శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించడానికి కారణాలేంటి?

  • 7 మార్చి 2018
శ్రీలంక, హింస, అల్లర్లు, బౌద్ధులు, ముస్లింలు Image copyright Getty Images

శ్రీలంకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కండీలో వారం క్రితం ఒక ట్రాఫిక్ వివాదంలో కొందరు ముస్లింలు చేసిన దాడిలో ఒక బౌద్ధ సన్యాసి మరణించడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.

గతవారమే, తూర్పుప్రాంతంలోని అంపారా పట్టణంలో కూడా ముస్లింలకు చెందిన ఒక దుకాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. గతంలో 2014లో నైరుతి ప్రాంతంలో చెలరేగిన హింసలో నలుగురు మరణించగా, డజన్ల కొద్దీ వ్యక్తులు గాయాల పాలయ్యారు.

కరడుగట్టిన బౌద్ధ బృందాల పాత్ర ఏమిటి?

2014 విషయానికి వస్తే, అల్లర్లకు కరడుగట్టిన బౌద్ధులే కారణమని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వీడియో ఫుటేజ్‌లో బౌద్ధులు, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న బౌద్ధ సన్యాసిని ఒక బౌద్ధ నాయకుడు తప్పుబట్టడం కనిపించింది. లంక అధ్యక్షుడు రాజపక్సె పాలనలో బీబీఎస్ - బోదు బాల సేన - ముస్లిం వ్యతిరేక ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ సమస్యలు సృష్టిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Image copyright Getty Images

ముస్లిం వర్గాలలో కూడా కరడుగట్టిన ఛాందసులున్నారా?

కొన్ని ప్రాంతాలలో ఇటీవల కొంత ముస్లిం ఛాందసవాదం పెరిగిందని భావిస్తున్నారు. ఇస్లాంలోనే మరింత కఠినమైన సంప్రదాయవాదం బలం పుంజుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

దేశంలోని కొన్ని మదరసాలకు, మసీదులకు సౌదీ అరేబియా లేదా గల్ఫ్ దేశాల నుంచి నిధులు అందుతున్నాయని తెలుస్తోంది. అయితే వేటికి అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.

Image copyright Getty Images

సోషల్ మీడియాలో దేని వల్ల ఎక్కువగా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి?

ముస్లింలకు వ్యతిరేకంగా వదంతులు వ్యాప్తి చేయడానికి, వారిపై దాడులకు మద్దతు కూడగట్టడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు.

ప్రభుత్వంలోని కొందరు అధికారులు సోషల్ మీడియాలో వెలువడుతున్న వదంతులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే అల్లర్లకు కారణమని ఆరోపిస్తున్నారు.

ప్రధాని రానిల్ విక్రమసింఘే కూడా పార్లమెంటులో చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు.

Image copyright Reuters

అత్యవసర పరిస్థితి అవసరమని ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది?

పోలీసులను భారీగా మోహరించినా కండీ జిల్లాలో హింస తలెత్తింది. అందువల్ల రాజకీయనేతలు కొందరు పోలీసులలకు పరిస్థితి చక్కదిద్దడం చేత కాదని లేదా అది వాళ్లకు ఇష్టం లేదని, అందువల్ల హింసను ఆపడానికి మిలటరీ జోక్యం అవసరమని భావిస్తున్నారు.

దీని వల్ల అల్లరి మూకలకు ఒక బలమైన సందేశం వెళుతుందనేది వాళ్ల ఆలోచన.

Image copyright Reuters

అత్యవసర పరిస్థితిపై ప్రపంచ దేశాల ప్రతిస్పందన ఎలా ఉంది?

కొలంబోలోని అమెరికా, యూకే ఎంబసీలు రెండూ హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి.

హింస నేపథ్యంలో శ్రీలంక, భారత, బంగ్లాదేశ్‌లమధ్య జరుగుతున్న ముక్కోణపు టోర్నీ జరుగుతున్న ఆర్ ప్రేమదాస స్టేడియంకు అదనపు భద్రత కల్పించారు. ఈ స్టేడియం కొలంబోలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు