ఇరాన్: అందరిముందూ హిజాబ్ తొలగించిన మహిళకు రెండేళ్లు జైలు శిక్ష

  • 9 మార్చి 2018
తన స్కార్ఫును సరిచేసుకుంటున్న మహిళ Image copyright Getty Images

హిజాబ్ ధరించటం తప్పనిసరి చేసే చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. అందరి ముందు ముసుగు తొలగించిన ఒక ఇరాన్ మహిళకు రెండేళ్లు జైలు శిక్ష విధించినట్లు న్యాయవాదులు తెలిపారు.

అయితే ఆమె పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఆమె ‘నైతిక అవినీతిని ప్రోత్సహిస్తోంద’నే నేరం రుజువయ్యిందని టెహ్రాన్ న్యాయవాది అబ్బాస్ జఫారీ - డొలాటబడి చెప్పారు.

పౌర ప్రదేశాల్లో ముసుగుతోనే కనిపించాలన్న ఇరాన్ కఠిన చట్టాన్ని ఉల్లంఘించినందుకు గత కొన్ని వారాలుగా చాలామంది మహిళల్ని అరెస్టు చేశారు. అలా అరెస్టు చేసిన మహిళల్లో ఎక్కువ మందిని ఎలాంటి అభియోగాలు లేకుండానే విడిచిపెట్టారు.

ఈ మహిళ పెరోల్ లేకుండా మూడు నెలలు జైలు శిక్షను అనుభవించారు. అయితే, ఆమెకు వైద్య చికిత్స అవసరం కావటంతో రెండేళ్ల శిక్షలో 21 నెలల శిక్షను రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు.

‘ఆమెకు దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరం. ఆమెకు సైకియాట్రిస్ట్ చికిత్స చేయాలి’ అని జఫారీ తెలిపారు.

అయితే, ఆమెకు శిక్ష తగ్గించరాదని, ఆమె రెండేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాల్సిందేనని జఫారీ వాదించారు.

Image copyright Unknown
చిత్రం శీర్షిక గతేడాది డిసెంబర్‌లో.. టెహ్రాన్‌లో ఒక మహిళ తన ముసుగును తొలగించి, కర్రకు కట్టి నిరసన తెలిపారు. ఈమె దేశవ్యాప్త నిరసనలకు ముఖచిత్రంగా మారారు

ఆమేనా ఈమె?

గతేడాది డిసెంబర్‌లో.. టెహ్రాన్‌లో ఒక మహిళ తన ముసుగును తొలగించి, కర్రకు కట్టి నిరసన తెలిపారు. ఈమె దేశవ్యాప్త నిరసనలకు ముఖచిత్రంగా మారారు.

రద్దీగా ఉండే ఒక వీధిలోని టెలికామ్ బాక్సుపై ఆమె నిలబడి కర్రకు కట్టిన ముసుగును ప్రదర్శిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది.

దేశంలో కఠినమైన డ్రెస్‌కోడ్ చట్టాలను నిరసిస్తూ ప్రతి బుధవారం తెలుపు రంగు ధరించాలని ఇరాన్ మహిళలు చేపట్టిన ప్రచారానికి ఈ చిత్రాన్ని ఎక్కువగా వాడారు.

1979లో ఇరాన్ విప్లవం తర్వాత దేశంలో మహిళలు తమ జుట్టును కప్పేలా ముసుగు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ‘ఇస్లామిక్ లా ఆన్ మోడెస్టీ’ తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)