స్. అక్కడున్న 40 మంది నిరసనకారుల్లో ఆయన ఒకరు.

‘బొగ్గు భూగర్భం లోపలే ఉండాలి, బయట కాదని సైన్స్ చెబుతోంది. అందుకే మేం ఇక్కడ నిరసన చేపడుతున్నాం’ అంటారు స్కాట్.

అదానీ గ్రూప్ పాశ్చాత్య దేశాలకు చెందినది కాకుండా ఓ భారతీయ సంస్థ అయినందునే ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయని ప్రాజెక్టుకు మద్దతిచ్చే కొందరు వ్యక్తులు అంటున్నారు.

ఆస్ట్రేలియా వనరుల శాఖా మంత్రి మాథ్యూ కానవాన్ కూడా ఇంచుమించు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అన్ని దేశాల్లోలానే ఆస్ట్రేలియాలో కూడా కొందరు వ్యక్తులు తమ దేశంలోకి విదేశీయులు రాకూడదని భావిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

Image copyright AFP

స్థానికులు మాత్రం ఆ బొగ్గుగని వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని భయపడుతున్నారు.

అదానీ గ్రూప్ నిర్మించ తలపెట్టిన బొగ్గుగని అంచనా వ్యయం దాదాపు రూ. 81 వేల కోట్లు.

క్వీన్స్‌లాండ్‌లో బొగ్గుగనిని నిర్మించడం ఒక సవాలైతే, అక్కడినుంచి ఎగుమతి కోసం బొగ్గును 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్టుకు తరలించడానికి అవసరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం మరో సవాలు.

రవాణా కోసం కంపెనీ ఓ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసం ఇప్పటికే పరిసరాల్లోని వ్యవసాయ భూములను సేకరించారు.

ఏటా వంద మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసేలా రైలు మార్గాన్ని రూపొందించనున్నట్లు అదానీ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ చెబుతోంది.

‘ఆ రైలు మార్గం పూర్తయితే స్థానికంగా నిద్రాణ స్థితిలో ఉన్న ఇతర ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయి. దాంతో మరింత బొగ్గును తవ్వుతారు. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటుంది. భూగర్భ జలాలతో పాటు స్థానిక సముద్ర తీరాలు కూడా దెబ్బతింటాయి’ అని నిరసనకారులు చెబుతున్నారు.

ప్రాజెక్టు మద్దతుదారులు మాత్రం దాని వల్ల క్వీన్స్‌లాండ్ ప్రాంతంలో యువతకు ఉపాధి లభిస్తుందనీ, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందనీ ఆశిస్తున్నారు.

‘ఆస్ట్రేలియాలో అత్యంత కఠినమైన పర్యావరణ సంబంధిత నిబంధనలను మేం నిర్మించ తలపెట్టిన కార్మైకెల్ ప్రాజెక్టుకే విధించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 112 అనుమతులను పొందాల్సి వచ్చింది’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

Image copyright Getty Images

కానీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంస్థకు నిధులు సేకరించడం కష్టంగా మారింది.

క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుకు రుణం మంజూరు చేయడానికి నిరాకరించింది. మరోపక్క అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు కూడా అదానీకి ప్రతికూలంగా మారాయి.

బొగ్గుకు భవిష్యత్తు లేదని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలలో ఒకటైన బ్లాక్‌రాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేర్కొంది. భారత బొగ్గు శాఖా మంత్రి పీయూష్ గోయల్ కూడా దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయనీ, కాబట్టి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు.

‘ఆస్ట్రేలియాలో సముద్ర తీరాలకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ ఇప్పుడు బొగ్గువల్ల అవి దెబ్బతింటాయి. పోర్టుల కారణంగా తీరాల్లో బొగ్గు కనిపిస్తోంది.

భారత్‌లో బెంగాల్ టైగర్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు కదా.. దాన్ని తుపాకీతో కాల్చి చంపితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సముద్ర తీరాల పరిస్థితి కూడా అలానే ఉంది. అభివృద్ధి పేరుతో చేజేతులా వాటిని నాశనం చేస్తున్నారు’ అని లాన్స్ పేన్ అనే పర్యావరణవేత్త అభిప్రాయపడుతున్నారు.

ఒక పక్క భారత్, చైనాలు పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెడుతుంటే, అదానీ గ్రూప్ ఉత్పత్తి చేసే బొగ్గును ఎక్కడికి ఎగుమతి చేస్తారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలు లేని ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారని వారు అడుగుతున్నారు.

