మరణంతో మెదడు పోరాడుతుందా? చనిపోయే ముందు ఏం జరుగుతుంది?

  • 11 మార్చి 2018
మెదడు Image copyright Getty Images

చనిపోయే సమయంలో ఏం జరుగుతుంది?

అది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే, పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ చారిటీ, అమెరికాలోని సిన్సినాటీ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కనిపెట్టారు. ఈ పరిశోధనకు జెన్స్ డ్రీర్ నాయకత్వం వహించారు.

Image copyright Getty Images

నాడీ వ్యవస్థ దెబ్బతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి మెదడుపై ఈ బృందం పరిశోధనలు చేసింది.

వారందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు. కొందరికి గుండెనొప్పి వచ్చింది. మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. వీటిని ఒక క్రమపద్ధతిలో చెప్పడానికి వీలులేదు.

ఈ రోగులపై అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక విషయం గుర్తించారు. మనషుల మెదడు, పశువుల మెదడు ఒకే రకంగా నశించడాన్ని కనిపెట్టారు.

అంతేకాదు, సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్లీ పనిచేసేలా చేయవచ్చని ఊహిస్తున్నారు. వీళ్ల పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే.

మరణానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే కాదు.. ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవడమే ఈ పరిశోధనల ఉద్దేశం.

Image copyright Getty Images

జంతువుల్లో ఇలా..

20వ శతాబ్దంలో జంతువులపై చేసిన పరిశోధనల ఫలితంగానే మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్త్రవేత్తలకు తెలిశాయి. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం..

గుండె పనిచేయడం ఆగిపోవడంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు. ఆ తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది.

అంటే మెదడు పనిచేయడానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్నమాట. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'సెరెబ్రల్ ఇస్కీమియా' అంటారు.

క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది. ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తాయి.

కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు.

'అడెనోసిన్ ట్రిఫాస్ఫేట్' క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన ఆయాన్లు అన్నీ వెళ్లిపోతాయి.

శక్తిని నిల్వ చేయడంతో పాటు.. దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయడానికి 'అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్' సహకరిస్తుంది.

మెదడులో 'అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్' క్షీణించడంతో కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది.

ఇదంతా కేవలం 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది.

ఆక్సిజన్, రక్త సరఫరా నిలిచిపోయిన 10 నిమిషాల్లో మెదడులోని కణాలు పూర్తిగా చనిపోతాయి.

మరి మనుషుల్లో ఎలా?

చనిపోవడానికి ముందు మనుషుల మెదడు ఎలా స్పందిస్తుంది? అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది.

ఇందుకోసం చావు బతుకుల్లో ఉన్న తొమ్మిది మంది రోగులపై శాస్త్రవేత్త జెన్స్ డ్రీర్ పరిశోధన చేశారు. ఎలక్ట్రోడ్ స్ట్రిప్‌ల సహాయంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు.

తొమ్మిది మందిలో ఎనిమిది మంది రోగుల మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

మృత్యువు కబళించకుండా మెదడు కణాలు ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు.

సాధారణంగా న్యూరాన్లు ఆయాన్ల శక్తిని సంగ్రహించి పనిచేస్తాయి. తమలో, తమ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి.

ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్‌ల రూపంలో ఒక చోటు నుంచి మరోచోటికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ అసమతౌల్య స్థితిని న్యూరాన్లు నిరంతరం కొనసాగిస్తాయి.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబెంగళూరులో మనిషి మెదళ్లతో మ్యూజియం

కణాలు రక్తం నుంచి శక్తిని, ఆక్సిజన్‌ను గ్రహించి న్యూరాన్లకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే, చనిపోయిన తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది.

ఫలితంగా న్యూరాన్లకు ఆక్సిజన్ అందదు. ఆ పరిస్థితిలో తమలో మిగిలిపోయిన శక్తిని న్యూరాన్లు సమీకరించుకుంటాయని పరిశోధకులు చెప్పారు.

చివరి క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృధా ప్రయాస. అందుకే న్యూరాన్లు నిశబ్దంగా ఉంటాయి. తిరిగి రక్త ప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురుచూస్తూ ఉంటాయి. కానీ అది ఎప్పటికీ జరగదు.

ఇలాంటి పరిస్థితి మెదడు మొత్తం ఒకేసారి ఎదురవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ‘అన్‌డిస్పర్స్‌డ్ డిప్రెషన్’ అంటారు.

Image copyright Getty Images

ఆ తర్వాత మెదడులో ఉష్ణ సునామీ వస్తుంది. దీన్ని ‘డీపోలరైజేషన్ ఆఫ్ డిఫ్యూజన్’ అంటారు.

మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రో-కెమికల్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఈ అసాధారణ ఉష్ణ శక్తి వెలువడుతుంది.

మెదడు కణాలు మొద్దుబారడానికి, ధ్వంసం కావడానికి ఇది కారణం అవుతుంది.

క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో మెదడు మొత్తం మొద్దుబారిపోయింది.

పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలాగే జరిగింది.

అయితే, మరణానికి ఇదొక్కటే కారణం కాదని, ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు