హార్ట్ ప్యాచెస్: చనిపోయిన గుండెను తిరిగి బతికించొచ్చా?

  • 9 మార్చి 2018
గుండె Image copyright iStock

ప్రపంచంలో అవయవాల దానం చాలా తక్కువ. అదీ గుండెను దానం చేయడం మరీ అరుదు. దీంతో హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నవారి జీవితం అర్ధాంతరంగా ముగుస్తోంది. దీనికి పరిష్కారంగా శాస్త్రవేత్తలు 'హార్ట్ ప్యాచెస్'ను తయారు చేసే పనిలో ఉన్నారు. అదే జరిగితే హృద్రోగులు కూడా మిగతా ఆరోగ్యవంతుల్లాగే మామూలుగా జీవించొచ్చు.

కార్డియాక్ అరెస్ట్ గుండెలోని కొన్ని భాగాలను నిర్వీర్యం చేస్తుంది. ఒకసారి నశించాక, ఆ కణాలు తిరిగి పుంజుకోలేవు.

అయితే దీనికి పరిష్కారాన్ని కనుగొన్నామని, దీని వల్ల వేలాది మంది ప్రాణాలను రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిరంతర ఆక్సిజన్ సరఫరా కోసం గుండె కరొనరీ ధమనుల మీద ఆధారపడుతుంది. అవి కనుక బ్లాక్ అయిపోయి, ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే, కొన్ని నిమిషాలలోనే గుండె కండరాల జీవకణాలు మరణించడం ప్రారంభిస్తాయి.

వైద్యులు ఒక గంటలోగా దానిని క్లియర్ చేయకుంటే, 100 కోట్లకు పైగా హృదయ కండరాల జీవకణాలు తిరిగి జీవం పోసుకోలేవు.

దీనిని తట్టుకుని బ్రతికిన వాళ్లు కూడా శాశ్వతంగా హృదయ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలి. ఒక్క యూకేలోనే ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య సుమారు 4.5 లక్షలు ఉండవచ్చని అంచనా.

ఈ సమస్యను ఎదుర్కొన్న వారిలో 50 శాతం మంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు.

''గుండె బలహీనం కావడం వల్ల తగినంత రక్తప్రసరణ జరగక గుండె పనిచేయడం ఆగిపోతుంది'' అని కేంబ్రిడ్జిలోని అడెన్ బ్రూక్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ సంజయ్ సిన్హా తెలిపారు.

Image copyright Getty Images

గుండెతో వచ్చిన సమస్య ఏమిటంటే, మన ఇతర శరీర భాగాలు - ఉదాహరణకు చర్మం, కాలేయంలా కాకుండా గుండెకు తనను తాను నయం చేసుకునే శక్తి చాలా తక్కువ. ఏడాదికి కేవలం 0.5 శాతం మాత్రమే గుండె కండరాల కణాల ప్రతిరూపకల్పన జరుగుతుంది. అందువల్ల దెబ్బ తింటే, తమంతట తాముగా అవి సరిదిద్దుకోలేవు. దీని వల్ల గుండెలోని కొన్ని భాగాలు పని చేయడం మానేస్తాయి.

ప్రస్తుతం హృదయ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం - గుండె మార్పిడి. అయితే గుండెను దానం చేసే వాళ్లు దొరకడం చాలా కష్టం. యూకేలో గుండె మార్పిడి ఆపరేషన్లు కేవలం ఏడాదికి 200 మాత్రమే జరుగుతున్నాయి.

ట్రాఫిక్ యాక్సిడెంట్లు లేదా తీవ్రమైన ప్రమాదాలలో గాయపడిన వాళ్ల నుంచి మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు పనికి వచ్చే గుండె లభిస్తోందని సంజయ్ సిన్హా తెలిపారు.

చిత్రం శీర్షిక హార్ట్ ప్యాచ్

దీనికి మరో ప్రత్యామ్నాయం - స్టెమ్ సెల్ మెడిసిన్. క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రవేత్తలు దెబ్బ తిన్న గుండెలోకి స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడం ద్వారా కండరాలను తిరిగి పని చేయించే ప్రయత్నం చేశారు.