సంస్థ ప్రతిపాదనల ప్రకారం అక్కడ ఉత్పత్తి చేసే బొగ్గులో ఎక్కువ భాగం భారత్‌కు ఎగుమతి కావల్సి ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అది ఏ మేరకు సాధ్యమవుతుందనే విషయంపై అదానీ సంస్థ ఎలాంటి స్పష్టతా ఇవ్వట్లేదు.

కానీ అదానీ గ్రూప్ ప్రాజెక్టుకు కట్టుబడి ఉందనీ, దానికి అవసరమైన నిధులను కచ్చితంగా సేకరిస్తామనీ కంపెనీ నమ్మకంగా చెబుతోంది.

ఆస్ట్రేలియా వనరుల శాఖా మంత్రి మాథ్యూ కానవాన్ కూడా ప్రాజెక్టుపై ఆశావహంగానే ఉన్నారు. ‘అదానీ గత చరిత్ర మాకు సంతృప్తికరంగా ఉంది. వాళ్లని మా దేశంలోకి స్వాగతిస్తున్నాం. వాళ్ల వల్ల రెండు దేశాలకూ మేలు జరగాలి’ అని ఆయన అంటున్నారు.

‘ఈ ఏడాది అదానీ ప్రాజెక్టు పనులు ముందుకు కదలకపోతే, అవి ఇంకెప్పటికీ ముందుకెళ్లవని నా అభిప్రాయం’ అంటారు సిడ్నీకి చెందిన టిమ్ బక్లీ అనే విద్యుత్ రంగ నిపుణుడు.

అదే ప్రాంతానికి చెందిన టౌన్స్‌విల్లే పట్టణ ప్రజలు మాత్రం ప్రాజెక్టు ఎలాగైనా ముందుకు కదలాలని కోరుకుంటున్నారు. ‘ఆ ప్రాజెక్టు వస్తే మాకు ఉద్యోగాలు దొరకుతాయి. అందుకే మేం అదానీని సపోర్ట్ చేస్తున్నాం’ అంటారు వాళ్లు.

‘ఆస్ట్రేలియాలో పర్యావరణాన్ని రక్షించడానికి చాలామంది ఉన్నారు. కానీ ఉద్యోగాలే సమస్యగా మారాయి. అందుకే మైన్ పనులు ముందుకు కదలాలి’ అని టౌన్స్‌విల్లేకి చెందిన ఓ వ్యక్తి అన్నారు.

ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద నగరాల్లో ఉండే ప్రజలకు ఆర్థికంగా తాము పడుతున్న ఇబ్బందులు తెలీదు అని మరికొందరు చెబుతున్నారు.

‘పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్న ప్రశ్నలు సమంజసమైనవే. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ అవసరం ఉంది. కేవలం పునరుత్పాదక శక్తిపైన వారు ఎల్లకాలం ఆధారపడలేరు. కాబట్టి దేశంలోనే దాన్ని ఉత్పత్తి చేయకపోతే, బయటి దేశాల నుంచి దాన్ని కొనాల్సి ఉంటుంది’ అని టౌన్స్‌విల్లే ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన మైఖెల్ మెక్‌మిలన్ అభిప్రాయపడ్డారు.

అదానీ ప్రాజెక్టుకు మద్దతిచ్చే సంస్థల్లో టౌన్స్‌విల్లే ఎంటర్‌ప్రైజెస్ కూడా ఒకటి.

‘గౌతమ్ అదానీకి బిలియన్ డాలర్ల విలువైన కంపెనీని నిర్వహించడానికి కావల్సిన నైతిక విలువలను నేర్పాలి. అతడు సృష్టిస్తున్న ఈ వినాశనం ఆమోదయోగ్యం కాదు’ అని ‘స్టాప్ అదానీ’ ఉద్యమ మాజీ కార్యకర్త క్లారే జాన్స్‌టన్ అభిప్రాయపడ్డారు.

‘బొగ్గు ఓ డైనోసార్ లాంటిది. అది భూగర్భంలో ఉండటమే అందరికీ మంచిది’ అన్నది ఆయన మాట.

‘విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న కొన్ని బొగ్గు వ్యతిరేక సంఘాలు, స్థానికుల ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రాజెక్టును దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని అదానీ ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడినా, భారత్‌లోనూ అవి చర్చనీయాంశం కాక తప్పదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)