హాంకాంగ్: నెలకు రూ. 30 వేలు అద్దెకట్టి బోనుల్లో బతుకుతున్నారు

  • 12 మార్చి 2018
హాంగ్‌కాంగ్‌, వృద్ధులు Image copyright Getty Images
చిత్రం శీర్షిక హాంకాంగ్‌లో బోన్లలో నివసిస్తున్న వృద్ధులు

ఒక మీటరు పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల ఎత్తు ఉన్న బోను - ఇలాంటి మూడు బోన్లను ఒకదానిపై ఒకటి ఊహించుకోండి. ఇప్పుడు దాన్నే మీ ఇల్లనుకోండి.

హాంకాంగ్‌లో భారీ అద్దెలు చెల్లించలేని ప్రజలు ఇప్పుడు అలాంటి బోన్లలోనే జీవించడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ల సంఖ్య ఎంత భారీగా ఉందంటే 2017లో అలాంటి పరిస్థితుల్లో నివసించే వారి సంఖ్య రికార్డుస్థాయికి చేరింది.

అదే సమయంలో డెమోగ్రాఫియా సంస్థ నిర్వహించిన సర్వేలో వరుసగా ఎనిమిదో ఏడాది హాంకాంగ్‌.. జీవించేందుకు చోటు దొరకడం అత్యంత కష్టమైన ప్రదేశాల జాబితాలో మొదటిస్థానాన్ని పొందింది.

అయితే ఈ బోన్లు ఊరికే లభిస్తాయని మీరు భావిస్తే మాత్రం అది తప్పే. వాటికి కూడా సుమారు రూ. 30 వేల నెలవారీ అద్దె చెల్లించాలి.

వాటిలో జీవించడం చాలా దుర్భరం. వాటిలో నివసించేవారంతా తమ పుస్తకాలు, దుస్తులు, ఆహారం.. అన్నీ ఆ బోన్లలో సర్దుకోవాల్సిందే. రాత్రి అయితే భద్రత కోసం వాటికి తాళం వేసుకుంటారు.

Image copyright James Law Cybertecture
చిత్రం శీర్షిక ఓపోడ్స్

పరిష్కారం

ఈ సమస్యకు పరిష్కారంగా అనేక మంది ప్రయోగాలు చేశారు.

డ్రైనేజీ వాటర్ సరఫరా కోసం ఉపయోగించే కాంక్రీట్ పైపులాంటి వాటిలో చిన్న అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఇందులో ఒకటి. వాటిని 'ఓపాడ్స్' అంటారు. ఈ ఓపాడ్స్‌లో ఒక చిన్న బాత్ రూం, కిచెన్, ఫర్నిచర్ మాత్రం ఉంటుందని ఆర్కిటెక్ట్ జేమ్స్ లా తెలిపారు.

ఇలాంటి సమస్య హాంకాంగ్‌ ఒక్క నగరానిదే కాదు. జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, న్యూజీలాండ్‌ లాంటి దేశాలలో అద్దెలు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఆదాయం, వ్యయం మధ్య తీవ్ర అంతరాలున్న ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

విదేశీ మిలియనీర్లు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల వాటి ధరలు పెరిగిపోతున్నాయని, దానివల్ల అద్దెలు చెల్లించలేకపోతున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు.

Image copyright Getty Images

25 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌లో 75 శాతం మంది ప్రజలకు సొంత ఇల్లు ఉంటే, నేడు వారి సంఖ్య 64 శాతానికి పడిపోయింది.

ఈ సమస్యకు పరిష్కారంగా న్యూజీలాండ్ ప్రభుత్వం విదేశీయులు తమ దేశంలో ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే వీలు లేకుండా చట్టం చేసే యోచనలో ఉంది.

అయితే ఈ సమస్యకు ఇతర కోణాలున్నాయని కూడా కొంతమంది భావిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హాంకాంగ్‌

ఇతర కారణాలు

ఇలా విపరీతంగా ఇళ్ల ధరలు పెరిగిపోయిన నగరాల జాబితాలో లండన్ కూడా ఉంది. గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు ఇక్కడ రెట్టింపు అయ్యాయి.

కొన్ని సందర్భాలలో ఇక్కడి ప్రజలు అంతంత మాత్రంగా ఉన్న గ్యారేజ్‌లనే తమ నివాసాలుగా మార్చుకున్న సందర్భాలున్నాయి. మరికొందరు చిన్నచిన్న నివాసాల్లో నివసిస్తుండగా, ఇంకొందరు ఇళ్లను షేర్ చేసుకుంటున్నారు.

ఇక్కడ కూడా విదేశీ ఇన్వెస్టర్లే ఇళ్ల ధరలు పెరగడానికి కారణమనే భావన ఉన్నా, రుణాల లభ్యత, పరిస్థితులు కూడా చూడాలని హెన్రీ ప్రయర్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అభిప్రాయపడ్డారు.

అనేక నగరాలలో ప్రస్తుతం హాంకాంగ్‌లో లాగా బోనుల్లో నివసించే పరిస్థితి లేకున్నా, భవిష్యత్తులో తొందరగా పరిష్కారం కనుగొనకపోతే మాత్రం ఓపోడ్స్ లాంటి ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు