ట్రంప్-కిమ్ భేటీ: ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి!

  • 10 మార్చి 2018
ట్రంప్-కిమ్ Image copyright Getty Images

అమెరికా-ఉత్తర కొరియా అగ్రనేతలు చర్చలకు తొలిసారి అంగీకరించారు.

శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించేందుకు ట్రంప్-కిమ్ ఒప్పుకున్నారు.

ఇదివరకెప్పుడూ ఇరుదేశాల మధ్య ఇలాంటి సమావేశం జరగలేదు.

అయితే, శిఖరాగ్ర సమావేశానికి సమయం, తేదీ ఇంకా ఖరారు కాలేదని అమెరికా శుక్రవారం ప్రకటించింది.

అంతేకాదు, ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.

అయితే అణు కార్యక్రమాలను నిలిపివేయకపోతే ట్రంప్‌-కిమ్ సమావేశం జరిగే ప్రసక్తే లేదని వైట్‌హౌజ్‌ అధికార ప్రతినిధి సండర్స్ చెప్పారు.

ఉత్తర కొరియా మాత్రం మేలో ఈ సమావేశం జరుగుతుందని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రెండు దేశాల వైఖరి కొన్ని అనుమానాలకు తావిస్తోంది.

ప్రస్తుతానికి ఐదు ప్రధాన ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు.

Image copyright AFP
చిత్రం శీర్షిక అణు కార్యక్రమాలను నిలిపి వేసేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా జాతీయ భద్రత అధికారి చుంగ్ చెప్పారు

1. ట్రంప్-కిమ్ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ట్రంప్-కిమ్ సమావేశం జరుగుతుందని రెండు దేశాలు చెబుతున్నాయి. కానీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఉభయ కొరియాల మధ్య ఉన్న సంధి గ్రామం పాన్‌మున్జుమ్‌లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని మాడెన్ అభిప్రాయపడుతున్నారు.

అయితే, రెండు దేశాలకు చెందని ప్రాంతంలో అంటే చైనా, లేదా మరో దేశంలో ఈ కీలక సమావేశం జరిగొచ్చని కొరియా టాస్క్‌ఫోర్స్‌కు చెందిన జాన్ పార్క్ చెప్పారు.

అధికారం చేపట్టిన నాటి నుంచి విదేశీ అగ్ర నాయకులను కిమ్ కలవలేదు. వచ్చే ఏప్రిల్‌లో దక్షిణకొరియా అధ్యక్షుడితో కిమ్ భేటీ కాబోతున్నారు.

2. ట్రంప్-కిమ్ ఏం చర్చించబోతున్నారు?

ఇక ట్రంప్-కిమ్ ఏం చర్చించబోతున్నారన్నది రెండో ప్రశ్న.

అణునిరాయుధీకరణ అనేది కచ్చితంగా ప్రధాన అంశం అవుతుంది.

అందుకు కిమ్‌ కూడా సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి.

కానీ అణ్వాయుధాలను పూర్తిగా వదిలేస్తామని మాత్రం ఉత్తర కొరియా స్పష్టంగా చెప్పలేదు.

ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.

కానీ అణ్వాయుధాలను వదిలేసే ప్రసక్తే లేదని కిమ్‌ పదే పదే చెప్పారన్న విషయం మర్చిపోకూడదని రాండ్ కార్పొరేషన్‌కు చెందిన విశ్లేషకుడు బ్రూస్ బెన్నెట్‌ అన్నారు.

అణు కార్యక్రమాలు నిలిపివేయాలంటే తమను అణ్వాయుధ దేశంగా గుర్తించాలని అమెరికాను ఉత్తర కొరియా కోరొచ్చు.

ఒకవేళ దీనికి అమెరికా అంగీకరిస్తే ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని మాడెన్ అన్నారు.

అదే జరిగితే దక్షిణ కొరియా నుంచి తన సేనలను అమెరికా ఉపసంహరించుకోవచ్చు.

అయితే, అమెరికా సేనలు వెళ్లిపోయిన తర్వాత ఉభయకొరియాలను కిమ్ బలవంతంగా ఏకం చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు బ్రూస్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్-కిమ్ చర్చల్లో అణ్వాయుధాలపైనే ప్రధాన చర్చ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు

3. అమెరికా ఆంక్షల సంగతేంటి?

అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షలు విధించాయి.

తాజా పరిమాణాల నేపథ్యంలో ఎంతమేరకు ఆంక్షలను ఎత్తివేస్తారు అన్న విషయంలో స్పష్టత లేదు.

చర్చలు ఎంత వరకు ఫలిస్తాయన్న దానిపై ఈ అంశం అధారపడి ఉంటుంది.

ఆంక్షలు ఎత్తివేయాలని ఉత్తర కొరియా కచ్చితంగా డిమాండ్ చేస్తుంది.

అయితే, ఆంక్షలను ఆమెరికా పూర్తిగా ఎత్తివేస్తుందా.. లేక అణు నిరాయుధీకరణ తర్వాతే ఆంక్షలు తొలగిస్తామని చెబుతుందా అన్నది ఇక్కడ కీలకమని విశ్లేషకులు బ్రూస్ అన్నారు.

నిజానికి ఉత్తర కొరియా చర్చలకు రావడానికి అమెరికా ఆంక్షలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తర కొరియా వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం అక్టోబర్ నాటికి పూర్తిగా అయిపోతుంది.

అందుకే చర్చల్లో పట్టు విడుపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేసే క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా చెబుతోంది.

4. చర్చలు ఫలించేనా?

ఇరుదేశాధినేతలు ఒక శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తే చర్చలు ఫలించినట్లేనని మాడెన్ చెప్పారు.

అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపేసి, అంతర్జాతీయ పరిశీలకులను తమ దేశంలోకి ఉత్తర కొరియా అనుమతిస్తే చర్చలు ఫలించినట్లే అని ఆయన అన్నారు.

ఇది జరగాలంటే రెండు దేశాలు చర్చల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలని విశ్లేషకులు బ్రూస్ చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తానని 2017లో ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ అన్నారు

5. చర్చలు ఫలించకపోతే ఏం జరుగుతుంది?

చర్చలకు అమెరికా ఆటంకాలు కలిగిస్తోందని, తమ డిమాండ్లపై ట్రంప్‌ స్పందించడం లేదని చెబుతూ చర్చల ప్రక్రియ నుంచి ఉత్తర కొరియా తప్పుకోవచ్చని బ్రూస్ బెన్నెట్‌ చెప్పుకొచ్చారు.

ఒకవేళ చర్చలు జరిగినా.. ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోవచ్చు.

2030 నాటికి 200 అణ్వాయుధాలు కలిగి ఉండాలని ఉత్తర కొరియా భావిస్తోంది.

అదే జరిగితే దక్షిణ కొరియా మరింత ప్రమాదంలో పడినట్లే అని బెన్నెట్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ఈ కథనం గురించి మరింత సమాచారం