ఇలాంటి ప్రయత్నాల ద్వారా దెబ్బ తిన్న రక్తనాళాలు పునరుజ్జీవం పొంది, గుండెకు రక్త సరఫరా పెరిగింది. అయితే ఈ విధానంలో చాలా కొద్దిగా మాత్రమే ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఇంజెక్ట్ చేసి స్టెమ్ సెల్స్‌లో 5 శాతం మాత్రమే గుండెకు అతుక్కోవడంలో సఫలమౌతున్నాయి.

అయితే కేంబ్రిడ్జి యూనివర్సిటీలో స్టెమ్ సెల్ బయాలజిస్టులతో పాటు సిన్హా ''హార్ట్ ప్యాచెస్'' అనే వినూత్నమైన ఆలోచన చేస్తున్నారు.

Image copyright Getty Images

ఏమిటీ ప్యాచ్ వర్క్?

2.5 చదరపు సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో చిన్న ముక్కల రూపంలో ఉండే ఈ గుండె కండరాలను ల్యాబ్‌లో తయారు చేస్తారు. నెల రోజుల వ్యవధిలో వీటిని అభివృద్ధి చేస్తారు.

రక్తకణాలను తీసుకుని, వాటిని స్టెమ్ సెల్స్‌గా రీప్రోగ్రామింగ్ చేసి, తర్వాత వాటిని ఏ భాగం కావాలంటే అవి - గుండె కండరాల కణాలు, రక్తనాళాల కణాల రూపంలోకి వాటిని మారుస్తారు.

హార్ట్ ప్యాచెస్ విషయానికి వస్తే, గుండె చుట్టూ ఉండే పొర వాటికి రూపాన్నిస్తుంది. ఇలా తయారు చేసిన కృత్రిమ గుండె కణజాలం, నిజమైన గుండె కణజాలంలాగే పని చేస్తుంది.

ఈ హార్ట్ ప్యాచెస్‌ను పేషెంట్ల రక్తం నుంచే తయారు చేయడం వల్ల, గుండె వాటిని తిరస్కరించే అవకాశం కూడా చాలా తక్కువ.

ప్రస్తుతం సిన్హా ఈ హార్ట్ ప్యాచెస్‌ను ఎలుకలు, పందులపై ప్రయోగిస్తున్నారు. అంతా సక్రమంగా జరిగితే, ఐదేళ్ల తర్వాత మానవులపై ప్రయోగాలను ప్రారంభిస్తారు.

Image copyright Getty Images

ఈ ప్యాచ్‌లు ఎలా పనిచేస్తాయి?

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీలు కూడా ఇదే బాటలో హార్ట్ ప్యాచెస్ తయారు చేసే పనిలో ఉన్నాయి.

ఈ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్, ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ ద్వారా గుండెలో దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. గుర్తించిన ప్రదేశానికి అనుగుణంగా వాళ్లు త్రీడీ ప్రింటర్ ద్వారా హార్ట్ ప్యాచ్‌ను తయారు చేస్తారు. అనంతరం సర్జన్లు ఛాతీ కుహరాన్ని తెరిచి, ఈ ప్యాచ్‌ను ధమనులు, సిరలతో కలిసి పని చేసేలా అమరుస్తారు.

దీనిలో ప్రధానమైన సమస్య - కొత్తగా అమర్చిన ప్యాచ్, ఏ మేరకు హృదయ స్పందనలకు అనుగుణంగా కొట్టుకుంటుంది అనేది.

అయితే గుండె నుంచి ఆ ప్యాచ్‌కు వెళ్లే విద్యుత్ సంకేతాలు ప్యాచ్‌ను కూడా అదే వేగంతో కొట్టుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ఈ ప్రయోగమే విజయవంతమైతే భవిష్యత్తులో గుండె జబ్బు ఉన్నవాళ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా తమ జీవితాన్ని గడిపేయొచ్చు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ప్రపంచంలో తొలి గుండె మార్పిడి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం